ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ
మెల్‌బోర్న్: ‘హ్యాట్రిక్’ ఘనత సాధించేందుకు సబలెంకా... కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకునేందుకు మాడిసన్ కీస్... ఒక్క విజయం దూరంలో నిలిచారు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బెలారస్ స్టార్ సబలెంకా వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లగా... అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత పొందింది.
గురు వారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సబలెంకా 6–4, 6–2తో 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్)పై నెగ్గగా... 19వ సీడ్ మాడిసన్ కీస్ 5–7, 6–1, 7–6 (10/8)తో రెండో సీడ్, ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించింది. శనివారం జరిగే ఫైనల్లో సబలెంకా, కీస్ అమీతుమీ తేల్చుకుంటారు.
2023, 2024లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంకాకు సెమీఫైనల్లో తన ప్రత్యర్థి బదోసా నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా 32 వినర్స్ కొట్టి, బదోసా సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు బదోసా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 15 అనవసర తప్పిదాలు చేసిన ఈ స్పెయిన్ ప్లేయర్ కేవలం ఒకసారి మాత్రమే సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది.
స్వియాటెక్‌తో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కీస్ నిర్ణాయక మూడో సెట్‌లోని 12వ గేమ్‌లో మ్యాచ్ పాయింట్ కాపాడుకుంది. 6–5తో ఆధిక్యంలో నిలిచిన స్వియాటెక్ తన సర్వీస్‌లో 40–30తో విజయం అంచుల్లో నిలిచింది. అయితే స్వియాటెక్ వరుసగా మూడు తప్పిదాలు చేసి తన సర్వీస్‌ను కోల్పోయింది. దాంతో స్కోరు 6–6తో సమమైంది. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది.
తొలుత 10 పాయింట్లు సాధించిన వారికి విజయం ఖరారయ్యే ఆఖరి సెట్ టైబ్రేక్‌లో రెండుసార్లు స్వియాటెక్ 5–3తో, 7–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ కీస్ పట్టుదల కోల్పోకుండా పోరాడి చివరకు 10–8తో టైబ్రేక్‌లో నెగ్గి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
2017లో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన కీస్ రెండో ‘గ్రాండ్’ అవకాశంలోనైనా విజేతగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ (సెర్బియా); బెన్‌షెల్టన్ (అమెరికా)తో యానిక్ సినెర్ (ఇటలీ) తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment