Deepika pallikal
-
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా తాజాగా వీడ్కోలు పలికాడు.తన 39వ పుట్టినరోజున దినేశ్ కార్తిక్ ఈ మేరకు ఇన్‌స్టా ఉద్వేగపూరిత పోస్ట్‌తో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘గత కొన్ని రోజులుగా నాకు లభిస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలలో తడిసి ముద్దవుతున్నా. దీనకంతటికి కారణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. బాగా ఆలోచించిన తర్వాత రిప్రెజెంటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా.దీపికకు కూడా చాలా రుణపడి పోయాను!ఈ ప్రయాణంలో నాకు సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం.నేను ఇక్కడిదాకా చేరుకోవడానికి నా తల్లిదండ్రులే కారణం. వారి ఆశీర్వాదాలు లేకుండా నేను ఇదంతా సాధించేవాడినే కాదు. దీపికకు కూడా చాలా రుణపడి పోయాను.తను స్వతహాగా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ తన కెరీర్ కొనసాగిస్తూనే నాకూ అండగా నిలిచింది. ఇక అందరికంటే పెద్ద థాంక్స్ చెప్పాల్సింది నా అభిమానులకే! క్రికెట్ అయినా.. క్రికెటర్లు అయినా... మీ మద్దతు లేకుండా ఏదీ సాధ్యం కాదు’’ అని దినేశ్ కార్తిక్ సుదీర్ఘ నోట్ రాశాడు.2004లో అరంగేట్రంతమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది.. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.మొత్తంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన డీకే 3463 పరుగులు చేశాడు. 172 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే! -
నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య భావోద్వేగం
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. మేము 2013లో తొలిసారి ఒకరినొకరం నేరుగా కలిశాం. ఇద్దరి మనసులోనూ కలిసి జీవించాలనే ఆలోచనే వచ్చింది. ఆ తర్వాత అన్నీ సజావుగా సాగిపోయాయి.తనలో నాకు నచ్చే గొప్ప గుణం ఏమిటంటే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగటం. బాగా ఆడలేక విమర్శలు ఎదుర్కొన్నపుడు.. జట్టులో స్థానం కరువైనపుడు రెండు- మూడు రోజుల పాటు కాస్త నిరాశగా కనిపిస్తాడు.తిరిగి వెంటనే కోలుకుని తర్వాత ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడతాడు. నాకు తెలిసి అలాంటి స్థితిలో వేరే ఎవరైనా ఉంటే కచ్చితంగా చాలా రోజుల పాటు కుంగిపోతారు.వదిలేసేదాన్నేమో!నేను కూడా అథ్లెట్‌నే కాబట్టి అప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలను. తన స్థానంలో గనుక నేనే ఉంటే.. ఇక చాల్లే అని వదిలేసేదాన్నేమో!కానీ తను అలా కాదు. తన కెరీర్లో వివిధ దశల్లో విభిన్న పాత్రలు పోషించాల్సి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోనూ తను పట్టుదలగా నిలబడ్డాడు.గతం కంటే మెరుగ్గా ఆడుతూ ముందుకు సాగాడు. డీకే తన జీవితంలో ఏవైతే సాధించాలనుకున్నాడో అన్నీ సాధించేశాడు. ఒక అథ్లెట్ లైఫ్‌లో అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.అలాంటి వ్యక్తి ఇకపై ఆటకు దూరంగా ఉండాలంటే అంత సులువేమీ కాదు. అయితే, వ్యక్తిగతంగా తన జీవితంలో ముందుకు సాగాలని అతడు నిర్ణయించుకున్నాడు.తన కోసం, తన కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను సాధించిన విజయాలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ భార్య దీపికా పళ్లికల్ ఉద్వేగానికి లోనయ్యారు.తన భర్త కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడని.. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తాను అనుకున్న స్థాయికి చేరుకున్నాడని తెలిపారు. కాగా ఐపీఎల్లో ఆరంభం నుంచి పదిహేడేళ్ల పాటు కొనసాగిన క్రికెటర్లలో ఒకడైన దినేశ్ కార్తిక్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్బైఐపీఎల్-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన అతడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. రాజస్తాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఓటమితో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు.ఈ నేపథ్యంలో దినేశ్ కార్తిక్ భార్య, భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ పైవిధంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా దీపికా పళ్లికల్ కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగుసార్లు భారత్ తరఫున పతకాలు సాధించారు. ఆసియా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ మెడల్స్ గెలిచారు. డీకే- దీపిక 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు(కవలలు) సంతానం.చదవండి: Dinesh Karthik: మొదటి భార్య మోసం: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!DK, We love you! ❤ Not often do you find a cricketer who’s loved by everyone around him. DK is one, because he was smart, humble, honest, and gentle! Celebrating @DineshKarthik's career with stories from his best friends and family! 🤗#PlayBold #ನಮ್ಮRCB #WeLoveYouDK pic.twitter.com/fW3bLGMQER— Royal Challengers Bengaluru (@RCBTweets) May 24, 2024 -
స్వర్ణం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య
హ్వాంగ్జౌ (చైనా): ఆసియా స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన దీపిక పల్లికల్ (క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య) – హరీందర్‌పాల్ సింగ్ సంధు జోడి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో దీపిక – హరీందర్ 11–10, 11–8 స్కోరుతో ఇవాన్ యూయెన్ – రాచెల్ ఆర్నాల్డ్ (మలేసియా)పై విజయం సాధించారు. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్లో మలేసియాకు చెందిన టాప్ సీడ్ ఆయిరా అజ్మాన్ – షఫీక్ కమాల్‌ను...సెమీ ఫైనల్లో తయ్యద్ అస్లామ్ – ఫైజా జఫర్ (పాకిస్తాన్)ను భారత ద్వయం ఓడించింది. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌ను భారత్ రెండు పతకాలతో ముగించింది. భారత్‌కు చెందిన అనాహట్ సింగ్ – అభయ్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. -
మురళీ విజయ్‌కు చేదు అనుభవం, డీకే..డీకే అంటూ ఫాన్స్ కేకలు.. అతనేం చేశాడంటే..!
టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిక్కి వారియర్స్‌కు ఆడుతున్న విజయ్ను మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు ఆట పట్టించారు. విజయ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా డీకే.. డీకే అంటూ కేకలు పెడుతూ తీవ్ర అసౌకర్యానికి గురి చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్‌కు దండం పెడుతూ అరవద్దని ప్రాధేయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట వైరలవుతోంది. #TNPL2022 DK DK DK ...... Murali Vijay reaction pic.twitter.com/wK8ZJ84351 — Muthu (@muthu_offl) July 7, 2022 కాగా, డీకే (దినేష్ కార్తీక్) మొదటి భార్య నిఖిత వంజరను మురళీ విజయ్ అనైతికంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత డీకే.. ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం డీకే కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతూ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. విజయ్ సరైన అవకాశాలు లేక గల్లీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు. చదవండి: ఆఖరి ఓవర్లో సిక్సర్‌తో టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే? -
టీమిండియా క్రికెటర్‌కు డబుల్ ధమాకా.. కవల పిల్లలు జననం
Dinesh Karthik And Dipika Pallikal Blessed With Two Baby Boys: టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన భార్య దీపికా పల్లికల్ ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చిందని గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘ముగ్గురం ఐదుగురం అయ్యాం’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఇక్కడ డీకే తన పెంపుడు కుక్కను కూడా కుటుంబంలో కలుపుకుని చెప్పడం విశేషం. కాగా, దినేష్ కార్తీక్, దీపికా పల్లికల్‌లకు 2015లో వివాహం జరిగింది. దీపికా పల్లికల్ దేశంలోని ప్రముఖ స్క్వాష్ ప్లేయర్లలో ఒకరు. చదవండి: పాక్ గెలుపు సంబురాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు: యూపీ సీఎం View this post on Instagram A post shared by Dinesh Karthik (@dk00019) -
ఆ పంచ్ నా భర్తపై ప్రయోగిస్తా: దీపికా పల్లికల్
ముంబై: ''మీరు చెప్పే హుక్ పంచ్‌ను నా భర్త దినేశ్ కార్తిక్‌పై ప్రయోగిస్తానంటూ'' ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాక్సర్ నిఖత్ జరీన్ అడిగిన ప్రశ్నకు దీపిక ఈ విధంగా సమాధానమిచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ అడిడాస్ నిర్వహించిన ఒక ఈవెంట్‌కు దీపికా పల్లికల్‌తో పాటు 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, ఇండియన్ బాక్సర్ నిఖత్ జరీన్‌లు హాజరయ్యారు. అడిడాస్ నిర్వహించిన వాచ్ అస్ మూవ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో పాల్గొన్న వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. బాక్సర్ నిఖత్ జరీన్ తన ఫేవరెట్ షాట్ అయిన హుక్ పంచ్‌ను ప్రస్తావించిది. తాను ఆ పంచ్‌ను ఎలా ఉపయోగిస్తాననేది దీపికా, మానుషి చిల్లర్‌కు వివరించింది. ఈ నేపథ్యంలో ''దీపికా.. మీరు హుక్ పంచ్‌ను ఎవరిపై ప్రయోగిస్తారు'' అని నిఖత్ జరీన్ ప్రశ్నించింది. నిఖత్ ప్రశ్నకు దీపిక వెంటనే స్పందిస్తూ '' వేరే వాళ్లపై ప్రయోగిస్తే ఊరుకోరు.. అందుకే నేను ఈరోజే నా భర్త కార్తిక్‌పై ప్రయోగిస్తా..'' అంటూ చెప్పడం అక్కడున్న వారందరికి నవ్వు తెప్పించింది. ఇంటికి వెళ్లగానే కార్తిక్‌కు హుక్ పంచ్ గురించి వివరించి దానిని అమలు పరిచేలా చూస్తానని దీపికా తెలిపింది. ఇండియన్ స్క్వాష్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన దీపికా పల్లికల్ 2013లో క్రికెటర్ దినేశ్ కార్తిక్‌ను పెళ్లాడింది. ఇప్పటివరకు ఎన్నో మెడల్స్ సాధించిన ఆమె మూడు మెడల్స్‌ను కామన్వెల్త్ గేమ్స్‌లో.. మరో నాలుగు పతకాలు ఏషియన్ గేమ్స్‌లో గెలుచుకుంది. ఇక టీమిండియా జట్టుకు చాలాకాలంగా దూరమైన దినేశ్ కార్తిక్ ఐపీఎల్ 14వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. గతేడాది కేకేఆర్‌కు కెప్టెన్‌గ వ్యవహరించిన కార్తిక్ లీగ్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కేకేఆర్ యాజమాన్యం ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. 2019లో చివరిసారిగా వన్డే ఆడిన కార్తిక్ టీమిండియా తరపున 94 వన్డేల్లో 1752 పరుగులు, 32 టీ20ల్లో 399 పరుగులు, 26 టెస్టుల్లో 1025 పరుగులు సాధించాడు. చదవండి: శుభ్‌మన్ గిల్‌కు వీవీఎస్ లక్ష్మణ్ వార్నింగ్! రూల్స్ పక్కన పెట్టండి, నచ్చింది చేయండి: జడేజా -
దీపిక vs జోష్నా
► ఆసియా స్క్వాష్ మహిళల టైటిల్ మనదే ► నేడు ఫైనల్లో అమీతుమీ చెన్నై: భారత స్క్వాష్ చరిత్రలో ఆదివారం కొత్త చరిత్ర లిఖించబడనుంది. ప్రతిష్టాత్మక ఆసియా వ్యక్తిగత స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి తొలి చాంపియన్ అవతరించనుంది. 31 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మొదటిసారి భారత్ నుంచి ఒకేసారి ఇద్దరు క్రీడాకారిణులు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో నాలుగో సీడ్ దీపిక పళ్లికల్ 11–9, 7–11, 11–7, 11–9తో టాప్ సీడ్ ఆనీ అవు (హాంకాంగ్)ను బోల్తా కొట్టించగా... రెండో సీడ్ జోష్నా చినప్ప 11–6, 11–4, 11–8తో ఆరో సీడ్ తోంగ్ వింగ్ (హాంకాంగ్)పై గెలిచింది. 1996లో భారత్ నుంచి మిషా గ్రెవాల్ మాత్రమే ఏకైకసారి ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ పోటీల్లో భారత్ నుంచి ఎవరూ ఫైనల్‌కు చేరుకోలేదు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా సౌరవ్ ఘోషాల్ ఘనత వహించాడు. సెమీఫైనల్లో రెండో సీడ్ సౌరవ్ 11–6, 11–7, 11–3తో ఐదో సీడ్ లియో అవు (హాంకాంగ్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ మాక్స్ లీ (హాంకాంగ్)తో సౌరవ్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో మాక్స్ లీ 12–10, 11–6, 11–5తో నఫీజ్వాన్ అద్నాన్ (మలేసియా)ను ఓడించాడు. -
క్వార్టర్స్‌లో జోష్నా, దీపికా
హాంకాంగ్: హాంకాంగ్ ఇన్విటేషనల్ టోర్నమెంట్లో భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ క్వార్టర్స్‌లోకి దూసుకె ళ్లారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి జోష్నా 11-8, 11-7, 6-11, 11-8తో సల్మా హనీ (ఈజిప్ట్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో దీపికా పల్లికల్ 11-1, 11-3, 11-3తో లో వీ వెన్(మలేసియా)పై గెలుపొందింది. -
ముగిసిన జోష్నా పోరు
కౌలాలంపూర్ (మలేసియా): ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ జోష్నా చిన్నప్ప 3-11, 6-11, 3-11తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లారా మసారో (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో జోష్నా తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేదు. ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే -
సెమీస్ లో దీపికా పళ్లికల్
టొరంటో: గ్రానైట్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో స్టార్ ప్లేయర్ దీపికా పళ్లికల్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన రెండో సీడ్ దీపికా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 12-10, 11-2, 11-4తో సల్మా హనీ ఇబ్రహీమ్‌ను చిత్తు చేసింది. -
ఖేల్ రత్న రేసులో పళ్లికల్
న్యూఢిల్లీ : భారత క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న కోసం స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ పేరును తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. టాప్-10 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న తొలి స్క్వాష్ ప్లేయర్‌గా 23 ఏళ్ల దీపికా రికార్డులకెక్కింది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో జోష్నా చిన్నప్పతో కలిసి దేశ స్క్వాష్ చరిత్రలో తొలిసారి దీపికా స్వర్ణం సాధించింది. తమిళనాడు క్రీడా అభివృద్ధి అథారిటీ దీపిక పేరును కేంద్రానికి ప్రతిపాదించినప్పుడు తన ర్యాంకు 11 ఉండగా ప్రస్తుతం 18వ స్థానంలో కొనసాగుతోంది. -
హరీందర్ ‘హ్యాట్రిక్'... దీపిక ‘డబుల్'
చెన్నై: స్వదేశంలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ... జేఎస్‌డబ్ల్యూ ఇండియన్ సర్క్యూట్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ప్లేయర్స్ హరీందర్ పాల్ సంధూ, దీపిక పళ్లికల్ విజేతలుగా నిలిచారు. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో హరీందర్... మహిళల సింగిల్స్‌లో దీపిక చాంపియన్స్‌గా అవతరించారు. ఇండియన్ సర్క్యూ ట్లో హరీందర్కిది ‘హ్యాట్రిక్’ టైటిల్ కాగా... దీపికకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. ఫైనల్స్‌లో దీపిక 11-6, 11-2, 11-8తో మిసాకి కొబయాషి (జపాన్)పై గెలుపొందగా... హరీందర్ 11-8, 11-3, 11-6తో టాప్ సీడ్ కరీమ్ అలీ ఫతీ (ఈజిప్టు)ను బోల్తా కొట్టించాడు. ఇంతకుముందు హరీందర్ జైపూర్, ముంబైలలో జరిగిన టోర్నీల్లోనూ టైటిల్ సాధించాడు. -
స్క్వాష్ ఫైనల్స్‌లోకి దీపిక జోడీ
ఆసియా క్రీడల్లో భారత ఖాతాలో మరో రజతం లేదా స్వర్ణం రావడం ఖాయమైపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రతిభతో స్వర్ణపతకం సాధించిన భారత అమ్మాయిల జోడీ దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప ఆసియా క్రీడల్లోనూ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్టును 2-0 తేడాతో ఓడించి వాళ్లీ ఘనత సాధించారు. ఇప్పుడు ఫైనల్స్‌లో మలేసియా జట్టుతో పోటీ పడబోతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గితే ఇక స్వర్ణపతకం వచ్చేసినట్లే. ప్రపంచ నెంబర్ 21 ర్యాంకర్ అయిన జోష్న యూనక్ పార్క్‌ను కేవలం 34 నిమిషాల్లోనే 3-0 తేడాతో ఓడించింది. మరోవైపు ప్రపంచ 12వ ర్యాంకర్ అయిన దీపిక సున్మీ సాంగ్‌పై 37 నిమిషాల్లో 3-1 తేడాతో గెలిచింది. మరో సెమీ ఫైనల్లో మలేసియా జట్టు హాంగ్‌కాంగ్ జట్టును 2-0 తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది. -
స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం
సెమీస్‌కు చేరిన దీపిక, సౌరవ్ ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో ఇప్పటిదాకా స్క్వాష్‌లో మహిళలు వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈసారి ఆ లోటు తీరనుంది. తన పుట్టిన రోజు నాడు స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మెరిసింది. సహచరురాలు జోష్న చిన్నప్పతో జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో నెగ్గి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్‌లోనూ ఆసియా నంబర్ వన్ సౌరవ్ ఘోషాల్ కూడా సెమీస్‌కు చేరి పతకంపై భరోసానిచ్చాడు. దీంతో భారత్ తొలిసారిగా రెండు సింగిల్స్ విభాగాల్లో పతకాలు సాధించినట్లవుతుంది. 1998 ఏషియాడ్‌లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటినుంచి భారత సింగిల్స్ క్రీడాకారిణులు పతకం అందుకోలేకపోయారు. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో దీపిక 7-11, 11-9, 11-8, 15-17, 11-9 తేడాతో జోష్నను ఓడించి సెమీస్‌లో ప్రవేశించింది. సెమీస్‌లో దీపిక ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)తో తలపడనుంది. ఆసియా గేమ్స్‌లో ఇప్పటిదాకా నికోల్ ఓడింది లేదు. ఇక పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ 11-6, 9-11, 11-2, 11-9 తేడాతో పాక్ ఆటగాడు నాసిర్ ఇక్బాల్‌ను ఓడించి సెమీస్‌కు చేరాడు. ఇతర క్రీడల్లో ఫలితాలు: టెన్నిస్: పురుషుల టీమ్ ఈవెంట్ రెండో రౌండ్లో భారత్ 3-0 తేడాతో నేపాల్‌ను ఓడించింది. ఫుట్‌బాల్: థాయ్‌లాండ్‌తో జరిగిన మహిళల ఫుట్‌బాల్ గ్రూప్ ‘ఎ’ తొలి రౌండ్లో భారత్ 0-10 తేడాతో చిత్తుగా ఓడింది. స్విమ్మింగ్: ఆదివారం మూడు ఈవెంట్లలో బరిలోకి దిగిన భారత స్విమ్మర్లు పూర్తిగా నిరాశపరిచారు. పురుషుల 100మీ. బ్యాక్‌స్ట్రోక్ హీట్‌లో ప్రతాపన్ నాయర్ ఏడో స్థానంలో నిలిచాడు. 200మీ. ఫ్రీస్టయిల్ హీట్‌లో సౌరభ్ సంగ్వేకర్ ఐదో స్థానం, 200మీ. బటర్‌ఫ్లయ్ హీట్‌లో ఏగ్నెల్ డిసౌజా నాలుగో స్థానం పొందారు. రోయింగ్: పురుషుల సింగిల్స్ స్కల్క్ హీట్‌లో సవర్ణ్ సింగ్ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే లైట్‌వెయిట్ పురుషుల క్వాడ్రపల్ స్కల్స్ హీట్‌లో రాకేశ్, విక్రమ్, లక్ష్మీనారాయణ్, తోమర్ శోకేందర్ నాలుగో స్థానంలో నిలిచారు. హ్యాండ్‌బాల్: పురుషుల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘డి’లో కొరియా చేతిలో 19-39 తేడాతో ఓడిపోగా మహిళల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘ఎ’లో థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ 26-26 స్కోరుతో టై అయింది. జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్: పురుషుల వ్యక్తిగత అర్హత, టీమ్ ఫైనల్లో భారత జట్టు పదో స్థానంలో నిలిచింది. ఈక్వెస్ట్రియన్: డ్రెస్సేజ్ వ్యక్తిగత ఇంటర్మీడియట్లో శ్రుతి వోరా 13వ స్థానంలో, నాదియా హరిదాస్ 19, రాజేంద్ర శుభశ్రీ 29, వనిత మల్హోత్రా 30వ స్థానంలో నిలిచి నిరాశపరిచారు. సైక్లింగ్: మహిళల కీరిన్ ఫైనల్స్‌లో దెబోరా తొమ్మిదో స్థానంలో రాగా మోహన్ మహిత 11వ స్థానంలో నిలిచింది. బాస్కెట్ బాల్: పురుషుల క్వాలిఫయింగ్ రౌండ్లో భారత జట్టు 67-73 తేడాతో సౌదీ అరే బియాతో ఓడింది. -
‘టెక్సాస్’ రన్నరప్ దీపిక
హోస్టన్ (అమెరికా): భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈజిప్టు టీనేజ్ సంచలనం, 18 ఏళ్ల నూర్ ఎల్ షెర్బినితో జరిగిన ఫైనల్లో దీపిక 7-11, 11-5, 7-11, 8-11 తేడాతో ఓటమిపాలైంది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ, టాప్ సీడ్ లో వీ వర్న్తో సహా ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణుల్ని ఇంటిబాట పట్టించిన షెర్బిని.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. దీపిక పోరాడినా షెర్బిని దూకుడు ముందు నిలవలేకపోయింది. అయితే 12వ ర్యాంకర్ దీపిక టైటిల్ సాధించలేకపోయినా.. ఫైనల్‌కు చేరడం ద్వారా భారీగా పాయింట్లు సాధించి తిరిగి టాప్-10లో స్థానం సంపాదించుకునే అవకాశాలను సుగమం చేసుకుంది. -
‘టెక్సాస్’ ఫైనల్లో దీపిక
హౌస్టన్ (అమెరికా): భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ దీపిక 11-7, 11-13, 13-11, 10-12, 11-4 తేడాతో 8వ ర్యాంకర్ మెడలిన్ పెర్రీ (ఐర్లాండ్)పై సంచలన విజయం సాధించింది. దీంతో 22 ఏళ్ల దీపిక తన కెరీర్లోనే అతిపెద్ద టోర్నీ (రూ.30 లక్షల ప్రైజ్‌మనీ)లో టైటిల్ పోరుకు చేరుకుంది. అంతేగాక పెర్రీతో ముఖాముఖి రికార్డునూ 2-2తో సమం చేసింది. ఇక ఫైనల్లో నయా సంచలనం నౌర్ ఎల్ షెర్బిని (ఈజిప్టు)తో దీపిక తలపడనుంది. క్వాలిఫయర్‌గా టోర్నీ బరిలోకి దిగి సంచలన విజయాలు సాధించిన షెర్బిని సెమీప్లో ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. -
సెమీస్‌లో దీపిక
టెక్సాస్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ హౌస్టన్ (అమెరికా): భారత నెంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం నికోలెట్ ఫెర్నాండెజ్ (గయానా)తో హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 11-4, 11-6, 10-12, 10-12, 11-5 తేడాతో గెలుపొందింది. ప్రపంచ 12వ ర్యాంకర్ దీపిక ఇక సెమీస్‌లో ఎనిమిదో ర్యాంకర్ మెడలిన్ పెర్రీ (ఐర్లాండ్)తో తలపడనుంది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో మెడలిన్ పెర్రీ 11-7, 9-11, 11-6, 11-8 తేడాతో ఎమ్మా బెడ్డోస్ (ఇంగ్లండ్)పై గెలుపొందగా, ఈజిప్టు అన్‌సీడెడ్ క్రీడాకారిణి నౌర్ ఎల్ షెర్బిని చేతిలో టాప్‌సీడ్ లో వీ వర్న్ (మలేసియా) 3-11, 8-11, 12-10, 6-11 తేడాతో కంగుతింది.