టురిన్ (ఇటలీ): పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. రింకీ హిజికాటా–జేసన్ కుబ్లెర్ (ఆ్రస్టేలియా) జంటతో బుధవారం జరిగిన రెడ్ గ్రూప్ రెండో లీగ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–4తో గెలిచింది. ఈ విజయంతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ ఫైనల్స్ టోర్నీ చరిత్రలో మ్యాచ్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. నాలుగు జోడీలు ఉన్న రెడ్ గ్రూప్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్‌బరీ (బ్రిటన్) ద్వయం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్), బోపన్న–ఎబ్డెన్ జోడీలు చెరో విజయంతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. నేడు ఈ రెండు జోడీల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేత సెమీఫైనల్ చేరుకుంటుంది.
సెమీస్‌లో సినెర్
ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రీన్ గ్రూప్ నుంచి యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో 7–6 (7/1), 4–6, 6–1తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచాడు. జొకోవిచ్‌తో మ్యాచ్‌లో హుర్కాజ్ ఒక సెట్ నెగ్గడంతో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సినెర్ గ్రీన్ గ్రూప్ నుంచి టాప్ లేదా రెండో స్థానంతో సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖరారైంది.
ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఇటలీ ప్లేయర్‌గా సినెర్ గుర్తింపు పొందాడు. సినెర్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో హోల్గర్ రూనె (డెన్మార్క్) గెలిస్తే మాత్రం జొకోవిచ్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడు. సినెర్ విజయం సాధిస్తే జొకోవిచ్‌కు కూడా సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. మరోవైపు రెడ్ గ్రూప్ నుంచి మెద్వెదెవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.
Comments
Please login to add a commentAdd a comment