సబలెంకా సాఫీగా... | Sabalenka in the Australian Open quarterfinals | Sakshi
Sakshi News home page

సబలెంకా సాఫీగా...

Published Mon, Jan 20 2025 3:46 AM | Last Updated on Mon, Jan 20 2025 3:46 AM

Sabalenka in the Australian Open quarterfinals

క్వార్టర్‌ ఫైనల్లోకి డిఫెండింగ్‌ చాంపియన్‌

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 14వ సీడ్‌ ఆంద్రీవాపై గెలుపు

కేవలం మూడు గేమ్‌లు కోల్పోయిన బెలారస్‌ స్టార్‌ 

శ్రమించి గెలిచిన కోకో గాఫ్‌  

మ్యాచ్‌ మ్యాచ్‌కూ తన రాకెట్‌ పదును పెంచుతున్న బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ సబలెంకా ధాటికి ప్రత్యర్థులు తేలిపోతున్నారు. కచ్చితంగా గట్టిపోటీ ఇస్తారనుకుంటే... సబలెంకా ముందు వారు ఎదురు నిలువలేకపోతున్నారు. దాంతో సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వరుసగా నాలుగో విజయంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా నెగ్గిన సబలెంకాకు క్వార్టర్‌ ఫైనల్లో రష్యా సీనియర్‌ ప్లేయర్‌ అనస్తాసియా పావ్లీచెంకో ఏమేరకు పోటీనిస్తుందో వేచి చూడాలి. వరుసగా 17వసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడుతున్న 27వ సీడ్‌ పావ్లీచెంకోవా ఇప్పటి వరకు మూడుసార్లు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకొని ముందంజ వేయలేకపోయింది. ఈ టోర్నీలో ఆమె తొలిసారి సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.  

మెల్‌బోర్న్‌: ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ లక్ష్యం దిశగా ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా ఇంకో అడుగు వేసింది. 2023, 2024లలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన సబలెంకా ఈసారీ టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సబలెంకా 6–1, 6–2తో రష్యా రైజింగ్‌ స్టార్, 14వ సీడ్‌ మిరా ఆంద్రీవాపై అలవోకగా గెలిచింది. 

62 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. మూడు ఏస్‌లు సంధించిన సబలెంకా ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. 15 విన్నర్స్‌ కొట్టిన ఆమె 11 అనవసర తప్పిదాలు చేసింది. ఆంద్రీవా సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసిన సబలెంకా తన సర్వీస్‌ను ఒక్కసారీ చేజార్చుకోలేదు. నెట్‌ వద్దకు దూసుకొచ్చిన నాలుగుసార్లూ సబలెంకా పాయింట్లు నెగ్గడం విశేషం. 

మరోవైపు ఆంద్రీవా మూడు డబుల్‌ ఫాల్ట్‌లు, 18 అనవసర తప్పిదాలు చేసింది. సబలెంకాతోపాటు మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా), 11వ సీడ్‌ పౌలా బదోసా (స్పెయిన్‌), 27వ సీడ్‌ పావ్లీచెంకోవా (రష్యా) కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కోకో గాఫ్‌ 5–7, 6–2, 6–1తో బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై కష్టపడి గెలుపొందగా... బదోసా 6–1, 7–6 ((7/2)తో ఓల్గా డానిలోవిచ్‌ (సెర్బియా)పై, పావ్లీచెంకోవా 7–6 (7/0), 6–0తో 18వ సీడ్‌ డోనా వెకిచ్‌ (క్రొయేషియా)పై వరుస సెట్‌లలో నెగ్గారు.  

బోపన్న జోడీకి ‘వాకోవర్‌’ 
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న–షుయె జాంగ్‌ (చైనా) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బోపన్న–షుయె జాంగ్‌లతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆడాల్సిన నాలుగో సీడ్‌ ద్వయం హుగో న్యాస్‌ (మొనాకో)–టేలర్‌ టౌన్‌సెండ్‌ (అమెరికా) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బోపన్న–షుయె జాంగ్‌ కోర్టులో అడుగు పెట్టకుండానే క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. 

తిమియా బాబోస్‌ (హంగేరి)–మార్సెలో అరెవాలో (ఎల్‌ సాల్వడార్‌); ఒలివియా గడెస్కీ–జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా) జోడీల మధ్య మ్యాచ్‌ విజేతతో క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–షుయె జాంగ్‌ జంట తలపడుతుంది. తొలి రౌండ్‌లో బోపన్న–షుయె జాంగ్‌ 6–4, 6–4తో క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)లపై గెలిచారు. 
 
గత ఏడాది పురుషుల డబుల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి టైటిల్‌ నెగ్గిన బోపన్న ఈ ఏడాది మాత్రం కొత్త భాగస్వామి బారింటోస్‌ (కొలంబియా)తో కలిసి పోటీపడి తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.  

జొకోవిచ్‌ 15వసారి...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో 10 సార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ 15వసారి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్, 24వ సీడ్‌ జిరీ లెహెస్కాతో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6–3, 6–4, 7–6 (7/4)తో విజయం సాధించాడు. 2 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ తొమ్మిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. లెహెస్కా 11 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 

27 విన్నర్స్‌ కొట్టిన జొకోవిచ్‌ 21 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు జొకోవిచ్‌కంటే ఎక్కువ వినర్స్‌ (39) కొట్టిన లెహెస్కా ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. లెహెస్కా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. నెట్‌ వద్దకు జొకోవిచ్‌ 18 సార్లు వచ్చి 16 సార్లు పాయింట్లు సాధించగా... లెహెస్కా 26 సార్లు ముందుకొచ్చి 18 సార్లు పాయింట్లు నెగ్గాడు.  

క్వార్టర్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌తో ‘ఢీ’ 
రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టిన జొకోవిచ్‌కు క్వార్టర్‌ ఫైనల్లో అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. గత ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు నెగ్గిన స్పెయిన్‌ స్టార్, మూడో సీడ్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌తో క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ తలపడనున్నాడు. 

అల్‌కరాజ్‌తో ముఖాముఖిగా ఏడుసార్లు పోటీపడ్డ జొకోవిచ్‌ నాలుగుసార్లు నెగ్గి, మూడుసార్లు ఓడిపోయాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాత్రం వీరిద్దరు తొలిసారి తలపడనున్నారు. ఆదివారమే జరిగిన ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–1, 2–6, 6–3, 6–2తో 14వ సీడ్‌ ఉగో హంబెర్ట్‌ (ఫ్రాన్స్‌)పై, 12వ సీడ్‌ టామీ పాల్‌ (అమెరికా) 6–1, 6–1, 6–1తో డేవిడోవిచ్‌ ఫొకీనా (స్పెయిన్‌)పై నెగ్గారు. 

15వ సీడ్‌ జేక్‌ డ్రేపర్‌ (బ్రిటన్‌)తో జరిగిన మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ 7–5, 6–1తో రెండు సెట్‌లు గెలిచాక అతని ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement