చాంపియన్స్ అలవోకగా...
జొకోవిచ్, ముగురుజా శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ
పారిస్: పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో డిఫెండింగ్ చాంపియన్స్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), గార్బిన్ ముగురుజా (స్పెయిన్) అలవోక విజయాలతో ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై... నాలుగో సీడ్ ముగురుజా 6–4, 6–2తో షియవోని (ఇటలీ)పై గెలిచారు. అమెరికా టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీని కోచ్‌గా నియమించుకున్నాక ఆడుతున్న తొలి టోర్నీలో జొకోవిచ్ ఆకట్టుకున్నాడు. 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఐదు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి... తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. 30 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 29 అనవసర తప్పిదాలు చేశాడు.
మరోవైపు రికార్డుస్థాయిలో పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తొలి అడ్డంకిని సాఫీగా అధిగమించాడు. గతంలో తొమ్మిదిసార్లు చాంపియన్‌గా నిలిచిన నాలుగో సీడ్ నాదల్ తొలి రౌండ్‌లో 6–1, 6–4, 6–1తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)ను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 6–3, 6–4, 6–2తో డార్సిస్ (బెల్జియం)పై, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 6–3, 6–3తో గుల్బిస్ (లాత్వియా)పై, పదో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–2, 6–2, 6–2తో మథియు (ఫ్రాన్స్)పై గెలిచారు. అయితే 14వ సీడ్ జాక్ సోక్ (అమెరికా) 5–7, 5–7, 3–6తో వెసిలీ (చెక్ రిపబ్లిక్) చేతిలో, 32వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 2–6, 2–6తో నపోలితానో (ఇటలీ) చేతిలో తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టారు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 7–5, 6–2తో జెంగ్ (చైనా)పై, రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 11వ సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–4, 3–6, 6–2తో ఫోర్లిస్ (ఆస్ట్రేలియా)పై, 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 3–6, 6–3, 9–7తో బ్రాడీ (అమెరికా)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)–ష్వెదోవా (కజకిస్తాన్) జంటకు నాలుగో సీడింగ్ లభించింది. తొలి రౌండ్‌లో ఈ ఇండో–కజక్ ద్వయం గావ్రిలోవా (ఆస్ట్రేలియా)–పావ్లీచెంకోవా (రష్యా) జోడీతో ఆడుతుంది.