సెమీస్‌లో సెరెనా
► క్వార్టర్స్‌లో పుటినెత్సోవాపై గెలుపు
► ముర్రే, జొకోవిచ్, థీమ్ కూడా సెమీస్‌కు ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: తొలిసెట్ చేజారినా... కీలక సమయంలో పుంజుకున్న డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)... ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సెరెనా 5-7, 6-4, 6-1తో ప్రపంచ 60వ ర్యాంకర్ యూలియా పుటినెత్సోవా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. తొలి సెట్‌లో ఇరువురు సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
మూడో గేమ్‌లో ఫోర్‌హ్యాండ్ షాట్‌లో చేసిన తప్పిదానికి సెరెనా మూల్యం చెల్లించుకోగా... ఆ వెంటనే పుటినెత్సోవా సర్వీస్‌ను నిలబెట్టుకుని 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో పుంజుకున్న అమెరికన్ ఐదో గేమ్‌లో సర్వీస్‌తో పాటు ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-3తో స్కోరును సమం చేసింది. తర్వాత ఇరువురు మరోసారి సర్వీస్ (4-4)ను నిలబెట్టుకున్నారు. తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కాపాడుకున్నా 11వ గేమ్‌లో సర్వీస్ చేజార్చుకుంది. 10, 12 గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకున్న పుటినెత్సోవా సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండు, మూడో సెట్‌లో తిరుగులేని ఆటతీరుతో చెలరేగిన సెరెనా... పుటినెత్సోవాకు మరో అవకాశం ఇవ్వలేదు.
మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 8వ సీడ్ టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)కి చుక్కెదురైంది. అన్‌సీడెడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) 7-5, 6-2తో బాసిన్‌స్కీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ ముగురుజా (స్పెయిన్) 7-5, 6-3తో రోజెర్స్ (అమెరికా)పై; 21వ సీడ్ స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-4, 7-6 (8/6)తో పిరంకోవా (బల్గేరియా)పై నెగ్గారు.
ముర్రే ముందుకు...: రోలండ్ గారోస్‌లో తొలి టైటిల్ కోసం బరిలోకి దిగిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. పురుషుల క్వార్టర్స్‌లో రెండోసీడ్ ముర్రే 5-7, 7-6 (7/3), 6-0, 6-2తో తొమ్మిదోసీడ్ రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 7-5, 6-3తో ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై; 13వ సీడ్ డోమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 4-6, 7-6 (9/7), 6-4, 6-1తో 12వ సీడ్ డేవిడ్ గోఫిన్ (బెల్జియం)పై నెగ్గారు.