Djokovic
-
తగ్గేదేలే...
టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు నొవాక్ జొకోవిచ్ రెండు విజయాల దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియా దిగ్గజం 12వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రికార్డుస్థాయిలో 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన జొకోవిచ్ కేవలం గత ఏడాది మాత్రమే తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గత ఏడాది వింబుల్డన్ టోర్నీలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డు నెలకొల్పేందుకు జొకోవిచ్‌కు అవకాశం లభించింది. కానీ తుదిపోరులో స్పెయిన్ యువతార కార్లోస్ అల్కరాజ్ అద్వితీయ ఆటతీరుతో జొకోవిచ్ ఆశలను వమ్ము చేశాడు. తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే ‘గ్రాండ్’ రికార్డు అందుకోవాలనే లక్ష్యంతో జొకోవిచ్ ఈసారి పక్కా ప్రణాళికతో వచ్చాడు. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన బ్రిటన్ స్టార్, తన చిరకాల ప్రత్యర్థి ఆండీ ముర్రేను కోచ్‌గా నియమించుకున్నాడు. ముర్రే నియామకం సరైనదేనని ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ ఆటతీరును పరిశీలిస్తే తెలుస్తోంది. క్వార్టర్ ఫైనల్లో పెద్ద అడ్డంకి అల్కరాజ్ను నాలుగు సెట్ల పోరులో జొకోవిచ్ అధిగమించాడు. సెమీఫైనల్లో జొకోవిచ్ జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ రూపంలో మరో కీలక పరీక్షకు సిద్ధంకానున్నాడు. అయితే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జ్వెరెవ్‌తో పోటీపడ్డ మూడుసార్లూ జొకోవిచే గెలుపొందడం గమనార్హం. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 2023, 2024లలో విజేతగా నిలిచిన సబలెంకాకు ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లో గట్టిపోటీ ఎదురైంది. అయితే సబలెంకా తన ఆధిపత్యం చాటుకొని ‘హ్యాట్రిక్’ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మెల్బోర్న్: ‘ఈసారి కాకపోతే మరెప్పుడూ కాదు’ అన్న తరహాలో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన శక్తినంతా ధారపోస్తూ, అపార అనుభవాన్ని రంగరిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోరాడుతున్నాడు. 37 ఏళ్ల వయస్సులో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవాలనే పట్టుదలతో మెల్బోర్న్లో అడుగు పెట్టిన జొకోవిచ్ ఎంతో ప్రమాదకరమైన అల్కరాజ్ అడ్డంకిని దాటేశాడు. కొత్త కోచ్ ఆండీ ముర్రే రచించిన వ్యూహాలను కోర్టులో అమలు చేసిన జొకోవిచ్... నాలుగు సెట్లలో స్పెయిన్ స్టార్ అల్కరాజ్ ఆట కట్టించేశాడు. 12వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 4–6, 6–4, 6–3, 6–4తో మూడో సీడ్ అల్కరాజ్ను ఓడించాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఆట అబ్బురపరిచింది. జొకోవిచ్‌ను నిలువరించేందుకు 21 ఏళ్ల అల్కరాజ్ అన్ని అస్త్రాలను ప్రయోగించినా...సెర్బియా స్టార్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ర్యాలీ హోరాహోరీగా సాగుతుంటే హఠాత్తుగా దానిని డ్రాప్ షాట్‌గా మలిచి పాయింట్లు నెగ్గడం అల్కరాజ్కు అలవాటు. అయితే ఈసారి అల్కరాజ్ ఈ ‘డ్రాప్ షాట్’ల వ్యూహానికి పక్కాగా సిద్ధమై వచ్చిన జొకోవిచ్ సమర్థంగా అడ్డుకున్నాడు. 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌లను అల్కరాజ్ బ్రేక్ చేశాడు. అదే జోరులో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ కోల్పోవడంతో జొకోవిచ్పై ఒత్తిడి పెరిగింది. అయితే ఒత్తిడిలోనే జొకోవిచ్లోని మేటి ఆటగాడు మేల్కొన్నాడు. అల్కరాజ్ కంటే అద్భుతంగా ఆడుతూ ముందుకు వెళ్లాడు. రెండో సెట్లోని రెండో గేమ్‌లోనే అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలో వచ్చాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన అల్కరాజ్ ఐదో గేమ్‌లోనే జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. అయితే పదో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌లో ఒక్కసారిగా దూకుడు పెంచిన జొకోవిచ్ ఒక్క అవకాశం ఇవ్వకుండా సర్వీస్‌ను బ్రేక్ చేసి 50 నిమిషాల్లో రెండో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్లో కూడా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఆరో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌ను జొకోవిచ్ బ్రేక్ చేయగా... ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను అల్కరాజ్ బ్రేక్ చేశాడు. ఎనిమిదో గేమ్‌లో మళ్లీ అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 50 నిమిషాల్లో సెట్‌ను 6–3తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్లోని తొలి గేమ్‌లోనే అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన అన్ని సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 3 గంటల 28 నిమిషాల్లో 7–6 (7/1), 7–6 (7/0), 2–6, 6–1తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)పై గెలిచి మూడోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఫైనల్లో చోటు కోసం జొకోవిచ్‌తో జ్వెరెవ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 8–4తో జ్వెరెవ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వీరిద్దరు మూడుసార్లు (2021 యూఎస్ ఓపెన్ సెమీఫైనల్; 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్; 2019 ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్) పోటీపడగా... మూడుసార్లూ జొకోవిచే గెలిచాడు. వరుసగా 19వ విజయంతో... మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా 6–2, 2–6, 6–3తో 27వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై, బదోసా 7–5, 6–4తో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సబలెంకాకిది వరుసగా 19వ విజయం కావడం విశేషం. వరుసగా రెండేళ్లు (2023, 2024) ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సబలెంకా ఈసారీ టైటిల్ సాధిస్తే మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997, 1998, 1999) తర్వాత ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది. పావ్లీచెంకోవాతో ఒక గంట 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 29 విన్నర్స్ కొట్టింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. బదోసాతో ఒక గంట 43 నిమిషాలపాటు జరిగిన పోరులో కోకో గాఫ్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. కోకో గాఫ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన బదోసా ఈ గెలుపుతో తన కెరీర్లో ఆడుతోన్న 20వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో లొరెంజో సొనెగో (ఇటలీ)తో బెన్ షెల్టన్ (అమెరికా); అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో యానిక్ సినెర్; మహిళల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో మాడిసన్ కీస్ (అమెరికా)తో స్వితోలినా (ఉక్రెయిన్); ఎమ్మా నవారో (అమెరికా)తో ఇగా స్వియాటెక్ (పోలాండ్) తలపడతారు. బోపన్న జోడీ ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–షుయె జాంగ్ (చైనా) జోడీ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షుయె జాంగ్ ద్వయం 6–2, 4–6, 9–11తో జాన్ పీర్స్–ఒలివియా గడెస్కీ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది.50 ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధికంగా 50 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో పురుష సింగిల్స్ సెమీఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ఆల్‌టైమ్ రికార్డు క్రిస్ ఎవర్ట్ (52 సార్లు; అమెరికా) పేరిట ఉంది. -
జొకోవిచ్, సబలెంకా జోరు
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్ సాధించే దిశగా సబలెంకా... రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే దిశగా జొకోవిచ్ మరో అడుగు ముందుకు వేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్).... పురుషుల సింగిల్స్‌లో 10 సార్లు విజేత జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/5), 6–4తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై గెలుపొందగా... ఏడో సీడ్ జొకోవిచ్ 6–1, 6–4, 6–4తో 26వ సీడ్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. క్లారాతో 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకాకు గట్టిపోటీ ఎదురైనా కీలకదశలో ఆమె పైచేయి సాధించింది. మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టని సబలెంకా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 39 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 29 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు క్లారా ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్ కోల్పోయిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్ మూడో మ్యాచ్‌లో మాత్రం వరుసగా మూడు సెట్లలో గెలుపొందడం విశేషం. మఖచ్తో 2 గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 28 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్...నెట్ వద్దకు 18 సార్లు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన ఈ మాజీ చాంపియన్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్; మిరా ఆంద్రీవా (రష్యా)తో సబలెంకా తలపడతారు. పురుషుల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–2, 6–4, 6–7 (3/7), 6–2తో బోర్జెస్ (పోర్చుగల్)పై, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–4, 6–4తో ఫియరెన్లే (బ్రిటన్)పై, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 7–6 (7/2), 6–2, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. కోకో గాఫ్ సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ఇంటిదారి పట్టింది. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 6–4, 6–2తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గగా... పెగూలా 6–7 (3/7), 1–6తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) చేతిలో ఓడిపోయింది. 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్), 27వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా), బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. బెన్‌చిచ్‌తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయాక మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) గాయం కారణంగా వైదొలిగింది. -
నిశేష్ X జొకోవిచ్
మెల్బోర్న్: తన కెరీర్లో ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లోనే తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి దిగ్గజ ప్లేయర్‌ను ‘ఢీ’కొనబోతున్నాడు. ఈనెల 12 నుంచి మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు సంబంధించి ‘డ్రా’ వివరాలను గురువారం విడుదల చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను రికార్డుస్థాయిలో 10 సార్లు గెల్చుకున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్ ప్రత్యర్థిగా నిశేష్ ఎదురునిలువనున్నాడు. 37 ఏళ్ల జొకోవిచ్ ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తే జొకోవిచ్ కెరీర్లో 100 సింగిల్స్ టైటిల్స్ మైలురాయిని అందుకోవడంతోపాటు అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖిస్తాడు. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న 19 ఏళ్ల నిశేష్ ‘వైల్డ్ కార్డు’తో గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేయనున్నాడు.సీజన్లో టాప్–8లో నిలిచిన 20 ఏళ్లలోపు ఆటగాళ్ల కోసం నిర్వహించే నెక్స్ట్ జనరేషన్ ఏటీపీ ఫైనల్స్‌లో గత ఏడాది నిశేష్ ఆడి ఆకట్టుకున్నాడు. దాంతో అతనికి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రెండేళ్లపాటు డాటా సైన్స్ విద్యార్థిగా ఉన్న నిశేష్ నెల రోజుల క్రితమే ప్రొఫెషనల్‌గా మారాడు. బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్లో ఫ్రాన్స్ స్టార్ గేల్ మోన్‌ఫిల్స్‌కు గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో నిశేష్ తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్లేయర్లను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం నిశేష్ ఫామ్ చూస్తుంటే అతను జొకోవిచ్‌కు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు జొకోవిచ్‌కు సులువైన ‘డ్రా’ ఎదురుకాలేదు. జొకోవిచ్ పార్శ్వంలోనే స్పెయిన్ స్టార్, ప్రపంచ 3వ ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్, జర్మనీకి చెందిన ప్రపంచ 2వ ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఉన్నారు. అంతా సవ్యంగా సాగితే జొకోవిచ్‌కు క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ ఎదురవుతాడు. అల్కరాజ్ను దాటితే సెమీఫైనల్లో జ్వెరెవ్‌తో జొకోవిచ్ ఆడే అవకాశముంది. ఈ సెర్బియా స్టార్ తుది పోరుకు చేరితే మరో పార్శ్వంలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో టైటిల్ కోసం ఆడాల్సి రావచ్చు. సబెలాంకాకు క్లిష్టమైన ‘డ్రా’ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకాకు కఠినమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, అమెరికా ప్లేయర్ స్లోన్ స్టీఫెన్స్‌తో సబలెంకా ఆడనుంది. గత రెండేళ్లలో ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా ఈసారీ గెలిస్తే ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకుంటుంది. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్ (1997, 1998, 1999) తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా సబలెంకా గుర్తింపు పొందుతుంది. సబలెంకాతోపాటు టైటిల్ ఫేవరెట్స్‌గా ఇగా స్వియాటెక్ (పోలాండ్), కోకో గాఫ్ (అమెరికా), కిన్వెన్ జెంగ్ (చైనా), రిబాకినా (కజకిస్తాన్) ఉన్నారు. నగాల్ ప్రత్యర్థి మెఖాచ్ భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 26వ ర్యాంకర్ టొమాస్ మెఖాచ్ (చెక్ రిపబ్లిక్)తో ఆడతాడు. ప్రస్తుతం 96వ ర్యాంక్‌లో ఉన్న నగాల్ తన ర్యాంక్ ఆధారంగా మెయిన్ ‘డ్రా’లో చోటు పొందాడు. గత ఏడాది ఇదే టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించి సంచలనం సృష్టించిన నగాల్ రెండో రౌండ్లో చైనా ప్లేయర్ జున్‌చెంగ్ చేతిలో ఓడిపోయాడు. -
జొకోవిచ్ ఒలింపిక్ స్వర్ణ స్వప్నం నెరవేరేనా? నేడు అల్కరాజ్తో ఫైనల్ పోరు
తన సుదీర్ఘ కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందుకునేందుకు సెర్బియా దిగ్గజం విజయం దూరంలో నిలిచాడు. వరుసగా ఐదో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడుతున్న 37 ఏళ్ల జొకోవిచ్ తొలిసారి పసిడి పతక పోరుకు అర్హత సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ సెమీఫైనల్లో జొకోవిచ్ 6–4, 6–2తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలిచాడు. తద్వారా ఒలింపిక్స్ టెన్నిస్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన పెద్ద వయసు్కడిగా గుర్తింపు పొందాడు. నేడు జరిగే ఫైనల్లో ఈ ఏడాది ఫ్రెంచ్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నల చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 3–3తో సమంగా ఉన్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జొకోవిచ్ కాంస్య పతకం గెలిచాడు. 2012 లండన్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జొకోవిచ్ 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. -
Wimbledon 2024: ‘కింగ్’ అల్కరాజ్
లండన్: పురుషుల టెన్నిస్‌లో కార్లోస్ అల్కరాజ్ శకం మొదలైంది! 21 ఏళ్ల ఈ స్పెయిన్ స్టార్ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ అల్కరాజ్ 2 గంటల 27 నిమిషాల్లో 6–2, 6–2, 7–6 (7/4)తో రెండో సీడ్ , 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత జొకోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. విజేత అల్కరాజ్కు 27 లక్షల పౌండ్ల (రూ. 29 కోట్ల 23 లక్షలు) ప్రైజ్‌మనీ... రన్నరప్ జొకోవిచ్‌కు 14 లక్షల పౌండ్ల (రూ. 15 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. అల్కరాజ్ కెరీర్లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. అతను 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్, 2024లో ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలను సాధించాడు. బ్రేక్ పాయింట్‌తో మొదలు... గత ఏడాది ఐదు సెట్ల పోరులో జొకోవిచ్‌ను ఓడించిన అల్కరాజ్ ఈసారి తొలి పాయింట్ నుంచే ఆధిపత్యం కనబరిచాడు. తొలి సెట్లో 14 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లోనే జొకోవిచ్ సర్వీస్‌ను అల్కరాజ్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను రెండోసారి బ్రేక్ చేసిన అల్కరాజ్ అదే జోరులో 41 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో తొలి గేమ్‌లో, ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన అల్కరాజ్ 34 నిమిషాల్లో సెట్ నెగ్గాడు. మూడో సెట్లోని తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ పదో గేమ్‌లోని తన సర్వీస్‌లో 40–0తో మూడు మ్యాచ్ పాయింట్లను సాధించాడు. అయితే ఈ మూడు మ్యాచ్ పాయింట్లను జొకోవిచ్ కాపాడుకొని గట్టెక్కాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో అల్కరాజ్ పైచేయి సాధించి జొకోవిచ్ ఆట కట్టించాడు. 6 ఓపెన్ శకంలో ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ టైటిల్స్ సాధించిన ఆరో ప్లేయర్ అల్కరాజ్. గతంలో రాడ్ లేవర్ (ఆ్రస్టేలియా; 1969లో), జాన్ బోర్గ్ (స్వీడన్; 1978, 1979, 1980లలో), రాఫెల్ నాదల్ (స్పెయిన్; 2008, 2010లలో), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 2009లో), జొకోవిచ్ (సెర్బియా; 2021లో) ఈ ఘనత సాధించారు. -
సెమీస్‌లో జొకోవిచ్
లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించే దిశగా సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు వేశాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్ అయిన జొకోవిచ్ కోర్టులో అడుగు పెట్టకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బుధవారం జొకోవిచ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సిన ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) తుంటి గాయంతో వైదొలిగాడు. దాంతో జొకోవిచ్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు ఇటలీ రైజింగ్ స్టార్ లొరెంజో ముసెట్టి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నాడు. టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 3–6, 7–6 (7/5), 6–2, 3–6, 6–1తో గెలిచి సెమీస్‌లో జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), 31వ సీడ్ బార్బరా క్రిచికో వా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రిబాకినా 6–3, 6–2తో స్వితోలినా (ఉక్రెయిన్)పై, క్రిచికోవా 6–4, 7–6 (7/4)తో ఒస్టాపెంకో (లాతి్వయా)పై గెలిచారు. -
మూడో రౌండ్లో జొకోవిచ్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 5–7, 7–5తో జేకబ్ ఫెర్న్లె (బ్రిటన్) పై గెలుపొందాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) 3 గంటల 42 నిమిషాల్లో 7–6 (7/3), 7–6 (7/4), 2–6, 7–6 (7/4)తో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 4–6, 7–6 (9/7), 1–6తో జిన్యు వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా); యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీలు తొలి రౌండ్లో నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాయి. -
జొకోవిచ్‌కు షాక్
కాలిఫోర్నియా: ఐదేళ్ల తర్వాత ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ –1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. టాప్ సీడ్ హోదాలో పోటీపడ్డ ఈ సెర్బియా దిగ్గజం పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 123వ ర్యాంకర్ లూకా నార్దీ మూడో రౌండ్లో 6–4, 3–6, 6–3తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నార్దీ ఆరు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, జొకోవిచ్ సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఈ గెలుపుతో మాస్టర్స్ సిరీస్, గ్రాండ్‌స్లామ్ టోర్నిలలో జొకోవిచ్‌ను ఓడించిన అతి తక్కువ ర్యాంకర్‌గా నార్దీ గుర్తింపు పొందాడు. -
Australian Open 2024: విన్నర్ సినెర్...
మెల్బోర్న్: సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)పై తాను సాధించిన విజయం గాలివాటమేమీ ఇటలీ యువతార యానిక్ సినెర్ నిరూపించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నాలుగో సీడ్ సినెర్ చాంపియన్‌గా అవతరించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సినెర్ 3–6, 3–6, 6–4, 6–4, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై చిరస్మరణీయ విజయం సాధించాడు. తద్వారా 1976 తర్వాత పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఇటలీ ప్లేయర్ గా, ఆ్రస్టేలియన్ ఓపెన్ సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 3 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల సినెర్ తొలి రెండు సెట్లు కోల్పోయినా ఆందోళన చెంద లేదు. మూడో సెట్ నుంచి సినెర్ నెమ్మదిగా లయలోకి వచ్చాడు. కెరీర్లో ఆరోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న మెద్వెదెవ్పై ఒత్తిడి తెచ్చాడు. మూడో సెట్ పదో గేమ్‌లో, నాలుగో సెట్ పదో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌లను బ్రేక్ చేసిన సినెర్ రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఆరో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. విజేత సినెర్‌కు 31 లక్షల 50 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 17 లక్షల 25 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
జొకోవిచ్‌కు సినెర్ షాక్
మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. డిఫెండింగ్ చాంపియన్, 10 సార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్ ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్ ధాటికి జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో సినెర్ 3 గంటల 22 నిమిషాల్లో 6–1, 6–2, 6–7 (6/8), 6–4తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జొకోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో ఆడిన సినెర్ తొమ్మిది ఏస్‌లు సంధించి, 31 విన్నర్స్ కొట్టాడు. జొకోవిచ్ సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్విస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశమే ఇవ్వలేదు. మరోవైపు జొకోవిచ్ 54 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)తో సినెర్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో మెద్వెదెవ్ 4 గంటల 18 నిమిషాల్లో 5–7, 3–6, 7–6 (7/4), 7–6 (7/5), 6–3తో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై అద్భుత విజయం సాధించి ఈ టోరీ్నలో మూడోసారి, ఓవరాల్‌గా ఆరోసారి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఫైనల్‌కు చేరుకున్నాడు. -
ఎదురులేని జొకోవిచ్
మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) తన జోరు కొనసాగిస్తూ 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 7–6 (7/3), 4–6, 6–2, 6–3తో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 20 ఏస్‌లతో హడలెత్తించాడు. 52 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 13సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 36 ఏళ్ల జొకోవిచ్ ఈ టోర్నీలో గతంలో సెమీఫైనల్ చేరిన 10 సార్లూ విజేతగా తిరిగి రావడం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–4, 7–6 (7/5), 6–3తో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి సెమీఫైనల్లో జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో సినెర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో సినెర్ ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సూపర్ సబలెంకా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై, కోకో గాఫ్ 7–6 (8/6), 6–7 (3/7), 6–2తో మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించారు. క్రిచికోవాతో 71 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సబలెంకా నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
Australian Open: శ్రమించిన జొకోవిచ్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ఆదివారం మొదలైన ఈ టోరీ్నలో తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–4తో ప్రపంచ 178వ ర్యాంకర్, క్వాలిఫయర్ డినో ప్రిజ్మిక్ (క్రొయేíÙయా)పై కష్టపడి గెలిచాడు. 4 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. 40 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 49 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ప్రత్యర్థి సరీ్వస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. సబలెంకా సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ సబలెంకా 6–0, 6–1తో 53 నిమిషాల్లో ఇలా సెడెల్ (జర్మనీ)పై గెలిచింది. ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. -
ఫైనల్లో జొకోవిచ్, మెద్వెదెవ్
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరో అడుగు దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పదో సారి ఫైనల్‌కు చేరిన ఈ సెర్బియా దిగ్గజం తుది పోరుకు సన్నద్ధమయ్యాడు. అయితే అతని టైటిల్ వేటలో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ అడ్డుగా ఉన్నాడు. ఇదే వేదికపై తన ఏకైక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మెద్వెదెవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. రెండేళ్ల క్రితం 2021లో యూఎస్ ఓపెన్ ఫైనల్ వీరిద్దరి మధ్య జరిగింది. అనూహ్య ప్రదర్శనతో చెలరేగిన మెద్వెదెవ్ వరుస సెట్లలో జొకోను ఓడించి విజేతగా నిలిచాడు. ఈ సారి గత పోరుకు ప్రతీకారం తీర్చుకోవాలని నొవాక్ పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 7–6 (7/4) స్కోరుతో అమెరికన్ కుర్రాడు బెన్ షెల్టన్‌పై విజయం సాధించగా... మెద్వెదెవ్ వరల్డ్ నంబర్‌వన్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)కు షాక్ ఇచ్చాడు. సెమీస్ పోరులో మెద్వెదెవ్ 7–6 (7/3), 6–1, 3–6, 6–3తో అల్కరాజ్ను ఓడించాడు. ఏకపక్షంగా... గ్రాండ్‌స్లామ్‌లో హార్డ్కోర్ట్ వేదికపై తన 100వ మ్యాచ్ బరిలోకి దిగిన జొకోవిచ్ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు. 149 కిలోమీటర్ల వేగంతో మెరుపు సరీ్వస్లే బలంగా షెల్టన్ పోటీ ఇచ్చినా చివరకు దిగ్గజం ముందు తలవంచక తప్పలేదు. మూడో సెట్లో ఒక దశలో 5–4తో సెట్ కోసం సర్వీస్ చేసినా...జొకో ప్రశాంతంగా ప్రత్య ర్థిని నిలువరించగలిగాడు. 2 గంటల 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరూ చెరో 5 ఏస్‌లు సంధించారు. అయితే జొకోవిచ్ 25 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్‌తో పోలిస్తే 43 తప్పులు చేసిన షెల్టన్ మూల్యం చెల్లించుకున్నాడు. 36 ఏళ్ల జొకోవిచ్‌కు ఇది 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం కాగా...టైటిల్ గెలిస్తే ఓపెన్ ఎరాలో అతి పెద్ద వయసులో యూఎస్ ఓపెన్ నెగ్గిన ఆటగాడిగా నిలుస్తాడు. యూఎస్ ఓపెన్‌లో గతంలో 9 సార్లు ఫైనల్ చేరిన జొకోవిచ్ 3 టైటిల్స్ సాధించి 6 సార్లు ఓడాడు. మరో టైటిల్ వేటలో... రెండో సెమీస్‌లో సగటు అభిమాని ఊహించని ఫలితం వచ్చింది. ఈ సీజన్లో రెండు సార్లు అల్కరాజ్ చేతిలో ఓడిన రష్యా ఆటగాడు అసలు సమరంలో సత్తా చాటాడు. జొకోవిచ్–అల్కరాజ్ మధ్య టైటిల్ పోరు అంటూ సాగిన అంచనాలను అతను బద్దలుకొట్టాడు. తొలి సెట్ హోరాహోరీగా సాగినా ఒక దశలో 19 పాయింట్లలో 16 నెగ్గి మెద్వెదెవ్ టైబ్రేక్‌లో సెట్ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో అల్కరాజ్ అవకాశం అందిపుచ్చుకున్నా, ఆ తర్వాత అతని జోరు సాగలేదు. మెద్వెదెవ్ 9 ఏస్‌లు కొట్టగా, అల్కరాజ్ ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోవడం ఈ మ్యాచ్‌లో అతని బలహీనతను చూపించింది. మెద్వెదెవ్ 10 డబుల్‌ఫాల్ట్‌లు చేసినా తుది ఫలితంపై అది ప్రభావం చూపించలేదు. -
55 ఏళ్ల తర్వాత మరో టీనేజ్ చాంపియన్‌గా చరిత్ర.. ఆమె ఎవరంటే?
సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 మహిళల టెన్నిస్ టోర్నీ ఫైనల్లో అమెరికా టీనేజర్, 19 ఏళ్ల కోకో గాఫ్ 6–3, 6–4తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి తన కెరీర్లో తొలి మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కోకో గాఫ్‌కు 4,54,500 డాలర్ల (రూ. 3 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది ఈ గెలుపుతో 55 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన టీనేజ్ ప్లేయర్‌గా కోకో గుర్తింపు పొందింది. 1968లో అమెరికాకే చెందిన 17 ఏళ్ల లిండా టుయెరో విజేతగా నిలిచింది. లెక్క సరిచేసిన జొకోవిచ్ ఒహాయో: సెర్బియా టెన్నిస్ యోధుడు జొకోవిచ్ తన కెరీర్లో 39వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్)తో 3 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ 5–7, 7–6 (9/7), 7–6 (7/4)తో గెలుపొందాడు. రెండో సెట్ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఒక మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 10,19,335 డాలర్ల (రూ. 8 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి జొకోవిచ్ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది 95వ సింగిల్స్ టైటిల్‌కాగా, కెరీర్లో 1,069వ విజయం. -
ఫేవరెట్‌గా జొకోవిచ్
లండన్: అల్కరాజ్ ప్రపంచ నంబర్‌వన్ అయినా... ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో అందరి కళ్లూ జొకోవిచ్‌పైనే ఉన్నాయి. ఈ సెర్బియన్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ ‘హ్యాట్రిక్’తో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదో టైటిల్ చేజిక్కించుకుంటాడనే అంచనాలు పెరిగాయి. మరోవైపు స్పెయిన్ సంచలనం అల్కరాజ్ కూడా టాప్ ర్యాంకు ఉత్సాహంతో వింబుల్డన్ వేటకు సిద్ధమమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత ఎలీనా రిబాకినా కూడా వింబుల్డన్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సమరానికి సై అంటోంది. సోమవారం నుంచి వింబుల్డన్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే సీడింగ్స్, డ్రా విడుదల చేయగా... ఇప్పుడు కోర్టులో టైటిల్ వేటే మిగిలింది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డుతో ఉన్న జొకోవిచ్ ఇప్పుడు 24వ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. రెండో సీడ్ సెర్బియన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో పెడ్రొ కచిన్ (అర్జెంటీనా)తో తలపడతాడు. టాప్‌సీడ్ కార్లొస్ అల్కరాజ్... జెరెమి చార్డి (ఫ్రాన్స్)తో జరిగే మొదటి రౌండ్ పోరుతో వింబుల్డన్‌కు శ్రీకారం చుట్టనున్నాడు. మహిళల సింగిల్స్‌లో రిబాకినా వరుసగా రెండో టైటిల్‌పై ఆశలు పెట్టుకుంది. గతేడాది ఈ 24 ఏళ్ల కజకిస్తాన్ స్టార్ వింబుల్డన్ ట్రోఫీతో తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను తృటిలో కోల్పోయింది. ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ఆమె రన్నరప్‌గా తృప్తిపడింది. టైటిల్ నిలబెట్టుకునేందుకు తొలి రౌండ్లో అమెరికన్ రోజర్స్‌తో ఆమె తలపడనుంది. ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి, తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)... జు లిన్ (చైనా)తో గ్రాండ్‌స్లామ్ ఆటను మొదలుపెట్టనుంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్న అమెరికన్ వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినాతో పోటీ పడుతుంది. -
రష్యా, బెలారస్ ప్లేయర్లపై నిషేధం అన్యాయం.. నదాల్, జకో, ముర్రే
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై స్టార్ టెన్నిస్ ప్లేయర్లు రఫెల్ నదాల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే స్పందించారు. రష్యా, బెలారస్ ఆటగాళ్లను వింబుల్డన్‌లో పాల్గొనకుండా నిషేధించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ నిషేధం అన్యాయమని, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వల్ల చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్), డబ్ల్యూటీఏ (వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్) కూడా ఖండించింది. కాగా, రష్యా.. బెలారస్ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్‌పై దాడుల చేస్తున్నందుకు గాను ఆ రెండు దేశాల ప్లేయర్లపై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ డేనిల్ మెద్వెదెవ్, గతేడాది వుమెన్స్ సెమీ ఫైనలిస్ట్ (వింబుల్డన్ ), బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా వంటి చాలామంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వింబుల్డన్‌కు దూరం కానున్నారు. వింబుల్డన్ టోర్నీ ఈ ఏడాది జూన్ 27నుండి జూలై 10 వరకు జరగనుంది. చదవండి: Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం.. -
Novak Djokovic: జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా భారీ షాక్.. ఓడిపోతే ఇక అంతే!
ఆస్ట్రేలియా ఓపెన్ డ్రా చూస్తే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ తప్పక బరిలోకి దిగుతాడనిపించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రపంచ నంబర్‌వన్‌కు బహిష్కరణ తప్పేలా లేదు. మామూలుగా టెన్నిస్ కోర్టులో ఆటగాడు ‘డబుల్‌ఫాల్ట్’ చేస్తాడు. కానీ ప్రభుత్వం దెబ్బకు ఈ టాప్‌సీడ్ ‘డబుల్‌ఫాల్ట్’ అయ్యాడు. రెండో సారీ అతని వీసా రద్దయింది. ఆసీస్ విదేశీ మంత్రిత్వశాఖ తన విచక్షణాధికారం మేరకు అతని వీసాను రెండోసారి రద్దు చేసింది. దేశ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ‘టెన్నిస్ లెజెండ్’ను అమర్యాదగా సాగనంపబోమని, కొన్ని రోజులు ఇక్కడ ఉండే వెసులుబాటు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జొకో మాత్రం ‘తగ్గేదేలే’... వెనక్కి వెళ్లేదేలే అంటున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై తన న్యాయపోరాటం కొనసాగిస్తానని తెలిపాడు. తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లోని 20 టైటిళ్లలో 9 సార్లు విజేతగా నిలిపిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను అంత తేలిగ్గా వదిలేలా లేడు. ప్రాక్టీస్‌లో అతను శ్రమిస్తుంటే... అతని లీగల్ టీమ్ కోర్టులో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఫెడరల్ సర్క్యూట్‌లోని ఫ్యామిలీ కోర్టులో అత్యవసర విచారణ కోసం అప్పీల్ చేసింది. సోమవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుండటంతో ఫెడరల్ కోర్టు నేడు (శనివారం) అత్యవసర విచారణ చేపడుతుందా లేదంటే విచారణను తిరస్కరిస్తుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు. ఈ ఫెడరల్ కోర్టులోనే మొదటిసారి రద్దయిన వీసాను పునరుద్దరించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టు నుంచి వీసా పునరుద్ధరణ లభించినప్పటికీ మళ్లీ రద్దు చేసే అధికారం విదేశీ మంత్రిత్వ శాఖకు ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖ రద్దు చేసింది. ఇలా ఒక వ్యక్తికి వరుసగా రెండోసారి వీసా రద్దు చేస్తే... అతను మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. జొకో న్యాయ పోరాటం చేసి విఫలమైతే మూడేళ్లు అంటే 2025 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడే అవకాశం రాదు. చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
మూడో రౌండ్లో జొకోవిచ్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–2, 6–3, 6–2తో టలాన్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్ హలెప్ (రొమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్లో హలెప్ 7–6 (13/11), 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–కోకో వాండవే (అమెరికా) జంట 6–4, 4–6, 3–6తో రలుకా (రొమేనియా)–కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడింది. -
జొకోవిచ్ శుభారంభం
న్యూయార్క్: ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతపై గురి పెట్టిన వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 145వ ర్యాంకర్ హోల్గర్ రూన్ (డెన్మార్క్)తో బుధవారం జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్ 6–1, 6–7 (5/7), 6–2, 6–1తో గెలిచాడు. మరోవైపు తొమ్మిదో సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. క్రెసీ (అమెరికా) 5–7, 4–6, 6–1, 6–4, 7–6 (9/7)తో బుస్టాపై గెలిచాడు. ఒసాకా, హలెప్ ముందంజ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా) మూడో రౌండ్లోకి చేరారు. రెండో రౌండ్లో ఒసాకాతో ఆడాల్సిన ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) ‘వాకోవర్’ ఇచ్చింది. హలెప్ 6–3, 6–1తో కుచోవా (స్లొవేకియా)పై నెగ్గింది. మరో వైపు టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఆరో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), నాలుగో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్‌కు చేరారు. -
US Open 2021: రికార్డులపై జొకోవిచ్ గురి
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ జొకోవిచ్‌ను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. అందులో ఒకటి ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ (ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) కాగా... రెండోది పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నిలువడం. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ టైటిల్స్‌ను గెలిచాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) సరసన చేరాడు. యూఎస్ ఓపెన్‌లోనూ జొకోవిచ్ గెలిస్తే 21 టైటిల్స్‌తో కొత్త చరిత్రను సృష్టిస్తాడు. అంతేకాకుండా దిగ్గజ ప్లేయర్ రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలుస్తాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున జరిగే తొలి రౌండ్లో క్వాలిఫయర్ హోల్గర్ రునే (డెన్మార్క్) తో జొకోవిచ్ తలపడతాడు. -
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్
లండన్: ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ తన కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా ముందడుగు వేస్తున్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్‌సీడ్ సెర్బియన్ స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–3, 7–6 (9/7)తో డెనిస్ కుడ్లా (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటలా 17 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను జొకోవిచ్ అలవోకగానే కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్లో మాత్రం క్వాలిఫయర్ కుడ్లా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఈ సెట్లో తొలి మూడు గేమ్‌లను సొంతం చేసుకున్న కుడ్లా 3–0తో ఆధిక్యంలో నిలిచాడు. వెంటనే తేరుకున్న జొకోవిచ్ ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి... అనంతరం తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 4–4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో సెట్ ‘టై బ్రేక్’కు దారి తీసింది. ఇక్కడ కూడా జొకోవిచ్ ఒక దశలో 1–4తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో స్కోర్‌ను 4–4 వద్ద సమం చేశాడు. ఇక ఇదే దూకుడులో ‘టై బ్రేక్’ను గెలిచిన జొకోవిచ్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ముగిసిన టియాఫె పోరాటం తొలి రౌండ్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)కు షాకిచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఫ్రాన్సెస్ టియాఫె (అమెరికా) పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో టియాఫె 3–6, 4–6, 4–6తో కరెన్ కచనోవ్ (రష్యా) చేతిలో ఓడాడు. తొమ్మిదో సీడ్ డియాగో స్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)కు మూడో రౌండ్లో ఊహించని షాక్ తగిలింది. అతను 3–6, 3–6, 7–6 (8/6), 4–6తో అన్‌సీడెడ్ ఆటగాడు మార్టోన్ ఫుక్సోవిక్స్ (హంగేరి) చేతిలో ఓడాడు. మాజీ చాంపియన్ ముగురుజా అవుట్ మహిళల సింగిల్స్‌లో 2017 వింబుల్డన్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)కు చుక్కెదురైంది. మూడో రౌండ్లో ముగురుజా 7–5, 3–6, 2–6తో ఓన్స్ జేబుర్ (ట్యూనీషియా) చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్ అరీనా సబలెంక (బెలారస్), ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్లో సానియా–బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జరిగిన తొలి రౌండ్లో భారత ద్వయం సానియా మీర్జా– రోహన్ బోపన్న 6–2, 7–6 (7/5)తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్–అంకిత రైనా జంటపై గెలుపొంది రెండో రౌండ్లో ప్రవేశించింది. దివిజ్ శరణ్–సమంత శరణ్ (ఇంగ్లండ్) జోడీ 6–3, 5–7, 6–4 అరియల్ బెహెర్ (ఇజ్రాయెల్)–కలీనా ఒస్కబొయెవా (కజకిస్తాన్) జంటపై నెగ్గింది. -
సెరెనా ‘జూ’కు... జొకోవిచ్ పార్క్‌కు...
అడిలైడ్: 14 రోజుల క్వారంటైన్... మరో చోట అయితే మామూలుగా గడిచిపోయేదేమో! కానీ కఠిన ఆంక్షలు ఉన్న ఆస్ట్రేలియాలో అదంత సులువు కాదు. ఇక ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఆటగాళ్ల పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చి క్వారంటైన్లో ఉన్న టెన్నిస్ స్టార్లు తమ రెండు వారాల క్వారంటైన్ ముగియడంతో ఒక్కసారిగా స్వేచ్ఛాజీవులుగా మారిపోయారు. మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ తన మూడేళ్లు కూతురు ఒలింపియాతో కలిసి ‘జూ’కు వెళ్లి సరదాగా గడిపింది. ‘ఒక్క గదిలో ఇన్ని రోజులు ఉండాల్సి రావడం చాలా కష్టం. అయితే పాపతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించింది. ఇప్పుడు బయటకు రావడం సంతోషంగా ఉంది. అందుకే క్వారంటైన్ ముగియగానే జూకు వెళ్లొచ్చాం’ అని సెరెనా చెప్పింది. వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ క్వారంటైన్ ముగియగానే స్థానిక పార్క్‌లో చెప్పులు లేకుండా నడిచి తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ‘ఇన్ని రోజులుగా నాకు అవకాశం రాని పని చేయాలననుకున్నా. ఇప్పుడు ఇలా పచ్చగడ్డిపై పాదాలు పెట్టగానే హాయిగా అనిపించింది’ అని జొకోవిచ్ అన్నాడు. మరోవైపు శుక్రవారం జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో నయోమి ఒసాకాపై సెరెనా విలియమ్స్, యాష్లే బార్టీపై సిమోనా హలెప్, డొమినిక్ థీమ్‌పై రాఫెల్ నాదల్ విజయం సాధించారు. జన్నిక్ సిన్నర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్లో ఫిలిప్ క్రనోవిక్ తలపడగా... రెండో సెట్లో క్రనోవిక్ స్థానంలో జొకోవిచ్ వచ్చి ఆడటం విశేషం. ఈ మ్యాచ్‌లో క్రనోవిక్–జొకోవిచ్ గెలిచారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్లో ఫిబ్రవరి 8న మొదలవుతుంది. -
మెద్వెదేవ్‌కు చుక్కెదురు
పారిస్: హార్డ్ కోర్టులపై అద్భుతంగా ఆడే రష్యా యువతార డానిల్ మెద్వెదేవ్ ఎర్రమట్టి కోర్టులపై మరోసారి తేలిపోయాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ మెద్వెదేవ్ వరుసగా నాలుగో ఏడాదీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 63వ ర్యాంకర్ మార్టన్ ఫుచోవిచ్ (హంగేరి) 6–4, 7–6 (7/3), 2–6, 6–1తో మెద్వెదేవ్‌ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫుచోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) అలవోక విజయంతో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో జొకోవిచ్ 6–0, 6–2, 6–3తో మికెల్ వైమెర్ (స్వీడన్)ను ఓడించాడు. ఈ ఏడాది జొకోవిచ్‌కిది 32వ విజయం కావడం విశేషం. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో 13వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 3 గంటల 17 నిమిషాల్లో 6–7 (5/7), 5–7 (4/7), 7–5, 6–4, 6–3తో స్యామ్ క్వెరీ (అమెరికా)పై అద్భుత విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయిన రుబ్లెవ్ ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకొని నెగ్గడం విశేషం. ప్లిస్కోవా ముందంజ... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) శ్రమించి రెండో రౌండ్లోకి చేరారు. ప్లిస్కోవా 2 గంటల 15 నిమిషాల్లో 6–7 (9/11), 6–2, 6–4తో మాయర్ షెరీఫ్ (ఈజిప్ట్)పై, సోఫియా గంటా 58 నిమిషాల్లో 6–4, 3–6, 6–3తో లుద్మిలా సమ్సోనోవా (రష్యా)పై నెగ్గారు. ఇద్దరు క్వాలిఫయర్లు ఇరీనా బారా (రొమేనియా) 6–3, 6–4తో 26వ సీడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై... 17 ఏళ్ల క్లారా టౌసన్ (డెన్మార్క్) 2 గంటల 45 నిమిషాల్లో 6–4, 3–6, 9–7తో 21వ సీడ్ జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)పై సంచలన విజయాలు సాధించారు. 6 గంటల 5 నిమిషాల్లో... సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతోన్న ఇటలీ క్వాలిఫయర్ ఆటగాడు లొరెంజో గస్టినో అద్భుతం చేశాడు. 6 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మారథాన్ మ్యాచ్‌లో గస్టినో 0–6, 7–6 (9/7), 7–6 (7/3), 2–6, 18–16తో కొరెంటిన్ ముతె (ఫ్రాన్స్)పై గెలిచాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్లోకి చేరాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌గా ఇది నిలిచింది. 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో అర్నాడ్ క్లెమెంట్, ఫాబ్రిస్ సాంతోరో మ్యాచ్ 6 గంటల 33 నిమిషాలు జరిగింది. ముతె, గస్టినో మధ్య జరిగిన మ్యాచ్‌లో 22 బ్రేక్ పాయింట్లు నమోదయ్యాయి. గస్టినో 96, ముతె 88 అనవసర తప్పిదాలు చేశారు. చివరి సెట్ ఒక్కటే 3 గంటల 29 నిమిషాలు సాగడం విశేషం. -
సెరెనాకు సువర్ణావకాశం
న్యూయార్క్: గత మూడేళ్లుగా ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్–ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు యూఎస్ ఓపెన్ రూపంలో సెరెనాకు ఈ రికార్డును సమం చేసేందుకు సువర్ణావకాశం దక్కింది. కరోనా వైరస్ భయం కారణంగా తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమంటూ మహిళల సింగిల్స్‌లో టాప్–10 ర్యాంకింగ్స్‌లోని ఆరుగురు క్రీడాకారిణులు యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగారు. పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులు లేకపోవడంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌లో 25 ఏళ్ల అనుభవం ఉన్న సెరెనా తన అనుభవాన్నంతా రంగరిస్తే 24వ గ్రాండ్ స్లామ్‌ను అందుకోవడం కష్టమేమీ కాదు. ‘డ్రా’ ప్రకారం సెరెనాకు క్వార్టర్ ఫైనల్ వరకు కఠిన ప్రత్యర్థి దారిలో లేరు. ఫేవరెట్ జొకోవిచ్... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, మూడుసార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో రిస్క్ తీసుకోలేనంటూ డిఫెండింగ్ చాంపియన్, రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)... గాయం కారణంగా మాజీ చాంపియన్, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో ఆడటం లేదు. ఈ నేపథ్యంలో జొకోవిచ్ కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు. జొకోవిచ్ టైటిల్ దారిలో రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) అడ్డుతగిలే అవకాశం ఉంది. భారత్ నుంచి యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్‌లో సుమీత్ నాగల్... పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ బరిలో ఉన్నారు. ఈసారి మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులకు అనుమతించడం లేదు. సోమవారం టోర్నీ ప్రారంభమవుతుండగా ఆదివారం ఎంట్రీలు ఖరారు చేసిన జాబితాలో ఉన్న ఓ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్వాహకులు ప్రకటించారు. ఆ ఆటగాడు ఫ్రాన్స్‌కు చెందిన 17వ సీడ్ బెనోయిట్ పైర్ అని నిర్ధారణ అయింది. -
జొకోవిచ్ కోచ్ ఇవానిసెవిచ్కూ కరోనా
బెల్గ్రేడ్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆడించిన ఆటతో కోవిడ్–19 పాజిటివ్ బాధితులు పెరిగిపోతున్నారు. అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ సిరీస్ ద్వారా తాజాగా క్రొయేషియా టెన్నిస్ గ్రేట్, జొకోవిచ్ కోచ్ అయిన గొరాన్ ఇవానిసెవిచ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. పది రోజుల క్రితం రెండుసార్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని... తాజాగా మూడోసారి పాజిటివ్ వచ్చిందని గొరాన్ తెలిపాడు. లక్షణాలు లేకపోయినా తాను వైరస్ బారిన పడ్డానని చెప్పాడు. తనతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచించాడు. అడ్రియా టూర్లో సెర్బియా అంచె పోటీలు ముగిశాక.. క్రొయేషియాలో రెండో అంచె పోటీలు నిర్వహిస్తుండగా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇప్పటికే నిర్వాహకుడు, ఆటగాడు జొకోవిచ్ సహా, మరో ముగ్గురు ప్లేయర్లు దిమిత్రోవ్, బోర్నా చోరిచ్, విక్టర్ ట్రయెస్కీలకు వైరస్ సోకింది. -
ఆ రెండు రికార్డులను నేను సవరిస్తా: జొకోవిచ్
పారిస్: పురుషుల టెన్నిస్‌లో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (20) రికార్డు... అత్యధిక వారాల పాటు నంబర్‌వన్‌గా ఉన్న (310 వారాలు) రికార్డును తాను బద్దలు కొట్టగలనని సెర్బియా స్టార్ జొకోవిచ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన ఆటగాడిగానే తాను వీడ్కోలు పలుకుతానని జొకోవిచ్ అన్నాడు. ప్రస్తుతం ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి స్థానంలో... స్పెయిన్ స్టార్ నాదల్ 19 టైటిల్స్‌తో రెండో స్థానంలో ... 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం నంబర్‌వన్ ర్యాంకులో ఉన్న జొకోవిచ్ ఈ వారంతో ఆ హోదాలో 282 వారాలను పూర్తి చేసుకున్నాడు. -
తదుపరి లక్ష్యం ఫెడరర్ రికార్డు
మెల్బోర్న్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును అధిగమించడమే తన తదుపరి లక్ష్యమని సెర్బియా స్టార్ జొకోవిచ్ తెలిపాడు. రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 32 ఏళ్ల జొకోవిచ్ సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 17వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడరర్ అగ్రస్థానంలో... 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్పెయిన్ స్టార్ నాదల్ రెండో స్థానంలో ఉన్నారు. ‘నా జీవితంలోని ఈ దశలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఈ మెగా టోర్నీల కోసమే నేను పూర్తి సీజన్లో ఆడుతున్నాను. ఫెడరర్ రికార్డును అందుకోవడం, దానిని అధిగమించడమే నా తదుపరి లక్ష్యం. గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో సీజన్‌ను ప్రారంభించినందుకు అమితానందంతో ఉన్నాను. ఇదే ఉత్సాహంతో మిగిలిన సీజన్లో మంచి ఫలితాలు సాధిస్తాను’ అని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. -
పారిస్‌లో జైకోవిచ్
పారిస్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–4తో అన్‌సీడెడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)పై విజయం సాధించాడు. 65 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండు సెట్లలో ఒక్కోసారి షపోవలోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. విజేతగా నిలిచే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా సమర్పించుకోలేదు. చాంపియన్ జొకోవిచ్‌కు 9,95,720 యూరోల (రూ. 7 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ షపోవలోవ్‌కు 5,03,730 యూరోల (రూ. 3 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 34 జొకోవిచ్ కెరీర్లో ఇది 34వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. 35 టైటిల్స్‌తో రాఫెల్ నాదల్ (స్పెయిన్) అగ్రస్థానంలో ఉన్నాడు. 5 కెరీర్లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జాన్ మెకన్రో (అమెరికా)తో కలిసి జొకోవిచ్ (77 టైటిల్స్) సంయుక్తంగా ఐదో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్–103), ఇవాన్ లెండిల్ (అమెరికా–94), రాఫెల్ నాదల్ (స్పెయిన్–84 టైటిల్స్) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. -
జొకోవిచ్, ఒసాకా ఇంటిముఖం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్లు జొకోవిచ్ (సెర్బియా), ఒసాకా (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ ఓడిపోయే దశలో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 23వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో అతను 4–6, 5–7, 1–2 స్కోరు వద్ద రిటైర్ట్‌హర్ట్ అయ్యాడు. రెండో సీడ్ నాదల్ (స్పెయిన్) 6–3, 3–6, 6–1, 6–2తో సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచాడు. సెమీస్‌లో స్వితోలినా మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–4తో 16వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్)పై నెగ్గి యూఎస్ ఓపెన్‌లో తొలిసారి సెమీస్ బెర్త్ సంపాదించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా 5–7, 4–6తో 13వ సీడ్ బెన్సిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. -
జొకోవిచ్ కొత్త చరిత్ర
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెన్ శకంలో వరుసగా పదేళ్లు ఈ టోర్నీలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రాఫ్ (జర్మనీ)పై అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 2005 నుంచి క్రమం తప్పకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ 2010 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్‌కు, రెండుసార్లు సెమీఫైనల్‌కు, నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జ్వెరెవ్ 3–6, 6–2, 6–2, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై... ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 6–2, 6–7 (8/10), 6–2, 6–7 (8/10), 7–5తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–4, 6–2తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పెయిర్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో నిషికోరి 1–4, 3–5తో వెనుకబడినప్పటికీ పుంజుకొని నెగ్గడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో నిషికోరి తలపడతాడు. క్వార్టర్స్‌లో హలెప్, కీస్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), అన్‌సీడెడ్ అనిసిమోవా (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హలెప్ 6–1, 6–0తో స్వియాటెక్ (పోలాండ్)పై, యాష్లే బార్టీ 6–3, 3–6, 6–0తో సోఫియా కెనిన్ (అమెరికా)పై, కీస్ 6–2, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17 ఏళ్ల అనిసిమోవా 6–3, 6–0తో క్వాలిఫయర్ అలియోనా బొల్సోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. మూడో రౌండ్లో టాప్ సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గిన సినియకోవా, అమెరికా దిగ్గజం సెరెనాను ఓడించిన సోఫియా కెనిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడ్డారు. -
టాప్ ర్యాంకర్లు ఔట్
ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్లకు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లో, మహిళల ఈవెంట్లో నయోమి ఒసాకా (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. జొకోవిచ్ 4–6, 4–6తో కోల్‌ష్రైబర్ (జర్మనీ) చేతిలో కంగుతిన్నాడు. రెండో ర్యాంకర్ నాదల్ 6–3, 6–1తో స్వాట్జ్‌మన్ (అర్జెంటీనా)పై గెలుపొందగా, ఫెడరర్ 6–3, 6–4తో తన దేశానికే చెందిన వావ్రింకాపై నెగ్గాడు. మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఒసాకా 3–6, 1–6తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓటమి పాలైంది. రెండో సీడ్ హలెప్ (రొమేనియా) 2–6, 6–3, 2–6తో మర్కెట (చెక్ రిపబ్లిక్) చేతిలో కంగుతింది. -
జొకోవిచ్ నాలుగోసారి...
మొనాకో: అద్భుత ఫామ్‌తో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక 2019 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల్లో అతను ప్రపంచ ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచాడు. అతను ఈ అవారున్డు గెలుచుకోవడం నాలుగోసారి కావడం విశేషం. దీంతో జమైకా మేటి అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రికార్డును జొకో సమం చేయగా... ఫెడరర్ ఐదు లారెస్ అవార్డులతో అగ్రస్థానంలో ఉన్నాడు. గత సంవత్సరం వింబుల్డన్, యూఎస్ ఓపెన్ సాధించడంతో పాటు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన జొకోవిచ్ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 68 మంది సభ్యుల లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ 2018లో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూ విజేతలను ఎంపిక చేసింది. అమెరికాకు చెందిన టాప్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికైంది. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచిన ప్రదర్శనకు ఈ అవార్డు దక్కింది. ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ‘ఫిఫా’ ప్రపంచ కప్ గెలుచుకున్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు లభించింది. టెన్నిస్‌లో మహిళల వరల్డ్ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్)కు ‘బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచే క్రమంలో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాపై ఫైనల్లో సాధించిన విజయం ఆమెకు ఈ అవార్డు తెచ్చి పెట్టింది. మారథాన్‌లో ప్రపంచ రికార్డు (2 గంటల 1.39 నిమిషాలు) నెలకొల్పిన ఇలియుడ్ కిప్జోగె (కెన్యా)ను లారెస్ ‘ప్రత్యేక ఘనత’ అవార్డుతో సత్కరించింది. 22 ఏళ్ల పాటు ఫుట్‌బాల్ క్లబ్ అర్సెనల్కు మేనేజర్‌గా వ్యవహరించిన ఆర్సెన్ వెంగర్కు ‘లైఫ్ టైం అచీవ్మెంట్’ అవార్డు లభించింది. వినేశ్‌కు నిరాశ... లారెస్ స్పోర్ట్స్ అవార్డులకు నామినేట్ అయిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ‘కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కలేదు. రియో ఒలింపిక్స్‌లో తీవ్రంగా గాయపడిన వినేశ్... ఆ తర్వాత కోలుకొని గత ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించడంతో ఈ అవార్డుకు నామినేట్ అయింది. ఈ విభాగంలో అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌కు అవార్డు దక్కింది. ఐదేళ్ల విరామం తర్వాత అతను టూర్ చాంపియన్‌షిప్ సాధించడం విశేషం. ‘యువ’కు అవార్డు జార్ఖండ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన అమ్మాయిల జీవితాల్లో క్రీడల ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘యువ’కు ‘స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డ్’ దక్కింది. 2009లో ఈ సంస్థను అమెరికాకు చెందిన ఫ్రాన్జ్ గాస్ట్లర్ స్థాపించాడు. ఇక్కడ దాదాపు 450 మంది అమ్మాయిలు ఫుట్‌బాల్‌లో శిక్షణ పొందుతున్నారు. 2015లో ‘యువ’ స్కూల్‌ను ప్రారంభించి ఆటతో పాటు చదువు కూడా చెబుతున్నారు. వీరంతా ప్రొఫెషనల్స్ తరహాలో ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనకపోయినా... బాల్య వివాహాలు, అక్రమ రవాణావంటి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా అమ్మాయిలను తీర్చిదిద్దుతారు. కార్యక్రమంలో ‘యువ’ తరఫున హిమ, నీతా, రాధ, కోనిక అవార్డును స్వీకరించారు. -
జొకోవిచ్ జైత్రయాత్ర
గత రెండేళ్లలో ఫామ్ కోల్పోయి ఒకదశలో ఆటకు గుడ్‌బై చెప్పాలనుకున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పూర్వ వైభవం దిశగా సాగుతున్నాడు. ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ గెలిచి గాడిలో పడ్డ అతను తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా నిలిచాడు. తనలో ఆట ఇంకా చాలా మిగిలి ఉందని చాటి చెప్పాడు. మండే ఎండలు, తీవ్రమైన ఉక్కపోత కారణంగా ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో పలువురు మ్యాచ్ మధ్యలోనే వైదొలగగా... ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని, పటిష్టమైన ప్రత్యర్థులను బోల్తా కొట్టించి జొకోవిచ్ ఈ టోర్నీలో ఎదురులేని విజేతగా నిలిచాడు. న్యూయార్క్: తొలి రౌండ్లో మొదలైన జోరును ఫైనల్లోనూ కొనసాగించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మూడోసారి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/4), 6–3తో మూడో సీడ్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలుపొందాడు. విజేత జొకోవిచ్‌కు 38 లక్షల డాలర్లు (రూ. 27 కోట్ల 40 లక్షలు); రన్నరప్ డెల్‌పొట్రోకు 18 లక్షల 50 వేల డాలర్లు (రూ. 13 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడిన 31 ఏళ్ల జొకోవిచ్‌కు తుదిపోరులో తన ప్రత్యర్థి నుంచి అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. 3 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్తొలి సెట్లోని ఏడో గేమ్‌లో డెల్‌పొట్రో సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 6–3తో దక్కించుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను చేజార్చుకున్నారు. చివరకు టైబ్రేక్‌లో జొకోవిచ్ ఈ సెట్‌ను గెల్చుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో డెల్‌పొట్రో సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ►అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. 14 టైటిల్స్‌తో అతను పీట్ సంప్రాస్ (అమెరికా)తో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఫెడరర్ (20), రాఫెల్ నాదల్ (17) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ►ఒకే ఏడాది వరుసగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలవడం జొకోవిచ్‌కిది మూడోసారి. 2011, 2015లలో కూడా అతను ‘డబుల్’ సాధించాడు. ఫెడరర్ అత్యధికంగా నాలుగుసార్లు (2004, 05, 06, 07లలో) ఈ ఫీట్ సాధించాడు. ►ఓపెన్ శకంలో (1968 తర్వాత) యూఎస్ ఓపెన్ టైటిల్‌ను మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ఏడో ప్లేయర్ జొకోవిచ్. ఈ జాబితాలో ఫెడరర్, జిమ్మీ కానర్స్, పీట్ సంప్రాస్ (5 సార్లు చొప్పున), జాన్ మెకన్రో (4 సార్లు), ఇవాన్ లెండిల్, రాఫెల్ నాదల్ (3 సార్లు చొప్పున) ఉన్నారు. తాజా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పీట్ సంప్రాస్ సరసన చేరినందుకు ఆనందంగా ఉంది. అతను నా చిన్ననాటి ఆరాధ్య క్రీడాకారుడు. టీవీలో సంప్రాస్ వింబుల్డన్‌లో ఆడుతున్నపుడు చూసి నేను ఈ క్రీడవైపు మళ్లాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోచేతికి శస్త్రచికిత్స జరిగాక వింబుల్డన్, సిన్సినాటి మాస్టర్స్ సిరీస్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించానంటే నాకే నమ్మశక్యంగా లేదు. –జొకోవిచ్ -
జొకోవిచ్ దూకుడు
ఏడాది క్రితం రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ ట్రోఫీ సొంతం చేసుకున్న వేళ గాయం కారణంగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఇంట్లో ఉన్నాడు. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి మారిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ నాదల్ మాజీ విజేత డెల్‌పొట్రోతో జరిగిన సెమీఫైనల్లో మోకాలి గాయంతో మధ్యలోనే వైదొలగగా... పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న జొకోవిచ్ మాజీ రన్నరప్ నిషికోరిపై అలవోక విజయంతో రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. కెరీర్లో 23వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించిన జొకోవిచ్ 14వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం నేడు జరిగే యూఎస్ ఓపెన్ ఫైనల్లో 2009 చాంపియన్ డెల్‌పొట్రోతో అమీతుమీ తేల్చుకుంటాడు. న్యూయార్క్: ఈ సీజన్లో తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్... అర్జెంటీనా ఆజానుబాహుడు డెల్‌పొట్రో యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆరో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో 2014 రన్నరప్ నిషికోరి (జపాన్)పై... 2009 విజేత, మూడో సీడ్ డెల్‌పొట్రో 7–6 (7/3), 6–2తో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై గెలుపొందారు. డెల్‌పొట్రోతో జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు ఓడిపోయాక మోకాలి గాయం కారణంగా నాదల్ వైదొలిగాడు. నేటి ఫైనల్లో జొకోవిచ్, డెల్‌పొట్రో ‘ఢీ’కొంటారు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 14–4తో డెల్‌పొట్రోపై ఆధిక్యంలో ఉన్నాడు. 2007, 2012లో డెల్‌పొట్రోతో యూఎస్ ఓపెన్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో జొకోవిచ్ వరుస సెట్లలో గెలిచాడు. అయితే వీరిద్దరూ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తొలిసారి ముఖాముఖిగా తలపడనున్నారు. నిషికోరితో జరిగిన సెమీస్‌లో జొకోవిచ్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. బేస్‌లైన్ వద్దే ఎక్కువగా ఉంటూ శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో చెలరేగిన జొకోవిచ్ తన ప్రత్యర్థికి ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. జొకోవిచ్ వ్యూహాత్మక ఆటతీరుకు సమాధానం ఇవ్వలేకపోయిన నిషికోరి ఏకంగా 51 అనవసర తప్పిదాలు చేశాడు. 2 గంటల 22 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నిషికోరి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. ఈ విజయంతో జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో అత్యధికంగా ఎనిమిదిసార్లు ఫైనల్ చేరుకున్న క్రీడాకారులుగా పీట్ సంప్రాస్ (అమెరికా), ఇవాన్ లెండిల్ (చెకోస్లొవేకియా) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత పొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న పీట్ సంప్రాస్ (14 టైటిల్స్) సరసన చేరుతాడు. ఫెడరర్ (20 టైటిల్స్), రాఫెల్ నాదల్ (17 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 2009లో యూఎస్ ఓపెన్ గెలిచిన డెల్‌పొట్రో ఆ తర్వాత గాయాల కారణంగా 2016 వచ్చేసరికి 1,045వ ర్యాంక్‌కు పడిపోయాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 97 కేజీల బరువున్న డెల్‌పొట్రో గాయాల నుంచి కోలుకున్నాక గాడిలో పడ్డాడు. ఈ ఏడాది ఇండియన్‌వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను గెలిచి కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. నాదల్‌తో జరిగిన సెమీస్‌లో తొలి సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గిన డెల్‌పొట్రో రెండో సెట్లో రెండుసార్లు నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మోకాలి నొప్పితోనే ఈ టోర్నీలో ఆడిన రాఫెల్ నాదల్ రెండో సెట్ కూడా కోల్పోయాక ఇక నా వల్ల కాదంటూ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ►నేటి పురుషుల సింగిల్స్ ఫైనల్ రాత్రి గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సై అంటే సై అంటున్న ‘బిగ్ ఫోర్’
న్యూయార్క్: ఈ ఏడాది ‘బిగ్ ఫోర్’తో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రసవత్తరం కానుంది. గాయంతో చాన్నాళ్లుగా ఆటకు దూరమైన మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) పునరాగమనంతో పాటు ఈ ఏడాది ‘గ్రాండ్’ చాంపియన్లు ఫెడరర్ (ఆస్ట్రేలియన్ ఓపెన్), నాదల్ (ఫ్రెంచ్), జొకోవిచ్ (వింబుల్డన్) బరిలోకి దిగనుండటంతో యూఎస్ ఓపెన్‌లో హోరాహోరీకి రంగం సిద్ధమైంది. టాప్ స్టార్లంతా ఆడుతున్న సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీకి నేడు తెరలేవనుంది. భారత్ నుంచి యూకీ బాంబ్రీ పురుషుల సింగిల్స్‌లో... రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ డబుల్స్‌లో దిగుతున్నారు. ‘24’ కోసం సెరెనా... మహిళల సింగిల్స్ బరిలో ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్‌ను మరో రికార్డు ఊరిస్తోంది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ సెరెనా ఈసారి విజేతగా నిలిస్తే అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. జోరుమీదున్న ‘జోకర్’... వింబుల్డన్ చాంపియన్, ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) న్యూయార్క్‌లోనూ టైటిల్‌పై కన్నేశాడు. గతేడాది భుజం గాయంతో యూఎస్‌కు దూరమైన ‘జోకర్’ ఇక్కడ మూడో టైటిల్ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నాడు. 2011, 2015లలో విజేతగా నిలిచిన జొకో ఐదుసార్లు రన్నరప్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో ఫెడరర్‌పై టైటిల్ గెలిచిన జొకోవిచ్ మొత్తం తొమ్మిది వేర్వేరు మాస్టర్స్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. జోరు మీదున్న ఈ సెర్బియన్ స్టార్ తన ఫామ్ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నాదల్ (స్పెయిన్), రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశారు. -
అయ్యో... జొకోవిచ్!
కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతోన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు కొత్త ఏడాదీ కలిసి రాలేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ మాజీ విజేత ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. 21 ఏళ్ల కొరియా భవిష్యత్ తార హైన్ చుంగ్ అసమాన ఆటతీరుకు సెర్బియో యోధుడు తలవంచక తప్పలేదు. మూడేళ్ల క్రితం ఇదే వేదికపై తన ఆరాధ్య ఆటగాడి చేతిలో వరుస మూడు సెట్లలో ఓడిపోయిన చుంగ్ ఈసారి ఫలితాన్ని తారుమారు చేశాడు. జొకోవిచ్‌ను వరుస సెట్లలో మట్టికరిపించి తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న తొలి కొరియా ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. మెల్బోర్న్: ఎలాంటి అంచనాలు లేకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగు పెట్టిన అన్‌సీడెడ్ ఆటగాళ్లు హైన్ చుంగ్ (దక్షిణ కొరియా), టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా) సంచలనాల మోత మోగించారు. మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్, 14వ సీడ్ జొకోవిచ్‌ను హైన్ చుంగ్... ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను సాండ్‌గ్రెన్ బోల్తా కొట్టించి తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చుంగ్ 3 గంటల 21 నిమిషాల్లో 7–6 (7/4), 7–5, 7–6 (7/3)తో జొకోవిచ్పై... సాండ్‌గ్రెన్ 3 గంటల 54 నిమిషాల్లో 6–2, 4–6, 7–6 (7/4), 6–7 (7/9), 6–3తో థీమ్‌పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. సాండ్‌గ్రెన్ 20 ఏళ్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఆడిన తొలిసారే క్వార్టర్ ఫైనల్‌కు చేరిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ప్రపంచ 58వ ర్యాంకర్ చుంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ఏకంగా తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మూడు సెట్లలోనూ జొకోవిచ్ వరుసగా 0–4తో, 1–4తో, 1–3తో వెనుకబడ్డాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ,జొకోవిచ్‌కు గట్టిపోటీనిచ్చిన చుంగ్ కీలక దశలో పాయింట్లు రాబట్టి విజయాన్ని దక్కించుకున్నాడు. ‘రాకెట్ పట్టిన కొత్తలో నేను జొకోవిచ్ ఆటను అనుకరించేవాణ్ని. ఎందుకంటే అతను నాకు ఆరాధ్య ఆటగాడు. ఈ రోజు అతడినే ఓడించానంటే నమ్మశక్యంగా లేదు. అంతా కలలా ఉంది’ అని చుంగ్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. ఫెడరర్ జోరు: మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), 19వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) అలవోక విజయాలతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 6–4, 7–6 (7/3), 6–2తో ఫక్సోవిక్స్ (హంగేరి)పై, బెర్డిచ్ 6–1, 6–4, 6–4తో ఫాగ్నిని (ఇటలీ)పై నెగ్గారు. హలెప్ అలవోకగా: మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–3, 6–2తో ఒసాకా (జపాన్)పై సునాయాసంగా గెలుపొందగా... 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–2తో ఎనిమిదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. మాజీ చాంపియన్, 21వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 4–6, 7–5, 6–2తో సు వె సెయి (చైనీస్ తైపీ)పై, ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (5/7), 6–3, 6–2తో 20వ సీడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. పోరాడి ఓడిన బోపన్న, దివిజ్ జోడీలు: పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పదో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 4–6, 7–6 (7/5), 3–6తో ఏడో సీడ్ మరాచ్ (ఆస్ట్రియా)–పావిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. దివిజ్ శరణ్ (భారత్)–రాజీవ్ రామ్ (అమెరికా) ద్వయం 6–3, 6–7 (4/7), 4–6తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–కుబోట్ (పోలాండ్) జంట చేతిలో పరాజయం పొందింది. -
జొకోవిచ్‌కు షాక్
⇒క్వార్టర్స్‌లోనే ఓడిన డిఫెండింగ్ చాంపియన్ ⇒థీమ్ చేతిలో పరాజయం పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్, నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండోసీడ్ జొకోవిచ్ 6–7, 3–6, 0–6తో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరోసీడ్, డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. రెండుగంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయాడు. తొలిగేమ్‌లో ఇరువురు చెరో రెండుసార్లు సర్వీస్ కోల్పోవడంతో మ్యాచ్ టై బ్రేకర్‌కు దారి తీసింది. ఇందులో కీలకదశలో విజృంభించిన థీమ్.. తొలిసెట్‌ను 74 నిమిషాల్లో కైవసం చేసుకున్నాడు. ఇక రెండోసెట్లో దూకుడు పెంచిన ఆస్ట్రియా ప్లేయర్.. రెండోగేమ్‌లోనే జొకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేసి 2–0తో ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం అదే జోరులో సెట్‌ను తన వశం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడోగేమ్‌లో సెర్బియన్స్టార్ ఆటతీరు పూర్తిగా గాడితప్పింది. వరుసగా మూడు సార్లు తన సర్వీస్ కోల్పోవడంతో కనీసం ఒక్క గేమ్ కూడా నెగ్గకుండా సెట్‌తోపాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఏస్‌లు, 38 విన్నర్లు ఆడిన థీమ్.. తొలి సర్వీస్‌లోనే 74 శాతం పాయింట్లను గెలుపొందడం విశేషం. మరోవైపు మూడు డబుల్ఫాల్టులు, 35 అనవసర తప్పిదాలు చేసిన జొకో.. తనకు లభించిన 6 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో కేవలం రెండింటిని మాత్రమే సద్వినయోగం చేసుకుని భంగపడ్డాడు. సెమీస్‌లో తొమ్మిదిసార్లు చాంపియన్, నాలుగోసీడ్ రఫెల్ నాదల్(స్పెయిన్)తో థీమ్ తలపడనున్నాడు. మరో క్వార్టర్స్ ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాదల్ 6–2, 2–0తో ఆధిక్యంలో ఉండగా.. ప్రత్యర్థి పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్) గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. సెమీస్‌లో ప్లిస్కోవా, హలెప్ మహిళల సింగిల్స్‌లో రెండోసీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్), మూడోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) సెమీస్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, ప్లిస్కోవా 7–6, 6–4తో 28వ సీడ్, స్థానిక ప్లేయర్ కరోలిన్ గార్సియాపై విజయం సాధించింది. మరో క్వార్టర్స్‌లో ప్రపంచ నాలుగోర్యాంకర్, హలెప్ 3–6, 7–6, 6–0తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఐదో సీడ్, ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందింది. రెండుగంటలకుపైగా జరిగిన ఈమ్యాచ్‌లో రెండోసెట్ టైబ్రేకర్‌లో ఓ మ్యాచ్పాయింట్ను కాచుకున్న హలెప్.. తర్వాతి సెట్లో విజృంభించింది. మూడోసెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను వరుసగా మూడుసార్లు బ్రేక్‌చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సెమీస్‌లో ప్లిస్కోవాతో హలెప్ తలపడనుంది. -
చాంపియన్స్ అలవోకగా...
జొకోవిచ్, ముగురుజా శుభారంభం ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ పారిస్: పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో డిఫెండింగ్ చాంపియన్స్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), గార్బిన్ ముగురుజా (స్పెయిన్) అలవోక విజయాలతో ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై... నాలుగో సీడ్ ముగురుజా 6–4, 6–2తో షియవోని (ఇటలీ)పై గెలిచారు. అమెరికా టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీని కోచ్‌గా నియమించుకున్నాక ఆడుతున్న తొలి టోర్నీలో జొకోవిచ్ ఆకట్టుకున్నాడు. 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఐదు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి... తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. 30 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 29 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు రికార్డుస్థాయిలో పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తొలి అడ్డంకిని సాఫీగా అధిగమించాడు. గతంలో తొమ్మిదిసార్లు చాంపియన్‌గా నిలిచిన నాలుగో సీడ్ నాదల్ తొలి రౌండ్లో 6–1, 6–4, 6–1తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)ను ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 6–3, 6–4, 6–2తో డార్సిస్ (బెల్జియం)పై, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 6–3, 6–3తో గుల్బిస్ (లాత్వియా)పై, పదో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–2, 6–2, 6–2తో మథియు (ఫ్రాన్స్)పై గెలిచారు. అయితే 14వ సీడ్ జాక్ సోక్ (అమెరికా) 5–7, 5–7, 3–6తో వెసిలీ (చెక్ రిపబ్లిక్) చేతిలో, 32వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 2–6, 2–6తో నపోలితానో (ఇటలీ) చేతిలో తొలి రౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 7–5, 6–2తో జెంగ్ (చైనా)పై, రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 11వ సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–4, 3–6, 6–2తో ఫోర్లిస్ (ఆస్ట్రేలియా)పై, 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 3–6, 6–3, 9–7తో బ్రాడీ (అమెరికా)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)–ష్వెదోవా (కజకిస్తాన్) జంటకు నాలుగో సీడింగ్ లభించింది. తొలి రౌండ్లో ఈ ఇండో–కజక్ ద్వయం గావ్రిలోవా (ఆస్ట్రేలియా)–పావ్లీచెంకోవా (రష్యా) జోడీతో ఆడుతుంది. -
‘ఫ్రెంచ్’ కిరీటమెవరిదో?
♦ నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ♦ ఫేవరెట్స్‌గా నాదల్, జొకోవిచ్ పారిస్: తనకెంతో కలిసొచ్చిన చోట పదోసారి పాగా వేయాలని రాఫెల్ నాదల్... ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయాలబాట పట్టాలని నొవాక్ జొకోవిచ్... అందరి అంచనాలను తలకిందులు చేసి విజేతగా అవతరించాలని యువ తారలు అలెగ్జాండర్ జ్వెరెవ్, డొమినిక్ థీమ్... క్లే కోర్టులపై కూడా గొప్పగా రాణించే సత్తా ఉందని నిరూపించుకోవాలని బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే... అవకాశం వస్తే రెండోసారి టైటిల్ సొంతం చేసుకోవాలని స్విస్ నంబర్‌వన్ వావ్రింకా... ఇలా ఒకరికంటే ఎక్కువ ఫేవరెట్స్‌తో ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) మొదలయ్యే ఈ టోర్నీ జూన్ 11న జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్‌తో ముగుస్తుంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్కు అద్వితీయమైన రికార్డు ఉంది. ఈ టోర్నీలో 12 సార్లు పాల్గొన్న నాదల్ తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు. 2009లో ప్రిక్వార్టర్ ఫైనల్లో, 2015లో క్వార్టర్ ఫైనల్లో, 2016లో మూడో రౌండ్లో అతను నిష్క్రమించాడు. ఈ ఏడాది క్లే కోర్టు సీజన్లో మూడు టైటిల్స్ సాధించి జోరుమీదున్న నాదల్కు డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు యువ తారలు జ్వెరెవ్ (జర్మనీ), థీమ్ (ఆస్ట్రియా) నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ‘డ్రా’ ప్రకారం నాదల్కు సెమీఫైనల్లో జొకోవిచ్ ఎదురుకావొచ్చు. ఈ సీజన్లో రోమ్ ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఓడించి జ్వెరెవ్ టైటిల్ సాధించగా... ఇదే టోర్నీ క్వార్టర్ ఫైనల్లో నాదల్‌పై థీమ్ సంచలన విజయం సాధించి తమను తక్కువ అంచనా వేయొద్దని సంకేతాలు పంపించారు. శనివారం ముగిసిన జెనీవా ఓపెన్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్) తన టైటిల్‌ను నిలబెట్టుకొని ఫ్రెంచ్ ఓపెన్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే ఫామ్‌లో లేకపోయినా అతడిని తక్కువ అంచనా వేసే ప్రసక్తి లేదు. సెరెనా విలియమ్స్, షరపోవా గైర్హాజరీలో మహిళల సింగిల్స్ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్ కనిపించడంలేదు. నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ), డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)లతోపాటు మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) టైటిల్ రేసులో ఉన్నారు. అభిమన్యుకు వైల్డ్ కార్డు: భారత యువ ఆటగాడు వన్నెంరెడ్డి అభిమన్యు ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలుర సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పాల్గొనేందుకు ‘వైల్డ్ కార్డు’ సంపాదించాడు. శనివారం జరిగిన రాండీవూ ఈవెంట్ ఫైనల్లో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అభిమన్యు 6–1, 4–6, 6–1తో హికారు షిరైషి (జపాన్)పై గెలిచి ఈ ఘనత సాధించాడు. -
ఫెడరర్ తెలివైనవాడు
జొకోవిచ్ పారిస్: స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ తెలివైన ఆటగాడని ప్రపంచ నంబర్–2 ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ చెప్పుకొచ్చాడు. ఫ్రెంచ్ ఓపెన్‌నుంచి మాజీ నంబర్‌వన్ రోజర్ తప్పుకోవడంపై అతను మాట్లాడుతూ ‘తనకు కష్టమైన క్లేకోర్టును కాదని గ్రాస్ కోర్టుల్లో మరిన్ని విజయాలు సాధించేందుకే ఫెడరర్ రోలండ్ గారోస్ నుంచి వైదొలిగాడు’ అని అన్నాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ సహా ఇతర గ్రాస్ కోర్టుల్లో టైటిల్స్ సాధించాలనే లక్ష్యంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని సెర్బియన్ స్టార్ జొకోవిచ్ చెప్పాడు. ‘మైదానంలోనే కాదు తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ రోజర్ దిట్ట. తను ఏంచేస్తున్నాడో అతనికి బాగా తెలుసు. అందుకే తనకు తిరుగులేని గ్రాస్‌కోర్టు ఈవెంట్స్ కోసం క్లేకోర్టును కాదనుకున్నాడు’ అని జొకోవిచ్ పేర్కొన్నాడు. 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్‌ను మాత్రం ఒకే ఒక్కసారి గెలిచాడు. 35 ఏళ్ల ఫెడరర్ ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. జూలై 3 నుంచి జరగనున్న వింబుల్డన్ ఈవెంట్ కోసం ప్రస్తుతం సన్నద్ధమవుతున్నాడు. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అతను ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. -
ఖతర్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్
దోహా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాడు. ఖతర్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ప్రస్తుత నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఫైనల్ పోరులో జొకోవిచ్ 6–3, 5–7, 6–4తో విజయం సాధించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 2,09,665 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 42 లక్షలు) లభించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండో సెట్లో జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలో ఉండి, తన సర్వీస్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను సాధిం చాడు. అయితే ముర్రే పట్టుదలతో పోరాడి మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడంతోపాటు జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ముర్రే తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను 7–5 తో దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్లో ఏడో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
జొకో ఖాతాలో మరో మాస్టర్స్ టైటిల్..
టొరొంటో: ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఖాతాలో మరో మాస్టర్స్ టైటిల్ చేరింది. రోజర్స్ కప్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6-3,7-5 తేడాతో జపాన్ యువతార కీ నిషికోరిపై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. తద్వారా 30వ ఏటీపీ మాస్టర్స్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్న జొకోవిచ్.. తన అత్యధిక మాస్టర్స్ టైటిల్స్ రికార్డును మరోసారి సవరించుకున్నాడు. మరోవైపు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్(28 మాస్టర్స్ టైటిల్స్), స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్(24 మాస్టర్స్ టైటిల్స్)లను మరింత వెనక్కి నెట్టాడు. రోజర్స్ కప్ టైటిల్ పోరులో తొలి సెట్‌ను 32 నిమిషాల్లో అవలీలగా గెలుచుకున్న జొకోవిచ్.. రెండో సెట్లో మాత్రం నిషికోరి నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. రెండో సెట్ టై బ్రేక్‌కు దారి తీసే తరుణంలో రెండు బ్రేక్ పాయింట్లతో ఆ సెట్‌ను కైవసం చేసుకున్న జొకోవిచ్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు జొకోవిచ్ తెలిపాడు. -
జొకోకు షాక్
మూడోరౌండ్లోనే వెనుదిరిగిన నంబర్‌వన్ క్యాలెండర్ స్లామ్ ఆశలు ఆవిరి సామ్ క్వెరీ చేతిలో ఓటమి ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, ముర్రే లండన్: వింబుల్డన్‌లో ఆరో రోజు అతి పెద్ద సంచలనం చోటు చేసుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు అనూహ్యమైన షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగినా... ఓ తక్కువ ర్యాంక్ ఆటగాడి చేతిలో ఊహించని రీతిలో ఓటమిపాలయ్యాడు. శనివారం ముగిసిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా) 7-6 (8/6), 6-1, 3-6, 7-6 (7/5)తో టాప్‌సీడ్ జొకోవిచ్పై సంచనల విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. 2008లో మారన్ చేతిలో రెండో రౌండ్లోనే ఓడిన జొకోవిచ్.. ఆ తర్వాత జరిగిన ప్రతి టోర్నీలో కనీసం క్వార్టర్స్‌కైనా చేరుకున్నాడు. కానీ ఈసారి మూడోరౌండ్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2009 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఇంత తొందరగా జొకోవిచ్ వెనుదిరగడం ఇదే మొదటిసారి. మొత్తానికి 1969 (రాడ్ లేవర్) తర్వాత ‘క్యాలెండర్ స్లామ్’ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాలన్న కల నెరవేరలేదు. అలాగే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 30 వరుస విజయాలకూ బ్రేక్ పడింది. క్వెరీతో రెండు గంటలా 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ కొన్నిసార్లు అనూహ్యంగా వెనుకబడ్డాడు. శుక్రవారం మొదలైన మ్యాచ్ వర్షం కారణంగా శనివారానికి వాయిదా పడింది. అయితే అప్పటికే తొలిరెండు సెట్లు కోల్పోయిన జొకోవిచ్ మూడోసెట్లో మాత్రం బాగా పుంజుకున్నాడు. తన ఫామ్‌ను చూపెడుతూ 5-0 ఆధిక్యంతో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక నాలుగో సెట్లోనూ ఆరంభంలో అద్భుతంగా ఆడిన సెర్బియన్ 5-4 ఆధిక్యంలో నిలిచాడు. కానీ ఈ దశలో సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. దీంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లినా.. చకచకా పాయింట్లతో ముందంజ వేశాడు. కానీ చివర్లో చేసిన ఫోర్‌హ్యాండ్ తప్పిదానికి అతి పెద్ద మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో క్వెరీ 31 ఏస్‌లు, 56 విన్నర్లు సంధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ ముర్రే (బ్రిటన్) 6-3, 7-5, 6-2తో జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా)పై; మూడోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-4, 6-2, 6-2తో ఇవాన్స్ (బ్రిటన్)పై; ఐదోసీడ్ నిషికోరి (జపాన్) 7-5, 6-3, 7-5తో కుజ్నెత్సోవ్ (రష్యా)పై; 9వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-3, 6-4తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై నెగ్గి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో కెర్బర్: మహిళల సింగిల్స్ మూడోరౌండ్లో నాలుగో సీడ్ కెర్బర్ (జర్మనీ) 7-6 (11), 6-1తో విటోఫ్ట్ (జర్మనీ)పై; ఐదోసీడ్ హలెప్ (రొమేనియా) 6-4, 6-3తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై; సఫరోవా (చెక్) 4-6, 6-1, 12-10తో సెపలోవా (స్లొవేకియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. అయితే పదోసీడ్ క్విటోవా (చెక్) మాత్రం రెండోరౌండ్లోనే ఓడింది. -
అతడు... ఆమె... వింబుల్డన్
► మరో టైటిల్‌పై జొకోవిచ్ కన్ను ►రికార్డు విజయం సెరెనా లక్ష్యం ►నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకున్న ఉత్సాహంలో ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత దిశగా అడుగులు వేస్తున్న జొకోవిచ్... కొత్త తరం రాకతో కనుమరుగు కాకముందే రికార్డు టైటిల్ వేటలో సెరెనా... పూర్వ వైభవం కోసం ఫెడరర్, సొంతగడ్డపై మరో విజయం కోసం ఆండీ ముర్రే... సంచలనాలపై ఆశతో జూనియర్లు... అందరికీ పచ్చటి పచ్చిక కోర్టు స్వాగతం పలుకుతోంది. మేజర్ టోర్నీలలో అందరూ మనసు పడే వింబుల్డన్ సమయం వచ్చేసింది. లండన్: ఏడాదిలో మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌కు రంగం సిద్ధమైంది. గ్రాస్‌కోర్టు వేదికగా తమ సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా సై అంటున్నారు. నేడు (సోమవారం) ప్రారంభం కానున్న ఈ చరిత్రాత్మక టోర్నీ జూలై 10 వరకు సాగుతుంది. డిఫెండింగ్ చాంపియన్లు జొకోవిచ్, సెరెనా విలియమ్స్ మరోసారి టాప్ సీడ్లుగా బరిలోకి దిగుతున్నారు. నం. 13 కోసం... వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ మరోసారి టోర్నీలో ఫేవరెట్‌గా నిలిచాడు. 2014, 2015లలో ఇక్కడ టైటిల్ సాధించిన అతను హ్యాట్రిక్‌పై దృష్టి పెట్టాడు. తాజా ఫామ్, గత రెండు గ్రాండ్‌స్లామ్‌లలో అద్భుత విజయాల అనంతరం జొకోవిచ్‌ను అడ్డుకోవడం ఏ ఆటగాడి వల్లా అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే 12 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన సెర్బియా స్టార్ వేగంగా ఆల్‌టైమ్ గ్రేట్ ఫెడరర్ (17) టైటిల్స్‌కు చేరువవుతున్నాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో తొలి మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం 1969లో రాడ్ లేవర్ తర్వాత ఎవరి వల్లా కాలేదు. తన తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్, ప్రపంచ 177వ ర్యాంకర్ జేమ్స్ వార్డ్తో తలపడుతున్నాడు. ఏ మాత్రం ఒత్తిడిలో లేని జొకోవిచ్ ఆదివారం లండన్‌లో పబ్లిక్ ట్రైన్లలో విహరిస్తూ సరదాగా గడపడం విశేషం. ముర్రే ఆశలు... మూడేళ్ల క్రితం వింబుల్డన్ నెగ్గి సొంత అభిమానుల చిరకాల కల నెరవేర్చిన ఆండీ ముర్రే (బ్రిటన్) ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. గత రెండుసార్లు ఇక్కడ అతను క్వార్టర్స్, సెమీస్‌లో నిష్ర్కమించాడు. జొకోవిచ్‌కు పోటీ ఇవ్వగల సత్తా ఉన్నా ఇటీవల అతని చేతిలో వరుసగా ఓడటం ఆత్మవిశ్వాసం దెబ్బ తీసింది. జొకోవిచ్‌తో జరిగిన గత 15 మ్యాచ్‌లలో అతను 13 సార్లు ఓడాడు. అయితే స్వదేశంలో మరో విజయం కోసం అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పాత కోచ్ లెండిల్‌తో మరో సారి ముర్రే జతకట్టాడు. గత వారం సన్నాహక టోర్నీ క్వీన్స్ క్లబ్ గెలవడంతో అతనిలో కాస్త జోష్ పెరిగింది. మొదటి రౌండ్లో బ్రిటన్‌కే చెందిన లియామ్ బ్రాడీ ని అతను ఎదుర్కొంటాడు. మరో స్టార్ ఆటగాడు నాదల్ మణికట్టు గాయంతో టోర్నీ ప్రారంభానికి ముందే తప్పుకోగా... వావ్రింకా, నిషికోరి, గాస్కే, రావ్‌నిచ్ టాప్-10 సీడిం గ్లో ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆటగాళ్లు. సెరెనా సాధించేనా... రొబెర్టా విన్సీ, కెర్బర్, ముగురుజా... గత మూడు గ్రాండ్‌స్లామ్‌లలో సెరెనా విలియమ్స్‌ను చిత్తు చేసిన క్రీడాకారిణులు. సరిగ్గా ఏడాది క్రితం వింబుల్డన్ గెలిచాక సెరెనా విలియన్స్ గ్రాండ్‌స్లామ్ విజయాల సంఖ్య 21కి చేరింది. మరో టైటిల్ గెలిస్తే సెరెనా ఆల్‌టైమ్ రికార్డు స్టెఫీగ్రాఫ్‌ను సమం చేసేది. కానీ అనూహ్యంగా తర్వాతి మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఆమె ఓటమి పాలైంది. ఇప్పుడు 34 ఏళ్ల వయసులో సెరెనా మరోసారి రికార్డు కోసం పోరాడుతోంది. ఫామ్ గొప్పగా లేకపోవడంతో పాటు యువ తరంగాల రాకతో ఆమె వెనుకబడింది. పైగా ఫ్యాషన్ ప్రపంచంలో ఎక్కువగా కనిపించడం, పాప్ ఆల్బంలో భాగం కావడంతో ఆమెకు ఆటపై ఆసక్తి తగ్గిందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పూర్తి స్థాయి సత్తా చాటాల్సి ఉంది. ఈసారి ఓడితే ఇక పవర్ గేమ్‌కు దాదాపు ముగింపు వచ్చినట్లే. సెరెనా విలియ మ్స్‌కు ప్రధానంగా రద్వాన్‌స్కా, ముగురుజా, కెర్బర్, హలెప్, క్విటోవాల నుంచి పోటీ ఎదురవుతోంది. ఫెడరర్ సంగతేంటి... రోజర్ ఫెడరర్ అంటే ఒకప్పుడు వింబుల్డన్‌కు పర్యాయపదం. గ్రాస్‌కోర్టుపై అతని వైట్డ్రస్లాగే ఆట కూడా వెలిగిపోయేది. ఏకంగా ఏడు సార్లు అతను ఇక్కడ విజేతగా నిలిచాడు. అయితే 2012లో ఇక్కడ టైటిల్ నెగ్గిన తర్వాత మూడేళ్లు అతనికి చుక్కెదురైంది. గత రెండు సార్లు అతను ఫైనల్లోనే జొకోవిచ్ చేతిలో ఓడాడు. 34 ఏళ్ల వయసులో ఫెడరర్ మరో టైటిల్ వేటను కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను ఫిట్నెస్ సమస్యలతో కూడా బాధపడుతున్నాడు. ఇదే కారణంగా గత ఫ్రెంచ్ ఓపెన్‌కు కూడా దూరమయ్యాడు. అసలు 2012 వింబుల్డన్ తర్వాత అతను మరో గ్రాండ్‌స్లామ్ గెలవలేకపోయాడు. ఈ టోర్నీకి ముందు అతని సన్నాహాలు కూడా బాగా లేవు. వరుసగా రెండు గ్రాస్‌కోర్టు టోర్నీలు స్టట్గార్ట్, హాలేలలో సెమీఫైనల్స్‌లో ఇద్దరు అనామకుల చేతిలో ఓడాడు. ఈ పరిస్థితుల్లో అతను ఏ మాత్రం పోటీ ఇవ్వగలడనేది చూడాలి. తొలి మ్యాచ్‌లో అతను గైడో పెలా (అర్జెంటీనా)తో తలపడతాడు. -
ఫెడరర్‌కు ప్రతికూలమే!
► సెమీస్‌లోనే ఎదురుపడనున్న జొకోవిచ్ ► వింబుల్డన్ డ్రా విడుదల లండన్: ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్‌పై కన్నేసిన స్విట్జర్లాండ్ మేటి ఆటగాడు రోజర్ ఫెడరర్‌కు ‘డ్రా’ ప్రతికూలంగా మారింది. గత రెండు ఫైనల్స్‌లో తనను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) ఈసారి సెమీస్‌లోనే ఎదురవుతున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న జొకోవిచ్‌ను ఓడించి ఈ స్విస్ స్టార్ టైటిల్ నెగ్గాలంటే అద్భుతం జరగాల్సిందే. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్ డ్రాను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. వైల్డ్‌కార్డ్ జెమీ వార్డీ (బ్రిటన్)తో తొలి మ్యాచ్ ఆడనున్న జొకోవిచ్... క్వార్టర్స్‌లో ‘బిగ్ సర్వింగ్ మ్యాన్’ మిలోస్ రావోనిక్ (కెనడా)తో తలపడే అవకాశాలున్నాయి. ఇక రెండోసీడ్ అండీ ముర్రే (బ్రిటన్)... సెమీస్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్) తో తలపడనున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ సెమీస్‌లో మూడోసీడ్ రద్వాన్‌స్కా (పోలాండ్)తో తలపడే అవకాశాలుండగా; ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ముగురుజా... ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కెర్బర్తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండో పార్శ్వంలోకి వచ్చిన వీనస్ విలియమ్స్‌కు... క్వార్టర్స్‌లో ముగురుజా ఎదురయ్యే అవకాశముండగా, సెరెనాకు రొబెర్టా విన్సీ (ఇటలీ) నుంచి పోటీ తప్పకపోవచ్చు. ఇక రద్వాన్‌స్కా... బెన్సీతో; కెర్బర్... హెలెప్తో తలపడొచ్చు. -
జైకోవిచ్...
► కెరీర్ స్లామ్’ సాధించిన సెర్బియా స్టార్ ► ఈ ఘనత అందుకున్న ఎనిమిదో ప్లేయర్ ► ఎట్టకేలకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ హస్తగతం ► ఫైనల్లో ఆండీ ముర్రేపై విజయం ► వరుసగా 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అరుదైన ఘనత జోకర్ కాదు... ఇప్పుడతను ‘కింగ్’. ఏక కాలంలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను చేత్తోపట్టిన టెన్నిస్ ప్రపంచపు రారాజు. పోయినచోటే వెతుక్కోవాలని అంటారు. నొవాక్ జొకోవిచ్ విషయంలో అదే జరిగింది. గత నాలుగేళ్లలో మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ‘కెరీర్ స్లామ్’ ఘనతను సాధించే అవకాశం దక్కినా ఈ సెర్బియా స్టార్‌కు నిరాశే ఎదురైంది. అయితే నాలుగో ప్రయత్నంలో మాత్రం అనుకున్నది సాధించాడు. గతేడాది తుది సమరంలో వావ్రింకాను తక్కువ అంచనా వేసి బోల్తా పడినా... ఈసారి అలాంటి తప్పిదం చేయలేదు. ఫైనల్ ప్రత్యర్థి ఆండీ ముర్రేపై స్ఫూర్తిదాయక విజయం సాధించి ‘కెరీర్ స్లామ్’ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రీడాకారుడిగా నిలిచాడు. పారిస్: ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న ‘ఫ్రెంచ్ ఓపెన్’ టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 3-6, 6-1, 6-2, 6-4తో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఇదే టోర్నీలో 2012, 2014, 2015లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న జొకోవిచ్... నాలుగో ప్రయత్నంలో విజేతగా అవతరించి తొలిసారి ‘ఫ్రెంచ్’ చాంపియన్‌గా నిలిచాడు. ఈ విజయంతో జొకోవిచ్ కెరీర్ స్లామ్ (టెన్నిస్ సర్క్యూట్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) ఘనతను పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఏకకాలంలో వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నెగ్గిన మూడో క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 18 లక్షలు)... రన్నరప్ ఆండీ ముర్రేకు 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసారి ఫ్రెంచ్ ఫైనల్ ఆడుతున్న ముర్రే తొలి సెట్‌ను నెగ్గడంతో జొకోవిచ్‌కు మరోసారి నిరాశ తప్పదా అనిపించింది. అయితే వెంటనే తేరుకున్న జొకోవిచ్ రెండో సెట్ నుంచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను అదే జోరులో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్లో జొకోవిచ్ జోరు మరింత పెరిగింది. ఈ సెట్లోనూ రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ వెనుదిరిగి చూడలేదు. నాలుగో సెట్లో ముర్రే కాస్త పోటీనిచ్చినా మళ్లీ రెండుసార్లు బ్రిటన్ స్టార్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని జొకోవిచ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ► అత్యధికంగా 12వ ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో ఫెడరర్ 11వ ప్రయత్నంలో ఈ టైటిల్ సాధించాడు. ► జిమ్ కొరియర్ (అమెరికా-1992లో) తర్వాత వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ► మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి నాలుగోసారి ఈ టైటిల్‌ను నెగ్గిన మూడో ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో ఫెడరర్, జెరోస్లావ్ డ్రోబ్నీ మాత్రమే ఇలా చేశారు. ► అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) సరసన జొకోవిచ్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఫెడరర్ (17 టైటిల్స్) తొలి స్థానంలో ఉండగా... పీట్ సంప్రాస్ (14 టైటిల్స్), రాఫెల్ నాదల్ (14 టైటిల్స్) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. మళ్లీ నిరాశే... గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో జొకోవిచ్ చేతిలో ముర్రే ఓడిపోవడం ఇది ఐదోసారి. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగుసార్లు ముర్రే ఓడిపోయాడు. ‘కెరీర్ స్లామ్’ వీరులు... ఫ్రెడ్ పెర్రీ (బ్రిటన్), డాన్ బడ్జ్ (అమెరికా), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా). వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్స్ విజేతలు... డాన్ బడ్జ్ (1938-ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్), రాడ్ లేవర్ (1962, 1969-ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్), జొకోవిచ్ (2015 వింబుల్డన్, యూఎస్ ఓపెన్-2016 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ 1971 తర్వాత ఫ్రాన్స్ జంటకు టైటిల్... మహిళల డబుల్స్ విభాగంలో మ్లాడెనోవిచ్-కరోలినా గార్సియా (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో మ్లాడెనోవిచ్-గార్సియా ద్వయం 6-3, 2-6, 6-4తో మకరోవా-వెస్నినా (రష్యా) జోడీపై గెలిచింది. 1971లో గెయిల్ చాన్ఫ్రెయు-ఫ్రాంకోయిజ్ దుర్ జంట తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన జోడీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం. పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఫెలిసియానో లోపెజ్-మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంట గెల్చుకుంది. ఫైనల్లో ఈ జోడీ 6-4, 6-7 (6/8), 6-3తో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) ద్వయంపై నెగ్గింది. ఫలితంగా 26 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓ స్పెయిన్ జోడీ ఖాతాలో పురుషుల డబుల్స్ టైటిల్ చేరింది. రోలాండ్ గారోస్‌లో తొలిసారి కొత్త అనుభూతికి లోనవుతున్నాను. ఇదో ప్రత్యేక క్షణం. నా కెరీర్లోనే అత్యుత్తమం. మా ఫైనల్ చూసేందుకు ఇంత మంది ప్రేక్షకులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కోర్టు, మీరు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అందుకే ఈ మట్టిపై నా హృదయం పరుస్తున్నాను. ఇలా బొమ్మ గీసి తనను అనుకరించేందుకు అనుమతి ఇచ్చిన మాజీ చాంపియన్ గుస్తావో కుయెర్టన్కు కృతజ్ఞతలు. -జొకోవిచ్ -
ఇద్దరికీ.....ఇంకొక్కటే....
► రికార్డులపై సెరెనా, జొకోవిచ్ గురి ► ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అమెరికా, సెర్బియా స్టార్స్ ► ముగురుజాతో సెరెనా, ముర్రేతో జొకోవిచ్ ‘ఢీ’ సమకాలీన టెన్నిస్‌లో తిరుగులేని స్టార్స్ సెరెనా విలియమ్స్, నొవాక్ జొకోవిచ్ రికార్డు పుటల్లో చేరేందుకు చేరువయ్యారు. ఇంకొక్క విజయం సాధిస్తే ఈ ఇద్దరు టెన్నిస్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. సెరెనా గెలిస్తే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. జొకోవిచ్ విజయం సాధిస్తే... కెరీర్ స్లామ్‌ను పూర్తి చేసుకోవడంతోపాటు వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. పారిస్: ఎంతోమంది యువ తారలు దూసుకొస్తున్నా... తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన కెరీర్లో 27వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా అంతిమ సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సెరెనా 7-6 (9/7), 6-4తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించి నాలుగోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)తో సెరెనా అమీతుమీ తేల్చుకుంటుంది. రెండో సెమీఫైనల్లో ముగురుజా 6-2, 6-4తో 21వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ముగురుజా కెరీర్లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. గతేడాది వింబుల్డన్ టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరిన ముగురుజా... సెరెనా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి సెరెనా టైటిల్ నిలబెట్టుకుంటే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. ఇప్పటివరకు 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెరెనా, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 1937 తర్వాత.... పురుషుల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్ అవతరించనున్నాడు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-2, 6-1, 6-4తో 13వ సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై అలవోకగా నెగ్గగా... రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-4, 6-2, 4-6, 6-2తో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను బోల్తా కొట్టించాడు. తద్వారా 1937లో బన్నీ ఆస్టిన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన బ్రిటన్ ప్లేయర్‌గా ముర్రే గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ముర్రేతో జొకోవిచ్ తలపడతాడు. ముర్రేకిది తొలి ‘ఫ్రెంచ్’ ఫైనల్‌కాగా... జొకోవిచ్‌కు నాలుగోది. గతంలో ఫైనల్‌కు చేరిన మూడుసార్లూ జొకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. ఈసారి జొకోవిచ్ గెలిస్తే కెరీర్ స్లామ్ (అన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) ఘనతను పూర్తి చేసుకున్న ఎనిమిదో క్రీడాకారుడిగా నిలుస్తాడు. అంతేకాకుండా 1969లో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) తర్వాత వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. గతేడాది జొకోవిచ్ వింబుల్డన్, యూఎస్ ఓపెన్... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించాడు. -
సెమీస్‌లో సెరెనా
► క్వార్టర్స్‌లో పుటినెత్సోవాపై గెలుపు ► ముర్రే, జొకోవిచ్, థీమ్ కూడా సెమీస్‌కు ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: తొలిసెట్ చేజారినా... కీలక సమయంలో పుంజుకున్న డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)... ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సెరెనా 5-7, 6-4, 6-1తో ప్రపంచ 60వ ర్యాంకర్ యూలియా పుటినెత్సోవా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. తొలి సెట్లో ఇరువురు సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మూడో గేమ్‌లో ఫోర్‌హ్యాండ్ షాట్లో చేసిన తప్పిదానికి సెరెనా మూల్యం చెల్లించుకోగా... ఆ వెంటనే పుటినెత్సోవా సర్వీస్‌ను నిలబెట్టుకుని 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో పుంజుకున్న అమెరికన్ ఐదో గేమ్‌లో సర్వీస్‌తో పాటు ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-3తో స్కోరును సమం చేసింది. తర్వాత ఇరువురు మరోసారి సర్వీస్ (4-4)ను నిలబెట్టుకున్నారు. తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కాపాడుకున్నా 11వ గేమ్‌లో సర్వీస్ చేజార్చుకుంది. 10, 12 గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకున్న పుటినెత్సోవా సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండు, మూడో సెట్లో తిరుగులేని ఆటతీరుతో చెలరేగిన సెరెనా... పుటినెత్సోవాకు మరో అవకాశం ఇవ్వలేదు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 8వ సీడ్ టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)కి చుక్కెదురైంది. అన్‌సీడెడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) 7-5, 6-2తో బాసిన్స్కీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ ముగురుజా (స్పెయిన్) 7-5, 6-3తో రోజెర్స్ (అమెరికా)పై; 21వ సీడ్ స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-4, 7-6 (8/6)తో పిరంకోవా (బల్గేరియా)పై నెగ్గారు. ముర్రే ముందుకు...: రోలండ్ గారోస్‌లో తొలి టైటిల్ కోసం బరిలోకి దిగిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. పురుషుల క్వార్టర్స్‌లో రెండోసీడ్ ముర్రే 5-7, 7-6 (7/3), 6-0, 6-2తో తొమ్మిదోసీడ్ రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 7-5, 6-3తో ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై; 13వ సీడ్ డోమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 4-6, 7-6 (9/7), 6-4, 6-1తో 12వ సీడ్ డేవిడ్ గోఫిన్ (బెల్జియం)పై నెగ్గారు. -
సంపాదనలో కూడా ఆ ఇద్దరే!
పారిస్: ఆ ఇద్దరూ టెన్నిస్ రారాజులు. ఒకరు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కాగా మరొకరు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్. వీరిలో జొకోవిచ్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతుండగా, ఫెదరర్ మూడో స్థానంలో ఉన్నాడు. టైటిల్స్ విషయంలో కూడా వీరిద్దరూ తమదైన ముద్రను వేశారు. ఫెదరర్ ఖాతాలో 17 గ్రాండ్ స్లామ్స్ ఉండగా.. జొకోవిచ్ ఇప్పటివరకూ 10 గ్రాండ్ స్లామ్స్ ను సాధించాడు. ఇదిలా ఉంచితే .. ఆట ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రం వీరిద్దరూ ఏ క్రీడాకారుడికి అందనంత ఎత్తులో ఉన్నారు. చివరిసారిగా 2012 లో వింబుల్టన్ గ్రాండ్ స్లామ్ ను గెలిచిన ఫెదరర్ ఆదాయంలో మాత్రం దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఫెదరర్ 97 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 641 కోట్లు) ఆదాయంతో ముందు వరుసలో ఉండగా, జొకోవిచ్ 94 మిలియన్ డాలర్లు (సుమారు రూ.621కోట్లు) సంపాదనతో తరువాతి స్థానంలో ఉన్నాడు. దీంతో ఈ దిగ్గజ ఆటగాళ్లు వంద మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరేందుకు అతి కొద్ది దూరంలో నిలిచారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ లో ఫెదరర్ టైటిల్ ను కైవసం చేసుకుంటే మాత్రం 100 మిలియన్ డాలర్ల మార్కును చేరుకునే అవకాశం ఉంది. మరోపక్క అద్భుతమైన ఫామ్ లో ఉన్న జొకోవిచ్ .. ఆస్ట్రేలియా ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది జొకోవిచ్ మూడు గ్రాండ్ స్లామ్స్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా 21.5 మిలియన్ డాలర్లు(సుమారు రూ.133 కోట్లు)ను టెన్నిస్ బ్యాట్ ద్వారా రాబట్టడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఎండోర్స్ మెంట్ ద్వారా అత్యధిక మొత్తాన్ని సంపాదించిన ఐదో ఆటగాడిగా ఫెదరర్ గుర్తింపు సాధించాడు. ఈ ఏడాది ఫెదరర్ కు ఎండోర్స్ మెంట్ ద్వారా 58 మిలియన్ డాలర్లు(సుమారు 383 కోట్లు) ఆదాయం లభించింది. వీరిద్దరూ ఆటలోనే కాదు.. ఆదాయంలో కూడా ఒకరితో ఒకరు పోటీ పడటం నిజంగా ఆసక్తికరమే కదా! -
‘అందరివాడు’ కాకున్నా...
క్రీడావిభాగం: గత దశాబ్దకాలంలో టెన్నిస్ అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరు ఫెడరర్ వీరాభిమానులైతే... రెండో వర్గం నాదల్ కోసం ప్రాణమిచ్చేవాళ్లు. ఈ ఇద్దరి మధ్యలో ఐదేళ్ల కాలంగా అనేక విజయాలు సాధిస్తున్నా జొకోవిచ్ మాత్రం అభిమానులను సంపాదించుకోలేకపోయాడు. దీనికి కారణం లేకపోలేదు. ఫెడరర్, నాదల్ ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఫెడరర్ కోర్టులో ఈ చివరి నుంచి ఆ చివరికి సీతాకోక చిలుకలా వెళతాడు. చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. నాదల్ బేస్‌లైన్ దగ్గర గెరిల్లా తరహాలో దూకుడుగా ఆడతాడు. ఒకరు పచ్చిక కోర్టుల్లో పరుగులు పెట్టించే ఆటగాడైతే... మరొకరు మట్టి కోర్టులో మహరాజు. ఈ ఇద్దరి స్థాయిలో అభిమానులు జొకోవిచ్‌ను ఆదరించలేదు. అయితే ఈ ఫ్యాన్స్ అందరూ అభిమానించే రెండో వ్యక్తి జొకోవిచ్. అటు ఫెడరర్ అభిమానులు, ఇటు నాదల్ అభిమానులు కూడా తమ రెండో ఓటును జొకోవిచ్‌కే వేశారు. నిజానికి ఇది జొకోవిచ్ తప్పుకాదు. అతను గొప్ప హాస్య చతురత ఉన్న వ్యక్తి. కోర్టులో ప్రత్యర్థుల శైలిని అనుకరిస్తూ తాను చేసే విన్యాసాలకు నవ్వుకోని టెన్నిస్ అభిమాని లేడు. అలాగే ప్రత్యర్థిని గౌరవించడంలోనూ అతను ముందుంటాడు. యూఎస్ ఫైనల్ గెలిచాక మాట్లాడుతూ ‘బహుశా టెన్నిస్ చరిత్రలోనే అతి గొప్ప ఆటగాడు ఫెడరర్’ అంటూ కితాబివ్వడం తన స్ఫూర్తికి నిదర్శనం. అయినా మిగిలిన ఇద్దరి స్థాయిలో అభిమానులను సంపాదించుకోలేకపోయాడు. ఇది జొకోవిచ్ కూడా గమనించాడు. ‘ఫెడరర్‌లాంటి గొప్ప ఆటగాడికి ప్రపంచంలో ఎక్కడ ఆడినా మద్దతు లభిస్తుంది. ఏదో ఒక రోజు ఆ స్థాయిలో అభిమానులను సంపాదించుకోవాలనేది నా కోరిక’ అని యూఎస్ టైటిల్ గెలిచాక వ్యాఖ్యానించాడు. ఆట పరంగా జొకోవిచ్ కాస్త ఫెడరర్‌కు దగ్గరగా ఉంటాడు. ఫెడరర్ 7 వింబుల్డన్ టైటిల్స్ సాధిస్తే... నాదల్ 9 ఫ్రెంచ్ టైటిల్స్ కొల్లగొట్టాడు. జొకోవిచ్ సాధించిన 10 గ్రాండ్‌స్లామ్‌లలో 5 ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా వచ్చినవే. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ మీద జొకోవిచ్ ముద్ర లేకపోవడం కాస్త ఆశ్చర్యకరమే. అటు ఫెడరర్, నాదల్ ఇద్దరూ అన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌నూ సాధిస్తే... జొకోవిచ్‌కు మాత్రం ఫ్రెంచ్ ఇంకా అందలేదు. అతని కెరీర్లో ఉన్న లోటు ఇదే. ఆ ఒక్క టైటిల్ కూడా అందితే అతను పరిపూర్ణ ఆటగాడవుతాడు. ఒత్తిడిలోనూ సులభంగా... ఆదివారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్‌కు ఫెడరర్ నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా గట్టిపోటీ ఎదురయింది. ఒక దశలో ఫెడరర్ సాధించిన ప్రతి పాయింట్‌కూ స్టేడియం హోరెత్తింది. మొత్తం న్యూయార్క్ నగరంతో జొకోవిచ్ పోరాడాడా? అనిపించింది. అంత ఒత్తిడిని కూడా అతను జయించాడు. గత మూడేళ్లుగా ఫెడరర్ టైటిల్స్, జోరు తగ్గాయి. కానీ ఈ ఏడాది వింబుల్డన్ నుంచి అతను అద్భుతంగా ఆడుతున్నాడు. తన కెరీర్లో పీక్ దశలో ఆడిన టెన్నిస్‌ను మళ్లీ అభిమానులకు ఫెడరర్ రుచి చూపిస్తున్నాడు. అయితే జొకోవిచ్ దీనికి సన్నద్ధమై వచ్చాడు. ఫెడరర్ తీసుకొచ్చిన కొత్త టెక్నిక్‌ను, వైవిధ్యాన్ని జొకో పసిగట్టి సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈసారి కూడా జొకోవిచ్ గెలుస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉన్నా... టోర్నీలో ఫెడరర్ చూపించిన అసమాన ఆటతీరు పోరులో ఉత్కంఠను పెంచింది. అయినా చివరకు జొకో జోరును ఫెడెక్స్ ఆపలేకపోయాడు. దిగ్గజాల సరసన కెరీర్లో పది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం చాలా గొప్ప ఘనత. అతనికంటే ముందు ఈ మార్కును కేవలం ఏడుగురు మాత్రమే చేరుకున్నారు. జొకోవిచ్ ఇదే జోరును కొనసాగిస్తే ఫెడరర్ (17) టైటిల్స్ రికార్డును చేరడం కూడా కష్టమేమీ కాదు. ఇప్పటికే ‘ఆల్‌టైమ్ గ్రేట్’ జాబితాలో జొకోవిచ్ చేరిపోయాడు. ఫెడరర్, నాదల్ ఒకరకంగా కెరీర్లో పీక్ స్టేజ్‌ను దాటి వచ్చేశారనే అనుకోవాలి. ఇక ముర్రే, వావ్రింకా అడపాదడపా మెరుస్తారే తప్ప జొకో స్థాయి లేదు. ప్రస్తుతం ఉన్న ఫామ్, తన ప్రణాళిక చూస్తే రాబోయే మూడు నాలుగేళ్లు జొకోవిచ్ హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. 2011తో పోలిస్తే ఇప్పుడు జొకోవిచ్‌లో పరిణతి బాగా పెరిగింది. భర్తగా, తండ్రిగా తన బాధ్యత పెరగడం వల్ల టెన్నిస్‌ను చూసే దృక్పథంలోనూ తేడా వచ్చిందని అంటున్నాడు. శారీరకంగా, మానసికంగా కూడా జొకోవిచ్ దృఢంగా తయారయ్యాడు. శరీరం, మనసు రెండింటి మీదా నియంత్రణతో ఉన్న ఆటగాడు కచ్చితంగా ఎప్పుడూ చాంపియన్‌గానే ఉంటాడు. జొకోవిచ్ ఇదే కోవలోకి వస్తాడు. -
మళ్లీ ఆ ఇద్దరే...
♦ ఫైనల్లో జొకోవిచ్‌తో ఫెడరర్ ‘ఢీ’ ♦ సెమీస్‌లో అలవోక విజయాలు ♦ యూఎస్ ఓపెన్ టోర్నీ అంచనాలు నిజమయ్యాయి. ఊహించిన ఆటగాళ్లే అంతిమ సమరానికి అర్హత సాధించారు. ఆద్యంతం అద్వితీయ ఆటతీరును కనబరుస్తూ... యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్, రెండో ర్యాంకర్ రోజర్ ఫెడరర్ అమీతుమీ తేల్చుకోనున్నారు. గత జులైలో వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫెడరర్... ఈ ఏడాది తన ఖాతాలో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేసుకోవాలనే లక్ష్యంతో జొకోవిచ్ ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి గం. 1.30కు పురుషుల సింగిల్స్ ఫైనల్ మొదలవుతుంది. న్యూయార్క్ : ఐదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ టోర్నీలో కొత్త వ్యూహాలతో అందర్నీ హడలెత్తిస్తున్న ఫెడరర్ సెమీఫైనల్లోనూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వరుస సెట్లలో తన మిత్రుడు, స్విట్జర్లాండ్‌కే చెందిన స్టానిస్లాస్ వావ్రింకా ఆట కట్టించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ కేవలం 92 నిమిషాల్లో 6-4, 6-3, 6-1తో ఐదో సీడ్ వావ్రింకాను ఓడించాడు. ఈ గెలుపుతో ఫెడరర్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో వావ్రింకా చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. అంతేకాకుండా తన కెరీర్లో ఏడోసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. వరుసగా ఐదుసార్లు (2004 నుంచి 2008 వరకు) యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఫెడరర్, 2009లో మాత్రం రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 21-20తో జొకోవిచ్పై ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల విషయానికొస్తే మాత్రం జొకోవిచ్ 7-6తో ఫెడరర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. ఒక్క సెట్ కోల్పోకుండా... సెమీఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని ఫెడరర్ ఈ మ్యాచ్‌లోనూ దానిని కొనసాగించాడు. తన సహచరుడు వావ్రింకా ఆటతీరుపై పూర్తి అవగాహన ఉండటంతో పక్కా ప్రణాళికతో ఆడిన ఫెడరర్ తొలి సెట్ ఆరంభంలోనే వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-1తో ముందంజ వేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని 36 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్లోనూ ఫెడరర్ జోరు కొనసాగించాడు. రెండుసార్లు వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ స్విస్ దిగ్గజం 31 నిమిషాల్లో రెండో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మూడో సెట్లోనూ ఫెడరర్ దూకుడుకు వావ్రింకా సమాధానం ఇవ్వలేకపోయాడు. ఈ సెట్లోనూ రెండుసార్లు వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ 25 నిమిషాల్లోనే మూడో సెట్‌ను నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో 10 ఏస్‌లు సంధించిన ఫెడరర్ కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. వావ్రింకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన అతను 28 సార్లు నెట్ వద్దకు వచ్చి 22 సార్లు పాయింట్లు సంపాదించాడు. 29 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ 17 అనవసర తప్పిదాలు చేశాడు. జబర్దస్త్... జొకోవిచ్ మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తన విశ్వరూపాన్ని చూపించాడు. డిఫెండిగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో జరిగిన సెమీఫైనల్లో జొకోవిచ్ కేవలం 85 నిమిషాల్లో 6-0, 6-1, 6-2తో గెలుపొందాడు. సిలిచ్‌పై విజయంతో ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్‌కు చేరుకున్న ఘనత ను జొకోవిచ్ సాధించాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన మూడో క్రీడాకారుడిగా ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందాడు. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా-1969లో) ఒకసారి... రోజర్ ఫెడరర్ (2006, 2007, 2009) మూడుసార్లు ఈ ఘనత సాధించారు. 2001 తర్వాత యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ఒక ఆటగాడు కేవలం మూడు గేమ్‌లు కోల్పోయి, ఇంత ఏకపక్షంగా నెగ్గడం ఇదే ప్రథమం. చీలమండ గాయంతో బాధపడుతున్న సిలిచ్ సెమీఫైనల్‌ను తొందరగా ముగించాలనే ఉద్దేశంతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే సిలిచ్ గాయంపై అవగాహన ఉన్న జొకోవిచ్ వ్యూహం ప్రకారం ఆడాడు. సిలిచ్‌ను సాధ్యమైనంత శ్రమించేలా చేసిన జొకోవిచ్ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. కెరీర్లో ఆరోసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న జొకోవిచ్ నాలుగుసార్లు (2007, 2010, 2012, 2013) రన్నరప్‌గా నిలిచి, మరోసారి విజేతగా (2011లో) నిలిచాడు. . -
చెమటోడ్చిన సెరెనా
♦ యూఎస్ ఓపెన్ మూడోరౌండ్లోకి ప్రవేశం ♦ నాదల్, జొకోవిచ్ కూడా... న్యూయార్క్ : ‘క్యాలెండర్ స్లామ్’ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్, అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. యూఎస్ ఓపెన్‌లో చెమటోడ్చి నెగ్గింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ సెరెనా 7-6 (7/5), 6-3తో ప్రపంచ 110వ ర్యాంకర్ క్వాలిఫయర్ కికి బెర్టెన్స్ (డచ్)పై గెలిచి మూడోరౌండ్లోకి అడుగుపెట్టింది. గంటా 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 34 అనవసర తప్పిదాలు, 10సార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. బెర్టెన్స్ ధాటికి అమెరికా ప్లేయర్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించింది. తొలిసెట్లో 5-5తో స్కోరును సమం చేసిన సెరెనా 11వ గేమ్‌లో నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసినా సర్వీస్ నిలబెట్టుకుంది. బెర్టెన్స్ కూడా గట్టిపోటీ ఇవ్వడంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేక్‌లోనూ బెర్టెన్స్ దూకుడుకు సెరెనా 0-4తో వెనుకబడింది. అయితే తన అనుభవంతో... డచ్ ప్లేయర్ చేసిన అనవసర తప్పిదాలను తనకు అనుకూలంగా మల్చుకుని సెట్‌ను దక్కించుకుంది. రెండోసెట్లో కాస్త ఇబ్బందిపడినా.. కీలక సమయంలో అద్భుతమైన షాట్లతో చెలరేగింది. రెండు, ఆరు, తొమ్మిదో గేమ్‌ల్లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన టాప్‌సీడ్... మూడు, ఐదు, ఎనిమిదో గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.ఇతర మ్యాచ్‌ల్లో వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-3, 6-7 (2), 6-2తో ఇన్నా ఫాల్కోని (అమెరికా)పై; రద్వాన్‌స్కా (పోలెండ్) 6-3, 6-2తో లిన్నెటి (పోలెండ్)పై; మకరోవా (రష్యా) 6-1, 6-2తో లౌరెన్ డేవిస్ (అమెరికా)పై నెగ్గి మూడోరౌండ్లోకి దూసుకెళ్లారు. నాదల్ అలవోకగా... పురుషుల రెండోరౌండ్లో 8వ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 7-6 (7/5), 6-3, 7-5తో డిగో స్వార్జ్మెన్ (అర్జెంటీనా)పై నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. తొలిసెట్ టైబ్రేక్‌లో 4-5తో వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకుని మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 6-1, 6-2తో ఆండ్రియా హైదర్ మౌరెర్ (ఆస్ట్రియా)పై; సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-3, 7-5తో డాన్స్కో (రొమేనియా)పై; రావోనిక్ (కెనడా) 6-2, 6-4, 6-7 (7/5), 7-6 (1)తో వెర్డాస్కో (స్పెయిన్)పై; 19వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-3తో గ్రానోలర్స్ (స్పెయిన్)పై; గోఫిన్ (బెల్జియం) 5-7, 6-4, 3-6, 6-2, 6-1తో బెర్నాకిస్ (లిథువేనియా)పై; లోపెజ్ (స్పెయిన్) 2-6, 6-3, 1-6, 7-5, 6-3తో మార్డి ఫిష్ (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండోరౌండ్లో పేస్, బోపన్న వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి మిక్స్డ్ డబుల్స్‌లో రెండోరౌండ్లోకి ప్రవేశించింది. తొలిరౌండ్లో నాలుగోసీడ్ పేస్-హింగిస్ 6-2, 6-2తో టేలర్ హారీ ఫ్రిట్జ్-సీ లూయి (అమెరికా)లపై నెగ్గారు. భారత్-స్విస్ ద్వయం 46 నిమిషాల్లో ప్రత్యర్థుల ఆట కట్టించింది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో ఆరోసీడ్ రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జీ (రొమేనియా) 6-3, 6-4తో ఆస్టిన్ క్రాజిసెక్-నికోలస్ మున్రో (అమెరికా)పై గెలిచి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట సత్తా మేరకు రాణించింది. -
మీరు చూస్తోంది...updated version
♦ తన కెరీర్‌పై సైనా వ్యాఖ్య ♦ ‘ప్రపంచ’ రజతంతో ఆనందం ♦ నాపై ఒత్తిడి తొలగిపోయింది ఎంత గొప్ప సాఫ్ట్వేర్ వచ్చినా... నిరంతరం దానిని అప్డేట్ చేస్తుండాలి... లేదంటే రేసులో వెనకబడిపోతారు. క్రీడల్లోనూ అంతే... ఎన్ని విజయాలు వచ్చినా... నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి.. లేదంటే ఓడిపోతారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నె హ్వాల్ కూడా ఇదే సూత్రాన్ని అనుసరించింది. ఏడాది క్రితం తాను మరింత అప్డేట్ అవ్వాలన్న విషయాన్ని గుర్తించింది. కష్టమో... నిష్టూరమో... బెంగళూరుకు వెళ్లి కొత్త కోచ్ దగ్గర శిక్షణ మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో అనేక విజయాలు... అందుకే ఇప్పుడు తనని తాను ‘అప్డేటెడ్ వెర్షన్’ అని సైనా స్వయంగా చెబుతోంది. సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ చాంపియన్‌షిప్ పతకంతో తనపై ఉన్న ఒత్తిడి తొలగిపోయిందని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చెప్పింది. ఇకపై ఎలాంటి టోర్నీలో అయినా స్వేచ్ఛగా ఆడగలనని తెలిపింది. ప్రపంచ వేదికపై రజతం సాధించిన అనంతరం సైనా సోమవారం రాత్రి స్వస్థలం చేరుకుంది. ఇటీవలి తన ప్రదర్శనపై ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. విశేషాలు సైనా మాటల్లోనే... గెలిచి వచ్చాక సొంతగడ్డపై స్వాగతం: గొప్పగా ఏమీ లేదు! అయితే నేను అతిగా ఆశించడం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఇకపై ఇలాంటివాటిని పట్టించుకోవడం అనవసరం. నేను విజయాలు సాధిస్తున్నంత వరకు ఇలాంటివి చిన్న విషయాలే. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాను. ఆ సంతోషం చాలు. ఫైనల్లో ఆటతీరు: సహజంగానే నిరాశ పడ్డాను. నేను రెండో గేమ్ గెలిస్తే పరిస్థితి భిన్నంగా ఉండేది. కోచ్ విమల్ కూడా మ్యాచ్ తర్వాత నాపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎలా ఆడావంటూ కోపగించారు. నేను నా 100 శాతం ఆటతీరు కనబర్చలేదనేది నిజం. రెండో గేమ్‌లో 18-18తో సమంగా ఉన్నప్పుడు లైన్ కాల్ ప్రత్యర్థికి అనుకూలంగా వెళ్లింది. అది కూడా ఫలితంపై ప్రభావం చూపించింది. అయితే మెడల్ గెలవడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. విజయానంతరం నా కోచ్‌లతో పాటు గోపీచంద్ కూడా వచ్చి అభినందించారు. కొత్త ప్రత్యర్థి మారిన్: గత రెండేళ్లలో కరోలినా ఎదుగుదల అనూహ్యం. నాతో పాటు అగ్రశ్రేణి ప్లేయర్లు అందరినీ ఆమె ఓడిస్తూ వస్తోంది. సయ్యద్ మోడి ఫైనల్లో నేను నెగ్గినా, ఆమె ఆట నన్ను కాస్త ఆందోళనపరచింది. ఆల్ ఇంగ్లండ్‌లో మారిన్ నన్ను చిత్తు చేసింది. అయితే ఆల్ ఇంగ్లండ్ ఫైనల్‌తో పోలిస్తే నా ఆట చాలా బాగుంది. ఈసారి ఫైనల్లో ఆమె గొప్పతనంకంటే నా ఓటమికి నేనే కారణమని నమ్ముతా. నాకు ప్రమాదకర ప్రత్యర్థిగా మారుతున్న మారిన్ కోసం కూడా ఇకపై ప్రత్యేకంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. క్వార్టర్స్ అనంతరం ఉద్వేగానికి లోను కావడం: ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక సారి, రెండు సార్లు కాదు... ఐదు సార్లు ఆ దశలోనే ఆగిపోయాను. ఇక పతకం అయితే వచ్చేసిందనే ఆనందంతో గెంతులేశాను. రాకెట్‌ను విసిరేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా సంబరం చేసుకోవడంతో అంపైర్ కూడా హెచ్చరించారు! ఏడాది కాలంలో వచ్చిన మార్పు: ఆటలో నా వేగం పెరిగింది. స్ట్రోక్స్ చాలా మెరుగయ్యాయి. ర్యాలీలు కూడా చాలా వేగంగా ఆడుతున్నాను. మానసికంగా కూడా దృఢంగా తయారయ్యాను. ఇదంతా గత ఏడాది కాలంలో విమల్ కుమార్ దగ్గర శిక్షణ అనంతరం వచ్చిన మార్పు. ఆస్ట్రేలియన్, చైనా ఓపెన్ గెలిచాను, ఆల్ ఇంగ్లండ్‌లో పతకం దక్కింది, నంబర్‌వన్ కూడా కాగలిగాను. సరిగ్గా చెప్పాలంటే ‘మీరు ఇప్పుడు చూస్తోంది సైనా అప్డేటెడ్ వెర్షన్’. కానీ దీని కోసం ఎంతో కష్ట పడ్డాను. తల్లిదండ్రులను వదిలి ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆట తప్ప మరో దానిని పట్టించుకోలేదు. మరో ఒలింపిక్ మెడల్: రెండు సార్లు ఒలింపిక్ పతకం గెలిచిన సుశీల్‌తో సమం కావాలని నేనూ ఆశిస్తున్నా. అయితే దానికి ఇంకా సంవత్సరముంది. ఆలోగా సాధ్యమైనన్ని ఎక్కువ టోర్నీలు గెలవాలి. ఇంత బిజీ షెడ్యూల్లో రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. కెరీర్లో అన్నీ గెలిచేసిన సంతృప్తి ఉంది. కాబట్టి ఇకపై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు మాత్రం అవకాశం ఉంటుంది. బాహుబలి బాగా నచ్చింది ప్రపంచ చాంపియన్‌షిప్ సన్నాహకాల్లో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు కాస్త వినోదం కావాల్సిందే కదా. ఇటీవలే బాహుబలి, భజరంగి భాయిజాన్ సినిమాలు చూశాను. బాగా నచ్చాయి. నేను బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌కు పెద్ద ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలుసు. అయితే అతని సినిమాలేవీ ప్రస్తుతం లేవు. అతని తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇంట్లో నా కుక్క పిల్ల ‘చాప్సీ’తో కూడా సరదాగా గడుపుతా. ఒకటి, రెండు రోజుల్లోనే మళ్లీ ట్రైనింగ్‌కు వెళ్లిపోవాల్సి ఉంది. జొకోవిచ్‌ను పదిమందితో కలిపితే ఎలా? నేను వరల్డ్ బ్యాడ్మింటన్‌లో టాప్ షట్లర్లలో ఒకదానిని. వరల్డ్ నంబర్‌వన్, టూ అయ్యాను. అలాంటి ప్లేయర్‌పై శిక్షణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ చాంపియన్ ప్లేయర్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. జొకోవిచ్‌లాంటి ఆటగాడికి పది మంది బృందంలో కోచింగ్ ఇస్తే ఎలా ఉంటుంది! ఏడాది క్రితం సరిగ్గా నేనూ ఆ స్థితిలోనే ఉన్నాను. ర్యాంక్ తొమ్మిదికి పడిపోయింది. చిన్న చిన్న ప్లేయర్ల చేతిలో ఓడుతూ వచ్చాను. సింగపూర్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగాను. ఆ సమయంలో నా ఆటను ఎలా మార్చుకోవాలో అర్థం కాక సతమతమయ్యాను. సరిగ్గా ఆ సమయంలోనే నాకు కావాల్సిన మద్దతు దొరకలేదు. అందుకే బెంగళూరుకు మారాను. ఒకవేళ ఇక్కడి అకాడమీలోనే ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో! -
‘జోకర్’ తీన్మార్
-
ఎర్రకోటలో కొత్త రాజు
♦ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ వావ్రింకా ♦ ఫైనల్లో జొకోవిచ్పై అద్భుత విజయం ♦ రూ. 12 కోట్ల 82 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ♦ సెర్బియా స్టార్‌కు మళ్లీ నిరాశ సౌండ్ చేయకుండా ‘సెలైంట్ కిల్లర్’లా ఫ్రెంచ్ ఓపెన్‌లో స్టానిస్లాస్ వావ్రింకా పెను సంచలనమే సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌ను చిత్తు చేసి... సెమీఫైనల్లో ఆండీ ముర్రే అడ్డంకిని తొలగించుకొని... ఇక ‘ఫ్రెంచ్ కిరీటం’ తనదే అనుకున్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆశలను ఆవిరి చేసి వావ్రింకా ఎర్రకోటలో కొత్త రాజుగా అవతరించాడు. ఇన్నాళ్లూ స్విట్జర్లాండ్ టెన్నిస్ అంటే రోజర్ ఫెడరర్ గుర్తుకొచ్చేవాడు. ఇక నుంచి ఆ స్థానంలో వావ్రింకా పేరు కూడా మదిలో మెదులుతుంది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తాను విజేతగా నిలువడం గాలివాటమేమీ కాదని ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో వావ్రింకా నిరూపించాడు. పారిస్ : అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌ను మట్టికరిపించిన నొవాక్ జొకోవిచ్‌కు ఫైనల్లో మాత్రం చుక్కెదురైంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఎనిమిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వావ్రింకా 4-6, 6-4, 6-3, 6-4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. 3 గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో తొలి సెట్‌ను కోల్పోయిన వావ్రింకా ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను నెగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. విజేతగా నిలిచిన వావ్రింకాకు 18 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 82 లక్షలు), రన్నరప్ జొకోవిచ్‌కు 9 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 41 లక్షలు) లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో కేవలం రెండు సెట్లు కోల్పోయిన జొకోవిచ్ అంతిమ సమరంలో తొలి సెట్‌ను నెగ్గి శుభారంభం చేశాడు. ఏడో గేమ్‌లో వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని జొకోవిచ్ తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి వావ్రింకా పుంజుకున్నాడు. చూడచక్కనైన బ్యాక్‌హ్యాండ్ షాట్లు, పదునైన ఏస్‌లతో చెలరేగిన అతను పదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను గెల్చుకున్నాడు. ఆ తర్వాత మూడో సెట్, నాలుగో సెట్లోనూ వావ్రింకా కీలకదశల్లో పైచేయి సాధించి జొకోవిచ్ ఓటమిని ఖాయం చేశాడు. విశేషాలు ►1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలు ర సింగిల్స్ టైటిల్‌తోపాటు పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన రెండో ప్లేయర్‌గా వావ్రింకా గుర్తింపు పొందాడు. 2003లో వావ్రింకా ఇదే టోర్నీలో జూనియర్ చాంపియన్‌గా నిలిచాడు. ►1990లో ఆండ్రీ గోమెజ్ (ఈక్వెడార్) తర్వాత పెద్ద వయస్సులో (30 ఏళ్లు) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా వావ్రింకా నిలిచాడు. ► 2005లో రాఫెల్ నాదల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే టైటిల్ నెగ్గిన క్రీడాకారుడు వావ్రింకా. ► ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి ‘కెరీర్‌స్లామ్’ సాధించాలని ఆశించిన జొకోవిచ్‌కు మూడోసారీ నిరాశే ఎదురైంది. 2012, 2014లలో నాదల్ చేతిలో ఫైనల్లో ఓడిన జొకోవిచ్‌కు ఈసారి వావ్రింకా షాక్ ఇచ్చాడు. ‘ఇదో గొప్ప అనుభూతి. గతంలో నేను ఎన్నడూ ఇంత ఉద్వేగానికి గురి కాలేదు. ఇంతకుముందు ఈ మైదానంలో ఫైనల్ ఆడినా విజేత కాలేని నా కోచ్ మాగ్నస్ నార్మన్కు ఈ టైటిల్‌ను అంకితం ఇస్తున్నాను’ -వావ్రింకా ‘ఈ సమయంలో మాట్లాడటం నాకు చాలా కష్టంగా ఉంది. ఇదో అద్భుతమైన టోర్నీ. ఈ ట్రోఫీ కోసం వచ్చే ఏడాది కూడా నా పోరాటం కొనసాగిస్తా. చాంపియన్‌లా ఆడిన వావ్రింకాకు నా అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా నాకు మద్దతుగా నిలిచినవారికి కృతజ్ఞతలు’ -జొకోవిచ్ -
ఫ్రెంచ్ ఓపెన్ విజేత వావ్రింకా
-
బౌచర్డ్ బోల్తా
మ్లాడెనోవిచ్ సంచలనం రెండో రౌండ్లో నాదల్, జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: ఇటీవల జరిగిన సర్వేలో మార్కెట్‌ను అత్యంత ప్రభావితం చేయగల అథ్లెట్స్‌లో అగ్రస్థానం పొందిన కెనడా మహిళా టెన్నిస్ స్టార్ యూజిన్ బౌచర్డ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం తేలిపోయింది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయి తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన బౌచర్డ్ 4-6, 4-6తో మ్లాడెనోవిచ్ చేతిలో ఓటమి పాలై తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లో నిష్ర్కమించింది. గతేడాది ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన ఈ కెనడా బ్యూటీ ఈసారి మాత్రం ఊహించని పరాజయం ఎదుర్కొంది. ఆరు అడుగుల ఎత్తున్న మ్లాడెనోవిచ్ అద్భుత ఆటతీరును కనబరిచి బౌచర్డ్ను బోల్తా కొట్టించింది. మూడు ఏస్‌లు సంధించిన ఈ ఫ్రాన్స్ అమ్మాయి బౌచర్డ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ప్రపంచ మాజీ నంబర్‌వన్, 25వ సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) 2005 తర్వాత ఈ టోర్నీలో మరోసారి తొలి రౌండ్లో ఓడిపోయింది. సెసిల్ కరాతంత్చెవా (బల్గేరియా) 6-3, 6-4తో జంకోవిచ్‌ను ఓడించింది. మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), నాలుగో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఐదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), పదో సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ), 18వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో సెరెనా 6-2, 6-3తో హలవకోవా (చెక్ రిపబ్లిక్)పై, క్విటోవా 6-4, 3-6, 6-4తో ఎరాకోవిచ్ (న్యూజిలాండ్)పై, వొజ్నియాకి 6-3, 6-0తో కరీన్ నాప్ (ఇటలీ)పై, పెట్కోవిచ్ 6-2, 6-1తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై, కుజ్నెత్సోవా 6-1, 4-6, 6-2తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. దిమిత్రోవ్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి సంచలనం నమోదైంది. షరపోవా ప్రియుడు, పదో సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) వరుసగా రెండో ఏడాది తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. జాక్ సాక్ (అమెరికా) 7-6 (9/7), 6-2, 6-3తో దిమిత్రోవ్‌ను కంగుతినిపించాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) అలవోక విజయాలతో శుభారంభం చేశారు. తొలి రౌండ్లో ఆరో సీడ్ నాదల్ 6-3, 6-3, 6-4తో క్వెంటిన్ హలిస్ (ఫ్రాన్స్)పై, జొకోవిచ్ 6-2, 7-5, 6-2తో నిమినెన్ (ఫిన్లాండ్)పై నెగ్గారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-1, 6-3, 6-1తో లాకో (స్లొవేకియా)పై, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-4, 6-2తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)పై, 16వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) 7-5, 6-2, 6-3తో సెప్పి (ఇటలీ)పై, 20వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-0తో గిగోనౌన్ (బెల్జియం)పై విజయం సాధించారు. భూపతి జంట ఓటమి పురుషుల డబుల్స్ విభాగంలో మహేశ్ భూపతి (భారత్)-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంటకు తొలి రౌండ్లోనే పరాజయం ఎదురైంది. కొకినాకిస్ (ఆస్ట్రేలియా)-పౌలీ (ఫ్రాన్స్) జోడీ 6-3, 6-1తో భూపతి-కిరియోస్ ద్వయంపై గెలిచింది. -
ముర్రే మురిపించేనా
నేడు జొకోవిచ్‌తో అమీతుమీ గతంలో మూడుసార్లు ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌తో ఆదివారం జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ముర్రే సత్తాకు పరీక్షగా నిలువనుంది. 2013 వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌ను ఓడించాక అతనితో తలపడిన నాలుగు సందర్భాల్లో ముర్రేకు ఓటమి ఎదురైంది. ఓవరాల్ ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 15-8తో ముందంజలో ఉన్నాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్:ఫైనల్ కు చేరిన జోకోవిచ్
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ లో నువాక్ జోకోవిచ్ ఫైనల్ కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జోకోవిచ్ 7-6(7-1),3-6, 6-4, 4-6, 6-0 తేడాతో వావ్రింకాను ఓడించాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ రెండో సెమీ ఫైనల్లో జోకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. టై బ్రేక్ దారి తీసిన తొలి సెట్ లో జోకోవిచ్ సునాయాసంగా విజయంగా సాధించాడు. అయితే ఆ ఆశలకు సెకెండ్ సెట్ లో గండికొట్టాడు వావ్రింకా. రెండో సెట్ ను వావ్రింకా గెలుచుకుని జోకోవిచ్ కు సవాల్ విసిరాడు. అనంతరం మూడు సెట్ జోకోవిచ్ కైవశం చేసుకున్నా.. నాల్గో సెట్ ను మాత్రం కోల్పోయాడు. దీంతో నాలుగు సెట్ లు పూర్తయ్యే సరికి ఇద్దరు సమ ఉజ్జీలుగా నిలవడంతో ఐదో సెట్ కీలకంగా మారింది. ఈ సెట్ లో ఏమాత్రం పొరపాట్లను దరిచేరనీయని జోకోవిచ్ సునాయాసంగా గెలుచుకుని తుది పోరుకు సిద్దమయ్యాడు.జోకోవిచ్-ఆండీ ముర్రేల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. -
నాల్గో రౌండ్ లోకి నల్ల కలువ
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ లో సెరెనా 4-6, 6-2, 6-0 తేడాతో ఎలీనా వితోలినాపై విజయం సాధించింది. తొలి రౌండ్ ను నెమ్మదిగా ఆరంభించిన సెరెనా అనూహ్యంగా మొదటి సెట్ ను కోల్పోయింది. అయితే తరువాత దూకుడు పెంచిన ఈ నల్ల కలువ వరుస రెండు సెట్ లను కైవశం చేసుకుని మూడో రౌండ్ అడ్డంకిని అధిగమించింది. ఓ దశలో సెరెనా విలియమ్స్ సంధించిన ఏస్ లకు ఎలీనా దగ్గర సమాధానం లేకుండా పోయింది. సెరెనా విలియమ్స్ తన తదుపరి రౌండ్ లో ఇరవై నాల్గో సీడ్ గార్బైన్ ముగురుజ్జా తో తలపడనుంది. అంతకుముందు జరిగిన మూడో రౌండ్ లో సెరెనా 7-5, 6-0తో రష్యా వెటరన్ ప్లేయర్ వెరా జ్వొనరేవాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సెరెనా అలవోకగా...
మూడో రౌండ్లోకి ప్రవేశం జొకోవిచ్, వావ్రింకా కూడా... ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: ఎండ వేడిమికి కాస్త ఇబ్బంది పడ్డా.. కీలక సమయంలో అనుభవాన్ని రంగరించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడోరౌండ్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ సెరెనా 7-5, 6-0తో రష్యా వెటరన్ ప్లేయర్ వెరా జ్వొనరేవాపై విజయం సాధించింది. గంటా 25 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్లో రెండు సెట్ పాయింట్లను కాపాడుకోగా... రెండో సెట్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ మొత్తంలో సెరెనా ఐదు, జ్వొనరేవా రెండు ఏస్‌లు సంధించారు. 12 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకున్న ఈ అమెరికా ప్లేయర్ 32 విన్నర్లతో చెలరేగిపోయింది. 24 సార్లు అనవసర తప్పిదాలు చేసినా... బేస్‌లైన్ ఆటతీరుకు తగ్గట్టుగా బలమైన సర్వీస్‌లతో జ్వొనరేవాను కట్టిపడేసింది. మరోవైపు ఐదింటిలో కేవలం రెండు బ్రేక్ పాయింట్లను మాత్రమే ఉపయోగించుకున్న రష్యా క్రీడాకారిణి సర్వీస్ నిలుపుకోవడంలో విఫలమైంది. ఇతర మ్యాచ్‌ల్లో 4వ సీడ్ క్విటోవా (చెక్) 6-2, 6-4తో మోనా బర్తెల్ (జర్మనీ)పై; 6వ సీడ్ రద్వాన్‌స్కా (పొలెండ్) 6-0, 6-1తో జాన్ లార్సన్ (స్విట్జర్లాండ్)పై; అజరెంకా (బెలారస్) 6-4, 6-2తో 8వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) పై నెగ్గి మూడోరౌండ్లోకి అడుగుపెట్టారు. జొకోవిచ్ జోరు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. రెండోరౌండ్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-0, 6-1, 6-4తో ఆండ్రీ కుజెనెత్సోవ్ (రష్యా)పై గెలిచి మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. గంటా 24 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెర్బియన్ బలమైన సర్వీస్‌లతో పాటు అద్భుతమైన గ్రౌండ్ స్ట్రోక్ షాట్లతో విరుచుకుపడ్డాడు. 8 ఏస్‌లు కొట్టిన జొకోవిచ్ ఏడు బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో 4వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/4), 7-6 (7/4), 6-3తో కోపిల్ (రొమేనియా) పై; 5వ సీడ్ నిషికోరి (జపాన్) 4-6, 7-5, 6-2, 7-6 (7/0)తో డుడిగ్ (క్రొయేషియా)పై; 8వ సీడ్ రావోనిక్ (కెనడా) 6-4, 7-6 (7/3), 6-3తో యంగ్ (అమెరికా)పై; 9వ సీడ్ ఫెరర్ (స్పెయిన్) 5-7, 6-3, 6-4, 6-2తో స్టకోవిస్కీ (ఉక్రెయిన్)పై; 12వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 4-6, 4-6, 7-6 (7/3), 4-0తో మన్నారినో (రిటైర్డ్) (ఫ్రాన్స్) పై; ముల్లర్ (లక్సెంబర్గ్) 7-6 (7/5), 1-6, 7-5, 6-1తో 13వ సీడ్ అగుట్ (స్పెయిన్)పై; జానోవిజ్ (పొలెండ్) 6-4, 1-6, 6-7 (3/7), 6-3, 6-3తో 17వ సీడ్ మోన్ఫీల్స్ (ఫ్రాన్స్)పై; 18వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 7-6 (7/5), 6-2, 6-4తో గ్రానోలర్పై గెలిచి మూడోరౌండ్కి చేరారు. రెండో రౌండ్లో బోపన్న జోడి పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ రోహన్ బోపన్న-డానియెల్ నెస్టర్ (కెనడా) 7-6 (7/2), 7-5తో బగ్దాటిస్ (సైప్రస్) -మతోసెవిచ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. గంటా 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం గట్టిపోటీ ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో రెండు జంటలు చెరో 10 ఏస్‌లు సంధించగా, చెరో ఐదుసార్లు అనవసర తప్పిదాలు చేశాయి. అయితే బోపన్న-నెస్టర్ 87 పాయింట్లు గెలిస్తే, ప్రత్యర్థులు 5 పాయింట్ల తేడాతో వెనుకబడ్డారు. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి-జెర్జెన్ మెల్జర్ (ఆస్ట్రియా) 4-6, 3-6తో స్కెచ్వర్త్మెన్ (అర్జెంటీనా) -జీబాలోస్ (అర్జెంటీనా) చేతిలో ఓడారు. -
జొకోవిచ్, నాదల్ శుభారంభం
తొమ్మిదో సీడ్ నిషికోరికి షాక్ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ సాధించాలనే లక్ష్యంతో ఉన్న నొవాక్ జొకోవిచ్... తొమ్మిదోసారి టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను అలవోకగా ఓడించారు. రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2, 6-4తో సౌసా (పోర్చుగల్)పై నెగ్గాడు. గంటా 50 నిమిషాల ఈ పోరులో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నాదల్ (స్పెయిన్) 6-0, 6-3, 6-0తో రాబీ జినెప్రి (అమెరికా)ను చిత్తుగా ఓడించాడు. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేయడంతోపాటు... నెట్‌వద్ద 10 పాయింట్లు సాధించాడు. మరోవైపు ఆసియా ఆశాకిరణం, తొమ్మిదో సీడ్ కీ నిషికోరి (జపాన్) తొలి రౌండ్లోనే అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు. అన్‌సీడెడ్ మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా) 7-6 (7/4), 6-1, 6-2తో నిషికోరిపై సంచలనం సృష్టించాడు. 30వ సీడ్ పోస్పిసిల్ (కెనడా) కూడా తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. గబాష్విలి (రష్యా) 6-4, 6-2, 6-3తో పోస్పిసిల్ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) 4-6, 6-4, 6-2, 6-4తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై; 26వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) 6-3, 7-6 (10/8), 6-3తో దామిర్ జుమ్హుర్ (బోస్నియా అండ్ హెర్జిగోవినా)పై; 29వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-1, 6-1, 6-3తో పావిక్ (క్రొయేషియా)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. షరపోవా దూకుడు మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్, నిరుటి రన్నరప్ మరియా షరపోవా (రష్యా) రెండో రౌండ్లోకి చేరుకుంది. తొలి రౌండ్లో షరపోవా 6-1, 6-2తో పెర్వాక్ (రష్యా)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 7-5, 6-0తో రజానో (ఫ్రాన్స్)పై; 12వ సీడ్ పెనెట్టా (ఇటలీ) 6-2, 6-2తో యాచ్లిట్నర్ (ఆస్ట్రియా)పై; 16వ సీడ్ లిసికి (జర్మనీ) 6-1, 7-5తో ఫెర్రో (ఫ్రాన్స్)పై నెగ్గారు. అయితే 17వ సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-3, 3-6, 2-6తో పౌలీన్ పర్మాంటీర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. సానియా జోడికి ఐదో సీడ్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే)కి ఐదో సీడింగ్ లభించింది. తొలి రౌండ్లో ఈ జంట డానియెలా హంతుచోవా (స్లొవేకియా)-షహర్ పీర్ (ఇజ్రాయెల్) ద్వయంతో ఆడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఐసాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జంట కార్లోవిచ్-స్టీవెన్ రాబర్ట్ జోడితో ఆడుతుంది. -
ప్రేయసితో పెళ్లికి జొకోవిచ్ రెడీ
ప్రపంచ టెన్నిస్ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు, ప్రేయసి జెలెనా రిస్టిక్తో జొకోవిచ్‌కు నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని అతనే ట్విట్టర్లో వెల్లడించాడు. రిస్టిక్లో నొవార్ ఎనిమిదేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. రిస్టిక్ను ముద్దాడుతున్న ఫొటోను జొకో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన ప్రేయసి భార్య కాబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన వారికి ధన్యవాదాలు చెప్పాడు. కాగా జొకోవిచ్ వెన్నంటే ఉండే రిస్టిక్ అతని మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియాల్లో దర్శనమిస్తుంటుంది. అలాగే ఛారిటీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది.