వరుస సెట్‌లలో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం
ఏడో సీడ్ పెగూలా అవుట్
అల్‌కరాజ్, జ్వెరెవ్ ముందంజ
మెల్‌బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్ సాధించే దిశగా సబలెంకా... రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే దిశగా జొకోవిచ్ మరో అడుగు ముందుకు వేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్).... పురుషుల సింగిల్స్‌లో 10 సార్లు విజేత జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/5), 6–4తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై గెలుపొందగా... ఏడో సీడ్ జొకోవిచ్ 6–1, 6–4, 6–4తో 26వ సీడ్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. క్లారాతో 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకాకు గట్టిపోటీ ఎదురైనా కీలకదశలో ఆమె పైచేయి సాధించింది. మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టని సబలెంకా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
39 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 29 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు క్లారా ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్ కోల్పోయిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్ మూడో మ్యాచ్‌లో మాత్రం వరుసగా మూడు సెట్‌లలో గెలుపొందడం విశేషం. మఖచ్‌తో 2 గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
28 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్...నెట్ వద్దకు 18 సార్లు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన ఈ మాజీ చాంపియన్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్; మిరా ఆంద్రీవా (రష్యా)తో సబలెంకా తలపడతారు.
పురుషుల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్) 6–2, 6–4, 6–7 (3/7), 6–2తో బోర్జెస్ (పోర్చుగల్)పై, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–4, 6–4తో ఫియరెన్‌లే (బ్రిటన్)పై, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 7–6 (7/2), 6–2, 6–0తో కార్‌బెలాస్ బేనా (స్పెయిన్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
కోకో గాఫ్ సులువుగా...
మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ఇంటిదారి పట్టింది. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 6–4, 6–2తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గగా... పెగూలా 6–7 (3/7), 1–6తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) చేతిలో ఓడిపోయింది.
11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్), 27వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా), బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. బెన్‌చిచ్‌తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయాక మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) గాయం కారణంగా వైదొలిగింది.
Comments
Please login to add a commentAdd a comment