
బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ సంచనలనం నమోదు చేసింది. భారత్ నుంచి కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన అనహత్ సింగ్ తొలి రౌండ్‌ను దిగ్విజయంగా ముగించింది. రౌండ్ ఆఫ్ 64.. స్క్వాష్ గేమ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్ జరగ్గా.. సెయింట్ విన్‌సెంటి అండ్ గ్రెనడైన్స్‌కి చెందిన జాడా రాస్‌ను ఓడించిన అనహత్ సింగ్ రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది.
మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన అనహత్ జాడా రాస్‌ను 11-5,11-2,11-0తో వరుస గేమ్‌ల్లో ఓడించింది. తొలి రౌండ్ గేమ్‌లో జాడా రాస్ ఐదు పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికి.. ఏ మాత్రం తడబడని అనహత్.. ఆ తర్వాత ఆధిక్యంలోకి వెళ్లడమే గాక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా మూడు గేమ్స్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక రౌండ్ ఆఫ్ 32లో అనహత్ సింగ్.. వేల్స్‌కు చెందిన ఎమిలి విట్‌లాక్‌తో తలపడనుంది.