ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ హస్తగతం
కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన అమెరికా ప్లేయర్
హోరాహోరీ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకాపై విజయం
రూ. 19 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం
మెల్‌బోర్న్: పదేళ్ల క్రితం 19 ఏళ్ల ప్రాయంలో ఆ్రస్టేలియన్ ఓపెన్ లోనే మాడిసన్ కీస్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకొని వెలుగులోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే... పదేళ్ల తర్వాత అదే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆమె తన గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నెరవేర్చుకుంది. 19వ సీడ్‌గా ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ప్రపంచ 14వ ర్యాంకర్ మాడిసన్ కీస్... అందరి అంచనాలను తారుమారు చేసి చివరకు చాంపియన్‌గా అవతరించింది.
గత రెండేళ్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచి... ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా జరిగిన బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీలో టైటిల్ నెగ్గి జోరు మీదున్న బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సబలెంకాను ఓడించిన కీస్ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కీస్ 6–3, 2–6, 7–5తో సబలెంకాపై గెలిచింది.
విజేతగా నిలిచిన మాడిసన్ కీస్‌కు 35 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 3 లక్షలు)... రన్నరప్ సబలెంకాకు 19 లక్షల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో కీస్ ముగ్గురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌ను (రిబా కినా, స్వియాటెక్, సబలెంకా) ఓడించడం విశేషం. 2 గంటల 2 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో కీస్ ఆరు ఏస్‌లు సంధించింది. 29 విన్నర్స్ కొట్టింది. 31 అనవసర తప్పిదా లు చేసింది.
తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు సబలెంకా ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసింది. నేడు యానిక్ సినెర్ (ఇటలీ), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మధ్య పురుషుల సింగిల్స్ ఫైనల్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment