
స్వదేశంలో పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ నాయకత్వం వహించనున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఐపీఎల్-2025లో పాల్గోనేందుకు వెళ్లడంతో లాథమ్‌ను సారథిగా కివీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ న్యూజిలాండ్ జట్టులో భాగమైన ఎనిమిది మంది ఆటగాళ్లు పాక్‌తో సిరీస్‌కు ఎంపికయ్యారు. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్ వంటి స్టార్ ప్లేయర్లు ఐపీఎల్‌లో బీజీబీజీగా ఉండడంతో ఈ సిరీస్‌కు ఎంపిక కాలేకపోయారు. మరోవైపు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అదేవిధంగా కైల్ జామిసన్ కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక బ్యాటర్లు నిక్ కెల్లీ, ముహమ్మద్ అబ్బాస్‌లకు తొలిసారి కివీస్ జట్టులో చోటు దక్కింది.
దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతుండడంతో వీరిద్దరికి సెలక్టర్లు అవకాశమిచ్చారు. నిక్ కెల్లీ ప్లంకెట్ షీల్డ్‌లో నాలుగు సెంచరీలతో సహా 749 పరుగులు చేయగా.. ముహమ్మద్ అబ్బాస్, వన్డే టోర్నమెంట్ ఫోర్డ్ ట్రోఫీలో 340 పరుగులు చేశాడు. పాకిస్తాన్ మూలాలు ఉన్న అబ్బాస్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాడు. అవసరమైతే బంతితో కూడా అతడు రాణించగలడు. అదేవిధంగా స్పిన్నర్ అదితి ఆశోక్ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత కివీస్ జట్టులోకి వచ్చాడు.
వన్డే ప్రపంచకప్ మరో రెండేళ్లలో జరగనుండడంతో, కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి ఇదే సరైన సమయమని కివీస్ క్రికెట్ సెలక్టర్ ఒకరు పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్-పాక్ మధ్య వన్డే సిరీస్ మార్చి 29 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కివీస్ మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.
పాకిస్తాన్ సిరీస్ కోసం న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, ఆది అశోక్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, మిచ్ హే, నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విల్ యంగ్
Comments
Please login to add a commentAdd a comment