ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి పదిహేడో ఎడిషన్ దాకా కొనసాగిన కొంత మంది ఆటగాళ్లలో దినేశ్ కార్తిక్ ఒకడు. తమిళనాడుకు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అరంగేట్ర సీజన్ నుంచి ఇప్పటి దాకా ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
ఇక పదిహేడేళ్ల పాటు నిరంతరాయంగా క్యాష్ రిల్ లీగ్ ఆడుతున్న 38 ఏళ్ల డీకే.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి తర్వాత తన నిర్ణయాన్ని పరోక్షంగా తెలియజేశాడు.
ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు డీకేకు శుభాకాంక్షలు చెబుతూ వీడ్కోలు పలికారు. ఇక సుదీర్ఘకాలంగా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతున్న డీకే తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి భారంగా మైదానాన్ని వీడాడు.
ఒక్క టైటిల్...
👉దినేశ్ కార్తిక్ 2008 నుంచి 2024 వరకు అన్ని ఐపీఎల్ సీజన్లలో ఆడాడు. 2008లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 2.1 కోట్లకు డీకేను కొనుక్కుంది.
👉మూడేళ్ల పాటు ఆ జట్టుతో కొనసాగిన దినేశ్ కార్తిక్.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జట్టుకట్టాడు. రెండేళ్ల పాటు పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 2013లో ముంబై ఇండియన్స్‌కు మారాడు.
👉ఆ ఏడాది రోహిత్ శర్మ ట్రోఫీ గెలవడంతో డీకే ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ చేరింది. నాటి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన ముంబై తుదిజట్టులో దినేశ్ కార్తిక్ కూడా ఉన్నాడు.
👉అయితే, ముంబై ఇండియన్స్‌తో అతడి ప్రయాణం అంతటితో ముగిసిపోయింది. 2014 వేలంలో ఢిల్లీ ఫ్రాంఛైజీ మరోసారి డీకేను దక్కించుకుంది. ఏకంగా 12.5 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.
ఆర్సీబీ అప్పుడే తొలిసారి
👉కానీ మరుసటి ఏడాదే డీకేను ఢిల్లీ విడిచిపెట్టింది. ఈ క్రమంలో 2015 ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారి దినేశ్ కార్తిక్‌ను సొంతం చేసుకుంది. ఈ వికెట్ కీపర్‌బ్యాటర్ కోసం ఏకంగా రూ 10.50 కోట్లు ఖర్చు పెట్టింది.
👉అయితే, ఆ సీజన్‌లో డీకే 11 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 141 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో మరుసటి ఏడాది ఆర్సీబీ అతడిని వదిలించుకుంది.
గుజరాత్ లయన్స్‌తో రెండేళ్ల ప్రయాణం
👉ఈ క్రమంలో సురేశ్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ డీకేను కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అక్కడే కొనసాగాడు. ఆ తర్వాత గుజరాత్ లయన్స్ జట్టు కనుమరుగు కాగా.. 2018లొ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు దినేశ్ కార్తిక్.
కేకేఆర్ కెప్టెన్‌గా నియామకం
👉ఆ ఏడాది వేలంలో రూ. 7.4 కోట్లకు కేకేఆర్ యాజమాన్యం డీకేను కొనుక్కుంది. ఈ క్రమంలో గౌతం గంభీర్ జట్టు నుంచి నిష్క్రమించగా.. దినేశ్ కార్తిక్‌ను కెప్టెన్‌గా నియమించింది.
👉ఇక కేకేఆర్ సారథిగా రెండున్నరేళ్ల పాటు కొనసాగిన డీకే 37 మ్యాచ్‌లలో జట్టును ముందుండి నడిపించాడు. అయితే, 2020 సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ వైదొలగగా ఇయాన్ మోర్గాన్ ఆ బాధ్యతలను స్వీకరించాడు.
మరోసారి ఆర్సీబీ చెంత.. ఇక్కడే వీడ్కోలు
👉ఈ క్రమంలో ఐపీఎల్ మెగా వేలం-2022కు ముందు కేకేఆర్ కార్తిక్‌ను రిలీజ్ చేసింది. అయితే, ఆర్సీబీ ఫ్రాంఛైజీ మరోసారి డీకేపై నమ్మకం ఉంచి అతడిని రూ. 5.5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
👉ఆ సీజన్‌లో ఆర్బీసీ తరఫున 183కు పైగా స్ట్రైక్‌రేటుతో డీకే 330 పరుగులతో రాణించాడు. ఫినిషర్‌గా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈక్రమంలో టీ20 ప్రపంచకప్-2022 భారత జట్టులో చోటు కూడా సంపాదించాడు డీకే.
👉అయితే, మెగా టోర్నీలో నిలకడలేమి ఆటతో విమర్శలపాలైన డీకే.. 2023 సీజన్‌లోనూ విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లలో కలిపి కేవలం 140 పరుగులే చేశాడు. ఇక ఈ ఏడాది ఆర్సీబీ తరఫున 13 ఇన్నింగ్స్ ఆడిన డీకే 326 పరుగులు సాధించాడు.
👉ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ చేతిలో బెంగళూరు పరాజయం నేపథ్యంలో ఓటమితో తన ఐపీఎల్ కెరీర్‌ను ముగించాడు దినేశ్ కార్తిక్. మొత్తంగా ఓవరాల్ ఐపీఎల్ కెరీర్‌లో డీకే.. 257 మ్యాచ్‌లు ఆడి 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్థ శతకాలు ఉన్నాయి.
దినేశ్ కార్తిక్ ఐపీఎల్ రికార్డులు
👉మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా, మనీశ్ పాండేలతో పాటు 17 సీజన్ల పాటు ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడు.
👉క్యాష్ రిచ్ లీగ్ పదిహేడేళ్ల చరిత్రలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే అతడు మిస్సయ్యాడు.
👉ధోని తర్వాత అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు. ధోని 264 మ్యాచ్‌లు ఆడగా.. డీకే తన కెరీర్లో 257 మ్యాచ్‌లలో భాగమయ్యాడు.
2018- 2020 మధ్య కేకేఆర్ కెప్టెన్‌గా 37 మ్యాచ్‌లు ఆడి 19 విజయాలు సాధించాడు. తద్వారా గంభీర్(61) తర్వాత కేకేఆర్‌ను అత్యధికసార్లు గెలిపించిన కెప్టెన్‌గా రికార్డు.
👉దినేశ్ కార్తిక్ వికెట్ కీపర్‌గా 174 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ధోని(190) తర్వాత ఈ జాబితాలో రెండో స్థానం ఆక్రమించాడు.
From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6
— IndianPremierLeague (@IPL) May 22, 2024
చదవండి: అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్
Comments
Please login to add a commentAdd a comment