ఈనెల (నవంబర్) 23 నుంచి పాకిస్తాన్‌లో జరగాల్సిన అంధుల టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా వైదొలిగింది. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో టీమిండియా ఈ మెగా టోర్నీని బాయ్‌కాట్ చేసింది. టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలుగుతున్న విషయాన్ని భారత అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ ధృవీకరించారు.
ఇండియా టుడేతో ఆయన మాట్లాడుతూ.. అంధుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత ప్రభుత్వం (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) అనుమతి నిరాకరించిందని తెలిపారు. తొలుత ఈ టోర్నీలో పాల్గొనేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసింది.
అయితే చివరి నిమిషంలో పాక్ పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. భారత అంధుల క్రికెట్ సంఘానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి లిఖితపూర్వమైన ఆదేశాలు రావాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాల్గొనడం లేదు.
ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఈ టోర్నీలో భారత్ పాల్గొనకపోవడంతో పాకిస్తాన్‌కు వాక్ ఓవర్ లభిస్తుంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొనకపోయినా ఎలాంటి నష్టం లేదని పాకిస్తాన్ అంధుల క్రికెట్ కౌన్సిల్ (PBCC) తెలిపింది. తమవరకైతే భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేశామని పీబీసీసీ పేర్కొంది.
కాగా, అంధుల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియానే విజేతగా నిలిచింది. 2022 ఎడిషన్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌పై 120 పరుగుల తేడాతో గెలుపొంది మూడోసారి జగజ్జేతగా నిలిచింది.
ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం భారత్ పాక్‌లో పర్యటించబోదని బీసీసీఐ ఐసీసీకి తేల్చి చెప్పంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌లో పర్యటించడం సాధ్యం కాదని బీసీసీఐ ఖరాఖండిగా చెప్పింది.
తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు నిర్వహిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐ అంటుంది. దీనికి పాక్ అంగీకరించడం లేదు. తాజాగా భారత అంధుల క్రికెట్ టీమ్ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట భారత ప్రభుత్వం పురుషుల కబడ్డీ టీమ్‌ను కూడా పాకిస్తాన్‌కు పంపలేదు.
Comments
Please login to add a commentAdd a comment