Blind Cricket T20 World Championship
-
పాక్‌కు షాక్.. అంధుల టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్
ఈనెల (నవంబర్) 23 నుంచి పాకిస్తాన్లో జరగాల్సిన అంధుల టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా వైదొలిగింది. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో టీమిండియా ఈ మెగా టోర్నీని బాయ్‌కాట్ చేసింది. టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలుగుతున్న విషయాన్ని భారత అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడుతూ.. అంధుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత ప్రభుత్వం (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) అనుమతి నిరాకరించిందని తెలిపారు. తొలుత ఈ టోర్నీలో పాల్గొనేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసింది. అయితే చివరి నిమిషంలో పాక్ పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. భారత అంధుల క్రికెట్ సంఘానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి లిఖితపూర్వమైన ఆదేశాలు రావాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాల్గొనడం లేదు. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఈ టోర్నీలో భారత్ పాల్గొనకపోవడంతో పాకిస్తాన్‌కు వాక్ ఓవర్ లభిస్తుంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొనకపోయినా ఎలాంటి నష్టం లేదని పాకిస్తాన్ అంధుల క్రికెట్ కౌన్సిల్ (PBCC) తెలిపింది. తమవరకైతే భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేశామని పీబీసీసీ పేర్కొంది.కాగా, అంధుల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియానే విజేతగా నిలిచింది. 2022 ఎడిషన్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌పై 120 పరుగుల తేడాతో గెలుపొంది మూడోసారి జగజ్జేతగా నిలిచింది.ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం భారత్ పాక్‌లో పర్యటించబోదని బీసీసీఐ ఐసీసీకి తేల్చి చెప్పంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌లో పర్యటించడం సాధ్యం కాదని బీసీసీఐ ఖరాఖండిగా చెప్పింది. తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు నిర్వహిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐ అంటుంది. దీనికి పాక్ అంగీకరించడం లేదు. తాజాగా భారత అంధుల క్రికెట్ టీమ్ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట భారత ప్రభుత్వం పురుషుల కబడ్డీ టీమ్‌ను కూడా పాకిస్తాన్‌కు పంపలేదు. -
భారత్ అ‘ద్వితీయం’
రెండోసారి అంధుల టి20 ప్రపంచకప్ టైటిల్ సొంతం ఫైనల్లో పాక్‌పై తొమ్మిది వికెట్లతో విజయం బెంగళూరు: లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా... అంతిమ సమరంలో అద్వితీయ ఆటతీరుతో భారత జట్టు అదరగొట్టింది. ఈ క్రమంలో టీమిండియా రెండోసారి అంధుల టి20 క్రికెట్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరిన పాక్ తుది పోరులో మాత్రం ఓటమి చవిచూసింది. 2012లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో పాకిస్తాన్‌పైనే గెలిచి భారత్ టైటిల్ దక్కించుకుంది. ఐదేళ్ల విరామం తర్వాత జరిగిన రెండో టి20 ప్రపంచకప్‌లోనూ భారత్ ఆద్యంతం ఆకట్టుకునే ఆటతో విజేతగా నిలిచింది. ఫైనల్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. మునీర్ (37 బంతుల్లో 57; 8 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కేతన్ పటేల్, ఇక్బాల్ రెండేసి వికెట్లు తీయగా... అజయ్ కుమార్ రెడ్డి, సునీల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి 200 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్ ప్రకాశ్ జయరామయ్య (60 బంతుల్లో 99 నాటౌట్; 15 ఫోర్లు) సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచాడు. అజయ్ కుమార్ రెడ్డి(31 బంతుల్లో 43; 4 ఫోర్లు) తో కలిసి ప్రకాశ్ తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించాడు. అజయ్ అవుటయ్యాక కేతన్ పటేల్ (13 బంతుల్లో 26 రిటైర్డ్ హర్ట్)తో కలిసి రెండో వికెట్‌కు ప్రకాశ్ 51 పరుగులు జతచేశాడు. కేతన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో అతని స్థానంలో వచ్చిన దున్నా వెంకటేశ్వర రావు (11 బంతుల్లో 11 నాటౌట్; ఒక ఫోర్)తో కలిసి ప్రకాశ్ భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. విజేతగా నిలిచిన భారత్‌కు రూ. 3 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది. ప్రకాశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ పురస్కారం దక్కింది. అజయ్ అదుర్స్... భారత జట్టు రెండోసారి టి20 ప్రపంచకప్ సాధించడంలో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కీలకపాత్ర పోషించాడు. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన 26 ఏళ్ల అజయ్ కుమార్ రెడ్డి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన అజయ్ మొత్తం 296 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో అజయ్ 9 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన దున్నా వెంకటేశ్వర రావు, టి. దుర్గా రావు (శ్రీకాకుళం), జి. ప్రేమ్ కుమార్ (కర్నూలు) కూడా ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ►భారత జట్టు అంధుల టి20 ప్రపంచకప్ గెలిచినందుకు ఆనందంగా ఉంది. జట్టు సభ్యులందరికీ అభినందనలు. మీ విజయంపట్ల యావత్ దేశం గర్వపడుతోంది. – ప్రధాని నరేంద్ర మోది. ► గతేడాది రియో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరిశారు. ఈ ఏడాది అంధుల క్రికెట్ జట్టు రెండోసారి టి20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచి భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. – కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ ► తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అంధుల టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గడం ద్వారా భారత జట్టు నిరూపించింది. మీ అందరి ప్రదర్శన అద్భుతం. – సచిన్ టెండూల్కర్