
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విధుల నేపథ్యంలో బిజీగా ఉండగా.. అతడి స్థానంలో టామ్ లాథమ్ (Tom Latham)ను సెలక్టర్లు తాత్కాలిక సారథిగా ఎంపిక చేశారు. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తాజాగా గాయపడ్డాడు.
బ్రేస్‌వెల్‌కే సారథ్య బాధ్యతలు
పాక్‌తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో టామ్ లాథమ్ కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. దీంతో పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొత్తానికి లాథమ్ దూరమయ్యాడు. అతడి స్థానంలో హెన్రీ నికోల్స్ జట్టులోకి రాగా.. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ వన్డే టోర్నమెంట్ టైటిల్ పోరులో మాత్రం చేతులెత్తేసింది. టీమిండియా చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలై.. రెండోసారి ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని చేజార్చుకుంది.
ఈ మెగా ఈవెంట్ కంటే ముందు త్రైపాక్షిక వన్డే సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్‌లో పర్యటించిన కివీస్ జట్టు.. దక్షిణాఫ్రికా, ఆతిథ్య పాక్‌లను ఓడించి విజేతగా నిలిచింది.
4-1తో పాక్‌ను చిత్తు చేసిన కివీస్
ఇక, చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ స్వదేశంలో పాకిస్తాన్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. పొట్టి సిరీస్‌లో పాక్‌పై అద్భుత విజయం సాధించింది. మైకేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్సీలో 4-1తో సల్మాన్ ఆఘా బృందంపై గెలుపొంది సిరీస్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో శనివారం (మార్చి 29) నుంచి న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇక ఐపీఎల్ కారణంగా డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తదితరులు జట్టుకు దూరం కాగా.. కీలక పేసర్ మ్యాట్ హెన్రీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు.. పాక్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కైలీ జెమీషన్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
ఈ నేపథ్యంలో.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న నిక్ కెల్లీ, మహ్మద్ అబ్బాస్‌లకు తొలిసారి న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. ఇక టామ్ లాథమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన హెన్రీ నికోల్స్ ఇప్పటి వరకు 78 వన్డేలు ఆడాడు.
అయితే, మోకాలి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న అతడు.. దేశవాళీ క్రికెట్‌తో పునరాగమనం చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లో ఐదు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు.
మరోవైపు.. విల్ యంగ్ పాక్‌తో తొలి వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. అతడి భార్య తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో రెండు, మూడో వన్డేలకు అతడు దూరంగా ఉండనున్నట్లు సెలక్టర్లు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ కవర్‌గా రైస్ మరియూకు తొలిసారి పిలుపునిచ్చినట్లు తెలిపారు.
పాకిస్తాన్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు
మైకేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), మహ్మద్ అబ్బాస్, ఆది అశోక్, విల్ యంగ్/రైస్ మరియూ, మార్క్ చాప్‌మన్, జేకబ్ డఫీ, మిచ్ హే, నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, బెన్ సియర్స్, నాథన్ స్మిత్.
న్యూజిలాండ్‌తో వన్డేలకు పాకిస్తాన్ జట్టు
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆకిఫ్ జావేద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, ముహమ్మద్ వాసిం జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సూఫియాన్ ముఖీమ్, తయ్యాబ్ తాహిర్.
చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమి