భారత్ సీన్ ‘రివర్స్
బెంగళూరు: ఏదైనా అద్భుతం జరగకపోదా అని ఎదురుచూసిన భారత టెన్నిస్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. తమ డేవిస్ కప్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయం సాధించే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. సెర్బియాతో జరిగిన ప్లే ఆఫ్ పోటీలో కీలకమైన రెండో రివర్స్ సింగిల్స్‌లో యువ ఆటగాడు యూకీ బాంబ్రీ 3-6, 4-6, 4-6తో ఫిలిప్ క్రాజినోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫలితంగా సెర్బియా 3-2 తేడాతో విజేతగా నిలిచింది. దీంతో భారత్ వచ్చే సీజన్‌లో తిరిగి ఆసియా/ఓషియానియా జోన్‌లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అటు సెర్బియా ప్రపంచ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది.
2011లో భారత్ తొలిసారిగా వరల్డ్ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. అయితే అప్పుడు కూడా తొలి రౌండ్‌లో సెర్బియాపైనే ఓడింది. ఈసారి ప్రారంభ మ్యాచ్‌ల్లో 0-2తో వెనుకబడి భారత్ ఆశలు పూర్తిగా అడుగంటిన వేళ డబుల్స్‌లో లియాండర్ పేస్, రోహన్ బోపన్న అద్భుతంగా ఆడి పట్టు జారనీయలేదు. ఈ స్ఫూర్తితో రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్ కూడా నెగ్గి ఒక్కసారిగా పరిస్థితిని మార్చి 2-2తో ఆధిక్యాన్ని సమం చేశాడు. ఈ దశలో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన 22 ఏళ్ల బాంబ్రీ స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచలేకపోయాడు. ప్రపంచ 107వ ర్యాంకర్ క్రాజినోవిచ్ చేతిలో వరుస సెట్‌లలో ఓడిపోయాడు. ఆదివారం రాత్రి క్రాజినోవిచ్ 6-3, 4-4 ఆధిక్యంలో ఉండగా వర్షంతో అంతరాయం కలిగింది. దీంతో మిగిలిన మ్యాచ్‌ను సోమవారం కొనసాగించారు. అయితే ఏ దశలోనూ యూకీ ప్రత్యర్థికి జవాబివ్వలేకపోయాడు. ఏకంగా 66 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి డేవిస్ కప్‌లో బరిలోకి దిగిన క్రాజినోవిచ్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. మూడో సెట్ తొలి గేమ్‌నే బ్రేక్ చేసిన తనపై యూకీ నిలువలేకపోయాడు. 0-30తో క్రాజినోవిచ్ వెనుకబడిన దశలో ఎనిమిది, 10వ గేమ్‌లో సెర్బియా సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా యూకీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అటు శక్తివంతమైన ఏస్‌లతో అదరగొట్టిన క్రాజినోవిచ్ మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.