
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ, కాళీపూజ, సరస్వతీ పూజలను ఘనంగా జరుపుకుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో శ్రీ రామ నవమికి నేటి వరకూ సెలవు లేదు. గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపధ్యంలో బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. శ్రీరామనవమి రోజున జనం ఊరేగింపులు నిర్వహించే హక్కులను కాలరాయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ గతంలో వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే రానున్న శ్రీరామ నవమికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తృణమూల్ ప్రభుత్వం హిందువులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.