బౌచర్డ్ బోల్తా | Eugenie Bouchard out in 1st round of French Open | Sakshi
Sakshi News home page

బౌచర్డ్ బోల్తా

Published Wed, May 27 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

బౌచర్డ్ బోల్తా

బౌచర్డ్ బోల్తా

 మ్లాడెనోవిచ్ సంచలనం
 రెండో రౌండ్‌లో నాదల్, జొకోవిచ్
 ఫ్రెంచ్ ఓపెన్
 
 పారిస్: ఇటీవల జరిగిన సర్వేలో మార్కెట్‌ను అత్యంత ప్రభావితం చేయగల అథ్లెట్స్‌లో అగ్రస్థానం పొందిన కెనడా మహిళా టెన్నిస్ స్టార్ యూజిన్ బౌచర్డ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం తేలిపోయింది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) చేతిలో వరుస సెట్‌లలో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది.
 
  ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన బౌచర్డ్ 4-6, 4-6తో మ్లాడెనోవిచ్ చేతిలో ఓటమి పాలై తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్‌లో నిష్ర్కమించింది. గతేడాది ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన ఈ కెనడా బ్యూటీ  ఈసారి మాత్రం ఊహించని పరాజయం ఎదుర్కొంది. ఆరు అడుగుల ఎత్తున్న మ్లాడెనోవిచ్ అద్భుత ఆటతీరును కనబరిచి బౌచర్డ్‌ను బోల్తా కొట్టించింది. మూడు ఏస్‌లు సంధించిన ఈ ఫ్రాన్స్ అమ్మాయి బౌచర్డ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ప్రపంచ మాజీ నంబర్‌వన్, 25వ సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) 2005 తర్వాత ఈ టోర్నీలో మరోసారి తొలి రౌండ్‌లో ఓడిపోయింది. సెసిల్ కరాతంత్‌చెవా (బల్గేరియా) 6-3, 6-4తో జంకోవిచ్‌ను ఓడించింది.
 
 మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), నాలుగో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఐదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), పదో సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ), 18వ సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో సెరెనా 6-2, 6-3తో హలవకోవా (చెక్ రిపబ్లిక్)పై, క్విటోవా 6-4, 3-6, 6-4తో ఎరాకోవిచ్ (న్యూజిలాండ్)పై, వొజ్నియాకి 6-3, 6-0తో కరీన్ నాప్ (ఇటలీ)పై, పెట్కోవిచ్ 6-2, 6-1తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై, కుజ్‌నెత్సోవా 6-1, 4-6, 6-2తో కికి బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్)పై గెలిచారు.
 
 దిమిత్రోవ్‌కు షాక్
 పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి సంచలనం నమోదైంది. షరపోవా ప్రియుడు, పదో సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) వరుసగా రెండో ఏడాది తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. జాక్ సాక్ (అమెరికా) 7-6 (9/7), 6-2, 6-3తో దిమిత్రోవ్‌ను కంగుతినిపించాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) అలవోక విజయాలతో శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో ఆరో సీడ్ నాదల్ 6-3, 6-3, 6-4తో క్వెంటిన్ హలిస్ (ఫ్రాన్స్)పై, జొకోవిచ్ 6-2, 7-5, 6-2తో నిమినెన్ (ఫిన్‌లాండ్)పై నెగ్గారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-1, 6-3, 6-1తో లాకో (స్లొవేకియా)పై, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-4, 6-2తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)పై, 16వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) 7-5, 6-2, 6-3తో సెప్పి (ఇటలీ)పై, 20వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-0తో గిగోనౌన్ (బెల్జియం)పై విజయం సాధించారు.
 
 భూపతి జంట ఓటమి
 పురుషుల డబుల్స్ విభాగంలో మహేశ్ భూపతి (భారత్)-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంటకు తొలి రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. కొకినాకిస్ (ఆస్ట్రేలియా)-పౌలీ (ఫ్రాన్స్) జోడీ 6-3, 6-1తో భూపతి-కిరియోస్ ద్వయంపై గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement