సెమీఫైనల్లో జొకోవిచ్, సబలెంకా
క్వార్టర్ ఫైనల్లో అద్భుత విజయాలు
మూడో సీడ్ కోకో గాఫ్ అవుట్
కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లో బదోసా
మూడోసారి సెమీస్ చేరిన జ్వెరెవ్
టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు నొవాక్ జొకోవిచ్ రెండు విజయాల దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియా దిగ్గజం 12వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రికార్డుస్థాయిలో 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన జొకోవిచ్ కేవలం గత ఏడాది మాత్రమే తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోయాడు.
గత ఏడాది వింబుల్డన్ టోర్నీలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డు నెలకొల్పేందుకు జొకోవిచ్‌కు అవకాశం లభించింది. కానీ తుదిపోరులో స్పెయిన్ యువతార కార్లోస్ అల్‌కరాజ్ అద్వితీయ ఆటతీరుతో జొకోవిచ్ ఆశలను వమ్ము చేశాడు. తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనే ‘గ్రాండ్’ రికార్డు అందుకోవాలనే లక్ష్యంతో జొకోవిచ్ ఈసారి పక్కా ప్రణాళికతో వచ్చాడు.
గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన బ్రిటన్ స్టార్, తన చిరకాల ప్రత్యర్థి ఆండీ ముర్రేను కోచ్‌గా నియమించుకున్నాడు. ముర్రే నియామకం సరైనదేనని ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ ఆటతీరును పరిశీలిస్తే తెలుస్తోంది.
క్వార్టర్ ఫైనల్లో పెద్ద అడ్డంకి అల్‌కరాజ్‌ను నాలుగు సెట్‌ల పోరులో జొకోవిచ్ అధిగమించాడు. సెమీఫైనల్లో జొకోవిచ్ జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ రూపంలో మరో కీలక పరీక్షకు సిద్ధంకానున్నాడు. అయితే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జ్వెరెవ్‌తో పోటీపడ్డ మూడుసార్లూ జొకోవిచే గెలుపొందడం గమనార్హం.
మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 2023, 2024లలో విజేతగా నిలిచిన సబలెంకాకు ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లో గట్టిపోటీ ఎదురైంది. అయితే సబలెంకా తన ఆధిపత్యం చాటుకొని ‘హ్యాట్రిక్’ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.
మెల్‌బోర్న్: ‘ఈసారి కాకపోతే మరెప్పుడూ కాదు’ అన్న తరహాలో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన శక్తినంతా ధారపోస్తూ, అపార అనుభవాన్ని రంగరిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోరాడుతున్నాడు. 37 ఏళ్ల వయస్సులో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవాలనే పట్టుదలతో మెల్‌బోర్న్‌లో అడుగు పెట్టిన జొకోవిచ్ ఎంతో ప్రమాదకరమైన అల్‌కరాజ్ అడ్డంకిని దాటేశాడు.
కొత్త కోచ్ ఆండీ ముర్రే రచించిన వ్యూహాలను కోర్టులో అమలు చేసిన జొకోవిచ్... నాలుగు సెట్‌లలో స్పెయిన్ స్టార్ అల్‌కరాజ్ ఆట కట్టించేశాడు. 12వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 4–6, 6–4, 6–3, 6–4తో మూడో సీడ్ అల్‌కరాజ్‌ను ఓడించాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఆట అబ్బురపరిచింది.
జొకోవిచ్‌ను నిలువరించేందుకు 21 ఏళ్ల అల్‌కరాజ్ అన్ని అస్త్రాలను ప్రయోగించినా...సెర్బియా స్టార్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ర్యాలీ హోరాహోరీగా సాగుతుంటే హఠాత్తుగా దానిని డ్రాప్ షాట్‌గా మలిచి పాయింట్లు నెగ్గడం అల్‌కరాజ్‌కు అలవాటు. అయితే ఈసారి అల్‌కరాజ్ ఈ ‘డ్రాప్ షాట్’ల వ్యూహానికి పక్కాగా సిద్ధమై వచ్చిన జొకోవిచ్ సమర్థంగా అడ్డుకున్నాడు.
54 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌లో మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌లను అల్‌కరాజ్ బ్రేక్ చేశాడు. అదే జోరులో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ కోల్పోవడంతో జొకోవిచ్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే ఒత్తిడిలోనే జొకోవిచ్‌లోని మేటి ఆటగాడు మేల్కొన్నాడు. అల్‌కరాజ్ కంటే అద్భుతంగా ఆడుతూ ముందుకు వెళ్లాడు. రెండో సెట్‌లోని రెండో గేమ్‌లోనే అల్‌కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలో వచ్చాడు.
అయితే పట్టువదలకుండా పోరాడిన అల్‌కరాజ్ ఐదో గేమ్‌లోనే జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. అయితే పదో గేమ్‌లో అల్‌కరాజ్ సర్వీస్‌లో ఒక్కసారిగా దూకుడు పెంచిన జొకోవిచ్ ఒక్క అవకాశం ఇవ్వకుండా సర్వీస్‌ను బ్రేక్ చేసి 50 నిమిషాల్లో రెండో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్‌లో కూడా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు.
ఆరో గేమ్‌లో అల్‌కరాజ్ సర్వీస్‌ను జొకోవిచ్ బ్రేక్ చేయగా... ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను అల్‌కరాజ్ బ్రేక్ చేశాడు. ఎనిమిదో గేమ్‌లో మళ్లీ అల్‌కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 50 నిమిషాల్లో సెట్‌ను 6–3తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లోని తొలి గేమ్‌లోనే అల్‌కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన అన్ని సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 3 గంటల 28 నిమిషాల్లో 7–6 (7/1), 7–6 (7/0), 2–6, 6–1తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)పై గెలిచి మూడోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఫైనల్లో చోటు కోసం జొకోవిచ్‌తో జ్వెరెవ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 8–4తో జ్వెరెవ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వీరిద్దరు మూడుసార్లు (2021 యూఎస్ ఓపెన్ సెమీఫైనల్; 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్; 2019 ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్) పోటీపడగా... మూడుసార్లూ జొకోవిచే గెలిచాడు.
వరుసగా 19వ విజయంతో...
మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా 6–2, 2–6, 6–3తో 27వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై, బదోసా 7–5, 6–4తో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సబలెంకాకిది వరుసగా 19వ విజయం కావడం విశేషం.
వరుసగా రెండేళ్లు (2023, 2024) ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సబలెంకా ఈసారీ టైటిల్ సాధిస్తే మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997, 1998, 1999) తర్వాత ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది. పావ్లీచెంకోవాతో ఒక గంట 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 29 విన్నర్స్ కొట్టింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
బదోసాతో ఒక గంట 43 నిమిషాలపాటు జరిగిన పోరులో కోకో గాఫ్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. కోకో గాఫ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన బదోసా ఈ గెలుపుతో తన కెరీర్‌లో ఆడుతోన్న 20వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.
నేడు జరిగే పురుషుల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో లొరెంజో సొనెగో (ఇటలీ)తో బెన్ షెల్టన్ (అమెరికా); అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో యానిక్ సినెర్; మహిళల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో మాడిసన్ కీస్ (అమెరికా)తో స్వితోలినా (ఉక్రెయిన్); ఎమ్మా నవారో (అమెరికా)తో ఇగా స్వియాటెక్ (పోలాండ్) తలపడతారు.
బోపన్న జోడీ ఓటమి
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–షుయె జాంగ్ (చైనా) జోడీ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షుయె జాంగ్ ద్వయం 6–2, 4–6, 9–11తో జాన్ పీర్స్–ఒలివియా గడెస్కీ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది.
50 ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధికంగా 50 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో పురుష సింగిల్స్ సెమీఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ఆల్‌టైమ్ రికార్డు క్రిస్ ఎవర్ట్ (52 సార్లు; అమెరికా) పేరిట ఉంది.
Comments
Please login to add a commentAdd a comment