బెంగాల్‌లోని పురూలియాలో ఆయుధాలతో రామ్ నవమి ర్యాలీ
సాక్షి, కోల్‌కతా : రామ్‌నవమి సందర్భంగా భారీ సాయుధ మార్చ్ నిర్వహించేందుకు బీజేపీ సన్నద్ధమవడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. రామ్ నవమి ప్రదర్శనలకు తాము వ్యతిరేకం కాదని..అయితే శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. పదేళ్ల నుంచీ ప్రదర్శనలు నిర్వహించే ఒకటి రెండు సంస్థలనే ఆయుధాలతో ప్రదర్శన నిర్వహించేందుకు అనుమతిస్తామని చెప్పారు. తొలిసారిగా నిర్వహించే ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రామ్‌నవమి ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ కసరత్తు చేస్తుండగా, భారీ భద్రత నడుమ సైతం వర్థమాన్ జిల్లాలో ఓ మండపాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
పాలక తృణమూల్ కాంగ్రెస్ ప్రోద్బలంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని బీజేపీ ఆరోపించింది. ఆయుధాలతో రామ్‌నవమి ప్రదర్శనలు నిర్వహిస్తామని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ తెలిపారు. కోల్‌కతాతో పాటు పొరుగున హౌరా జిల్లాలో ఆయుధాలతో రామ్‌నవమి ర్యాలీలకు బీజేపీ ప్రయత్నిస్తుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హౌరాలో ర్యాలీలు నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడింది. ఇప్పటివరకూ రామ్ నవమి వేడుకలను వ్యతిరేకించిన వారు రాజకీయ లబ్ధి కోసం ర్యాలీలను నిర్వహిస్తున్నారని దిలీప్ ఘోష్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment