జొకోవిచ్‌కు షాక్
⇒క్వార్టర్స్‌లోనే ఓడిన డిఫెండింగ్ చాంపియన్
⇒థీమ్ చేతిలో పరాజయం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్, నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండోసీడ్ జొకోవిచ్ 6–7, 3–6, 0–6తో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరోసీడ్, డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. రెండుగంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయాడు. తొలిగేమ్‌లో ఇరువురు చెరో రెండుసార్లు సర్వీస్ కోల్పోవడంతో మ్యాచ్ టై బ్రేకర్‌కు దారి తీసింది.
ఇందులో కీలకదశలో విజృంభించిన థీమ్.. తొలిసెట్‌ను 74 నిమిషాల్లో కైవసం చేసుకున్నాడు. ఇక రెండోసెట్‌లో దూకుడు పెంచిన ఆస్ట్రియా ప్లేయర్.. రెండోగేమ్‌లోనే జొకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేసి 2–0తో ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం అదే జోరులో సెట్‌ను తన వశం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడోగేమ్‌లో సెర్బియన్‌స్టార్ ఆటతీరు పూర్తిగా గాడితప్పింది. వరుసగా మూడు సార్లు తన సర్వీస్ కోల్పోవడంతో కనీసం ఒక్క గేమ్ కూడా నెగ్గకుండా సెట్‌తోపాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఏస్‌లు, 38 విన్నర్లు ఆడిన థీమ్.. తొలి సర్వీస్‌లోనే 74 శాతం పాయింట్లను గెలుపొందడం విశేషం. మరోవైపు మూడు డబుల్‌ఫాల్టులు, 35 అనవసర తప్పిదాలు చేసిన జొకో.. తనకు లభించిన 6 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో కేవలం రెండింటిని మాత్రమే సద్వినయోగం చేసుకుని భంగపడ్డాడు. సెమీస్‌లో తొమ్మిదిసార్లు చాంపియన్, నాలుగోసీడ్ రఫెల్ నాదల్(స్పెయిన్)తో థీమ్ తలపడనున్నాడు. మరో క్వార్టర్స్ ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాదల్ 6–2, 2–0తో ఆధిక్యంలో ఉండగా.. ప్రత్యర్థి పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్) గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు.
సెమీస్‌లో ప్లిస్కోవా, హలెప్
మహిళల సింగిల్స్‌లో రెండోసీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్), మూడోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) సెమీస్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, ప్లిస్కోవా 7–6, 6–4తో 28వ సీడ్, స్థానిక ప్లేయర్ కరోలిన్ గార్సియాపై విజయం సాధించింది. మరో క్వార్టర్స్‌లో ప్రపంచ నాలుగోర్యాంకర్, హలెప్ 3–6, 7–6, 6–0తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఐదో సీడ్, ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందింది. రెండుగంటలకుపైగా జరిగిన ఈమ్యాచ్‌లో రెండోసెట్ టైబ్రేకర్‌లో ఓ మ్యాచ్‌పాయింట్‌ను కాచుకున్న హలెప్.. తర్వాతి సెట్‌లో విజృంభించింది. మూడోసెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను వరుసగా మూడుసార్లు బ్రేక్‌చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సెమీస్‌లో ప్లిస్కోవాతో హలెప్ తలపడనుంది.