పారిస్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–4తో అన్‌సీడెడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)పై విజయం సాధించాడు. 65 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు.
రెండు సెట్‌లలో ఒక్కోసారి షపోవలోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. విజేతగా నిలిచే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా సమర్పించుకోలేదు. చాంపియన్ జొకోవిచ్‌కు 9,95,720 యూరోల (రూ. 7 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ షపోవలోవ్‌కు 5,03,730 యూరోల (రూ. 3 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
34 జొకోవిచ్ కెరీర్‌లో ఇది 34వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. 35 టైటిల్స్‌తో రాఫెల్ నాదల్ (స్పెయిన్) అగ్రస్థానంలో ఉన్నాడు.
5 కెరీర్‌లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జాన్ మెకన్రో (అమెరికా)తో కలిసి జొకోవిచ్ (77 టైటిల్స్) సంయుక్తంగా ఐదో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్–103), ఇవాన్ లెండిల్ (అమెరికా–94), రాఫెల్ నాదల్ (స్పెయిన్–84 టైటిల్స్) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment