నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్‌ కార్తిక్‌ భార్య భావోద్వేగం | I Would Have Given Up: Dipika Pallikal Breaks Down While Recalling Dinesh Karthik Cricket Journey, Video Viral | Sakshi
Sakshi News home page

నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్‌ కార్తిక్‌ భార్య దీపిక భావోద్వేగం

May 24 2024 2:01 PM | Updated on May 24 2024 6:06 PM

Would Have Given Up: Dipika Pallikal Breaks Down While Recalling Dinesh Karthik Journey

‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. మేము 2013లో తొలిసారి ఒకరినొకరం నేరుగా కలిశాం. ఇద్దరి మనసులోనూ కలిసి జీవించాలనే ఆలోచనే  వచ్చింది. ఆ తర్వాత అన్నీ సజావుగా సాగిపోయాయి.

తనలో నాకు నచ్చే గొప్ప గుణం ఏమిటంటే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగటం. బాగా ఆడలేక విమర్శలు ఎదుర్కొన్నపుడు.. జట్టులో స్థానం కరువైనపుడు రెండు- మూడు రోజుల పాటు కాస్త నిరాశగా కనిపిస్తాడు.

తిరిగి వెంటనే కోలుకుని తర్వాత ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడతాడు. నాకు తెలిసి అలాంటి స్థితిలో వేరే ఎవరైనా ఉంటే కచ్చితంగా చాలా రోజుల పాటు కుంగిపోతారు.

వదిలేసేదాన్నేమో!
నేను కూడా అథ్లెట్‌నే కాబట్టి అప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలను. తన స్థానంలో గనుక నేనే ఉంటే.. ఇక చాల్లే అని వదిలేసేదాన్నేమో!

కానీ తను అలా కాదు. తన కెరీర్‌లో వివిధ దశల్లో విభిన్న పాత్రలు పోషించాల్సి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోనూ తను పట్టుదలగా నిలబడ్డాడు.

గతం కంటే మెరుగ్గా ఆడుతూ ముందుకు సాగాడు. డీకే తన జీవితంలో ఏవైతే సాధించాలనుకున్నాడో అన్నీ సాధించేశాడు. ఒక అథ్లెట్‌ లైఫ్‌లో అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.

అలాంటి వ్యక్తి ఇకపై ఆటకు దూరంగా ఉండాలంటే అంత సులువేమీ కాదు. అయితే, వ్యక్తిగతంగా తన జీవితంలో ముందుకు సాగాలని అతడు నిర్ణయించుకున్నాడు.

తన కోసం, తన కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను సాధించిన విజయాలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి’’ అని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ భార్య దీపికా పళ్లికల్‌ ఉద్వేగానికి లోనయ్యారు.

తన భర్త కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడని.. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తాను అనుకున్న స్థాయికి చేరుకున్నాడని తెలిపారు. కాగా ఐపీఎల్‌లో ఆరంభం నుంచి పదిహేడేళ్ల పాటు కొనసాగిన క్రికెటర్లలో ఒకడైన దినేశ్‌ కార్తిక్‌ ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు గుడ్‌బై
ఐపీఎల్‌-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన అతడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. రాజస్తాన్‌ చేతిలో ఆర్సీబీ ఓటమి తర్వాత క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఓటమితో తన ఐపీఎల్‌ కెరీర్‌ ముగించాడు.

ఈ నేపథ్యంలో దినేశ్‌ కార్తిక్‌ భార్య, భారత స్క్వాష్‌ ప్లేయర్‌ దీపికా పళ్లికల్‌ పైవిధంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కాగా దీపికా పళ్లికల్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో నాలుగుసార్లు భారత్‌ తరఫున పతకాలు సాధించారు. ఆసియా క్రీడలు, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లోనూ మెడల్స్‌ గెలిచారు. డీకే- దీపిక 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు(కవలలు) సంతానం.

చదవండి: Dinesh Karthik: మొదటి భార్య మోసం: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)
Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్‌! అరుదైన రికార్డులు.. దటీజ్‌ డీకే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement