యూకీ బాంబ్రీ శుభారంభం
సోమ్‌దేవ్, రామ్‌కుమార్ ఓటమి
మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యువతార రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా... యూకీ బాంబ్రీ మాత్రం శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ 4-6, 6-1, 8-6తో 15వ సీడ్ ఎవగెని డాన్‌స్కాయ్ (రష్యా)ను ఓడించాడు. రెండు గంటల తొమ్మిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఢిల్లీ ప్లేయర్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
నెట్‌వద్దకు 29 సార్లు దూసుకొచ్చిన యూకీ 18 సార్లు పాయింట్లు సాధించాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు సోమ్‌దేవ్ 4-6, 6-3, 4-6తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) చేతిలో; రామ్‌కుమార్ 5-7, 6-4, 4-6తో నిల్స్ లాంగర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. గతంలో మూడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన సోమ్‌దేవ్ ఈ ఏడాది బరిలోకి దిగిన రెండు టోర్నీల్లోనూ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.
గతవారం స్వదేశంలో జరిగిన చెన్నై ఓపెన్‌లోనూ అతను తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో యోషిహిటో నిషిఓకా (జపాన్)తో యూకీ ఆడతాడు. 128 మంది పాల్గొంటున్న క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి 16 మంది మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. ఈనెల 19న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేస్తారు.