యువ... జయహో | Yuki , Ramkumar win both reverse singles | Sakshi
Sakshi News home page

యువ... జయహో

Published Sun, Feb 5 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

యువ... జయహో

యువ... జయహో

రివర్స్‌ సింగిల్స్‌లోనూ గెలిచిన రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ
న్యూజిలాండ్‌పై 4–1తో  భారత్‌ విజయం
ఆసియా ఓసియానియా  రెండో రౌండ్‌కు అర్హత
ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో పోరు  


తదుపరి దశకు భారత్‌ అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో యువ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ సత్తా చాటాడు. డేవిస్‌ కప్‌లో ఆడుతోంది ఆరో మ్యాచ్‌ అయినప్పటికీ... కీలక పోరులో ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా వరుస సెట్‌లలో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. నామమాత్రమైన రెండో రివర్స్‌ సింగిల్స్‌లో మరో యువ ప్లేయర్‌ యూకీ బాంబ్రీ కూడా గెలుపొందడంతో భారత్‌ 4–1తో న్యూజిలాండ్‌ను ఓడించి ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 రెండో రౌండ్‌కు అర్హత సంపాదించింది.  

పుణే: ప్రధాన సింగిల్స్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని చివరి నిమిషంలో గాయపడటంతో అందివచ్చిన అవకాశాన్ని యువ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అంచనాలకు అనుగుణంగా రాణించి కీలకమైన విజయాన్ని భారత్‌కు అందించి ఊరట కలిగించాడు. డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 తొలి రౌండ్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండు రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ల్లోనూ భారత యువ ఆటగాళ్లు రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ గెలుపొందారు. ఫలితంగా టీమిండియా 4–1తో న్యూజిలాండ్‌ను ఓడించింది. తద్వారా వచ్చే ఏప్రిల్‌లో భారత్‌లోనే జరిగే రెండో రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.

ఆదివారం 2–1 ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రామ్‌కుమార్‌ విజయాన్ని ఖాయం చేశాడు. తొలి రివర్స్‌ సింగిల్స్‌లో ప్రపంచ 276వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 7–5, 6–1, 6–0తో ఫిన్‌ టియర్నీపై గెలిచాడు. సరిగ్గా రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌కు తొలి సెట్‌లోనే గట్టిపోటీనే ఎదురైంది. అయితే 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్న రామ్‌కుమార్‌ 12వ గేమ్‌లో టియర్నీ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ చెన్నై ప్లేయర్‌ చెలరేగిపోయాడు.రెండో సెట్‌లో ఒక గేమ్‌ మాత్రమే కోల్పోగా... మూడో సెట్‌లో ఒక్క గేమ్‌ కూడా ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి భారత్‌కు విజయాన్ని అందించాడు. 12 ఏస్‌లు సంధించిన రామ్‌కుమార్‌ తొమ్మిది డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. మ్యాచ్‌ మొత్తంలో టియర్నీ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసి తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా చేజార్చుకోలేదు.

ఫలితం తేలిపోవడంతో రెండో రివర్స్‌ సింగిల్స్‌ను బెస్ట్‌ ఆఫ్‌–3 సెట్స్‌గా నిర్వహించారు. ప్రాధాన్యత లేకపోయినప్పటికీ యూకీ బాంబ్రీ పట్టుదలతో పోరాడి 7–5, 3–6, 6–4తో జోస్‌ స్థాతమ్‌ను ఓడించి భారత్‌కు 4–1తో విజయాన్ని ఖరారు చేశాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో యూకీ ఆరు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నిర్ణాయక మూడో సెట్‌లో స్కోరు 4–4తో సమంగా ఉన్నపుడు యూకీ తన సర్వీస్‌లో 15–40తో రెండు బ్రేక్‌ పాయింట్లు కాచుకున్నాడు. ఈ దశలో యూకీ చక్కటి ఆటతీరుతో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతోపాటు పదో గేమ్‌లో స్థాతమ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి రివర్స్‌ సింగిల్స్‌ ముగిశాక భారత జట్టు సభ్యులందరూ రామ్‌కుమార్‌ను గాల్లోకి ఎగరేసి సంబరం చేసుకున్నారు. రెండో రివర్స్‌ సింగిల్స్‌ పూర్తయ్యాక కోర్టులోనే భారత జట్టు సభ్యులందరూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్న ఆనంద్‌ అమృత్‌రాజ్‌ను, కోచ్‌ జీషాన్‌ అలీ, వెటరన్‌ లియాండర్‌ పేస్‌లను కూడా జట్టు సభ్యులు గాల్లోకి ఎగరేసి తమదైనరీతిలో సంబరాలు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement