ఐపీఎల్‌కు బైబై.. దినేశ్‌ కార్తిక్‌ రిటైర్‌ అయ్యాడా!.. వీడియో వైరల్‌ | Just Retired: Dinesh Karthik Swansong Confirmed By IPL Goes Viral | Sakshi
Sakshi News home page

DK: ఐపీఎల్‌కు బైబై.. దినేశ్‌ కార్తిక్‌ రిటైర్‌ అయ్యాడా!.. వీడియో వైరల్‌

Published Thu, May 23 2024 10:41 AM | Last Updated on Thu, May 23 2024 11:08 AM

Just Retired: Dinesh Karthik Swansong Confirmed By IPL Goes Viral

టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫినిషర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి రిటైర్‌ అయ్యాడు.

అయితే, రిటైర్మెంట్‌ గురించి డీకే నేరుగా ప్రకటించకపోయినా.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ తర్వాత మైదానంలో చోటు చేసుకున్న దృశ్యాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఐపీఎల్‌ నిర్వాహకులు సైతం సోషల్ మీడియా వేదికగా డీకే రిటైర్మెంట్‌ను నిర్ధారించారు.

‘‘ఒక ఐపీఎల్‌ ట్రోఫీ.. అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్‌.. 16 ఏళ్లు.. ఆరు జట్లు.. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. థాంక్యూ డీకే’’ అంటూ జస్ట్‌ రిటైర్డ్‌ అనే బోర్డున్న కారు వెనకాల నిల్చున్న దినేశ్‌ కార్తిక్.. విరాట్‌ కోహ్లి, మహేంద్ర సింగ్‌ ధోని, హార్దిక్‌ పాండ్యాలకు టాటా చెప్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఐపీఎల్‌ అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది.

కాగా ఐపీఎల్‌-2024లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడింది. అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా టైటిల్‌ రేసు నుంచి నిష్క్రమించి ఇంటిబాట పట్టింది.

అయితే, ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం డీకేను ఆర్సీబీ ప్లేయర్లు ఆత్మీయంగా హత్తుకున్నారు.  ఇక అభిమానులకు అభివాదం చేస్తూ మైదానమంతా కలియదిరుగుతూ భావోద్వేగానికి గురైన దినేశ్‌ కార్తిక్‌.. వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఆ సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు అతడి వెనకాలే నడుస్తూ కరతాళ ధ్వనులతో ఉత్సాహపరిచారు.

ఓటమితో ఐపీఎల్‌ కెరీర్‌ ముగించిన డీకే ఉద్వేగానికి లోనుకాగా ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి అతడిని హత్తుకుని.. ‘‘మరేం పర్లేదు’’ అంటూ ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో #Happy Retirement DK అంటూ ఫ్యాన్స్‌ అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement