స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం
సెమీస్‌కు చేరిన దీపిక, సౌరవ్
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో ఇప్పటిదాకా స్క్వాష్‌లో మహిళలు వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈసారి ఆ లోటు తీరనుంది. తన పుట్టిన రోజు నాడు స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మెరిసింది. సహచరురాలు జోష్న చిన్నప్పతో జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో నెగ్గి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్‌లోనూ ఆసియా నంబర్ వన్ సౌరవ్ ఘోషాల్ కూడా సెమీస్‌కు చేరి పతకంపై భరోసానిచ్చాడు. దీంతో భారత్ తొలిసారిగా రెండు సింగిల్స్ విభాగాల్లో పతకాలు సాధించినట్లవుతుంది. 1998 ఏషియాడ్‌లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటినుంచి భారత సింగిల్స్ క్రీడాకారిణులు పతకం అందుకోలేకపోయారు. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో దీపిక 7-11, 11-9, 11-8, 15-17, 11-9 తేడాతో జోష్నను ఓడించి సెమీస్‌లో ప్రవేశించింది. సెమీస్‌లో దీపిక ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)తో తలపడనుంది. ఆసియా గేమ్స్‌లో ఇప్పటిదాకా నికోల్ ఓడింది లేదు. ఇక పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ 11-6, 9-11, 11-2, 11-9 తేడాతో పాక్ ఆటగాడు నాసిర్ ఇక్బాల్‌ను ఓడించి సెమీస్‌కు చేరాడు.
ఇతర క్రీడల్లో ఫలితాలు:
టెన్నిస్: పురుషుల టీమ్ ఈవెంట్ రెండో రౌండ్‌లో భారత్ 3-0 తేడాతో నేపాల్‌ను ఓడించింది.
ఫుట్‌బాల్: థాయ్‌లాండ్‌తో జరిగిన మహిళల ఫుట్‌బాల్ గ్రూప్ ‘ఎ’ తొలి రౌండ్‌లో భారత్ 0-10 తేడాతో చిత్తుగా ఓడింది.
స్విమ్మింగ్: ఆదివారం మూడు ఈవెంట్లలో బరిలోకి దిగిన భారత స్విమ్మర్లు పూర్తిగా నిరాశపరిచారు. పురుషుల 100మీ. బ్యాక్‌స్ట్రోక్ హీట్‌లో ప్రతాపన్ నాయర్ ఏడో స్థానంలో నిలిచాడు. 200మీ. ఫ్రీస్టయిల్ హీట్‌లో సౌరభ్ సంగ్వేకర్ ఐదో స్థానం, 200మీ. బటర్‌ఫ్లయ్ హీట్‌లో ఏగ్నెల్ డిసౌజా నాలుగో స్థానం పొందారు.
రోయింగ్: పురుషుల సింగిల్స్ స్కల్క్ హీట్‌లో సవర్ణ్ సింగ్ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే లైట్‌వెయిట్ పురుషుల క్వాడ్రపల్ స్కల్స్ హీట్‌లో రాకేశ్, విక్రమ్, లక్ష్మీనారాయణ్, తోమర్ శోకేందర్ నాలుగో స్థానంలో నిలిచారు.
హ్యాండ్‌బాల్: పురుషుల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘డి’లో కొరియా చేతిలో 19-39 తేడాతో ఓడిపోగా మహిళల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘ఎ’లో థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ 26-26 స్కోరుతో టై అయింది.
జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్: పురుషుల వ్యక్తిగత అర్హత, టీమ్ ఫైనల్‌లో భారత జట్టు పదో స్థానంలో నిలిచింది.
ఈక్వెస్ట్రియన్: డ్రెస్సేజ్ వ్యక్తిగత ఇంటర్మీడియట్‌లో శ్రుతి వోరా 13వ స్థానంలో, నాదియా హరిదాస్ 19, రాజేంద్ర శుభశ్రీ 29, వనిత మల్హోత్రా 30వ స్థానంలో నిలిచి నిరాశపరిచారు.
సైక్లింగ్: మహిళల కీరిన్ ఫైనల్స్‌లో దెబోరా తొమ్మిదో స్థానంలో రాగా మోహన్ మహిత 11వ స్థానంలో నిలిచింది.
బాస్కెట్ బాల్: పురుషుల క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత జట్టు 67-73 తేడాతో సౌదీ అరే బియాతో ఓడింది.