Defending champions
-
గ్రూప్ దశలోనే ఆస్ట్రేలియా నిష్క్రమణ.. మళ్లీ అదే రిపీటైంది
పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో హిస్టరీ రిపీటైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన జట్టు మరోసారి టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. కాదు,కాదు.. కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. అలాగే పొట్టి ప్రపంచకప్‌కు ఆతిధ్యమిచ్చిన ఏ జట్టూ టైటిల్ సాధించలేకపోయింది. ఇవాళ (నవంబర్ 5) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించగా.. నెట్రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్.. అనూహ్య విజయాలు సాధించి తమ ఖాతాలో లేని ఏకైక ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆతిధ్య హోదాతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కావడంతో ఆస్ట్రేలియా జట్టు భారీ అంచనాలతో బరిలోకి దిగింది. అయితే, ఊహించని విధంగా తొలి మ్యాచ్‌లోనే కివీస్ చేతిలో పరాజయం, ఆతర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఆతిధ్య జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అంతిమంగా ఫించ్ సేన సెమీస్‌కు చేరకుండానే నిరాశగా టోర్నీ నుంచి వైదొలిగి, డిఫెండింగ్ ఛాంపియన్లకు టీ20 ప్రపంచకప్ అచ్చిరాదన్న సెంటిమెంట్‌ను కొనసాగించింది. 2007లో పొట్టి ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి ఏ జట్టూ వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది లేదు. 2007లో భారత్, 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లండ్, 2012లో వెస్టిండీస్, 2014లో శ్రీలంక, 2016లో వెస్టిండీస్, 2021లో ఆస్ట్రేలియా.. ఇలా ఏ డిఫెండింగ్ ఛాంపియన్ కూడా టీ20 వరల్డ్ హిస్టరీలో టైటిల్‌ను నిలబెట్టుకొనింది లేదు. అలాగే ఏ ఆతిధ్య జట్టూ టైటిల్ సాధించింది లేదు. 2010లో పాకిస్తాన్, 2014లో వెస్టిండీస్ జట్లు సెమీస్ వరకు చేరుకోగలిగినప్పటికీ.. ఈ ఆనవాయితీకి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఈసారైనా ఆసీస్ హిస్టరీ రిపీట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేయగా.. డిఫెండింగ్ ఛాంపియన్ మాత్రం ఉసూరుమనిపించింది. -
ఎదురులేని ఏసెస్
ఐపీటీఎల్-2016 టోక్యో: డిఫెండింగ్ చాంపియన్స్ సింగపూర్ స్లామర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇండియన్ ఏసెస్ విజయం సాధించింది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఏసెస్ 26-25 తేడాతో గట్టెక్కింది. ముందుగా నాలుగు విభాగాల్లో జరిగిన మ్యాచ్‌లు 2-2తో సమం కావడంతో చివరి మహిళల సింగిల్స్ కీలకంగా మారింది. దీంట్లో ఏసెస్ క్రీడాకారిణి కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్సకు గట్టి పోటీ ఎదురైనా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా షూట్‌అవుట్‌లో 6-5తో కికి బెర్టెన్స్‌పై గెలిచి జట్టుకు విజయాన్ని అందించింది. అంతకుముందు పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో స్లామర్స్ ఆటగాడు కార్లోస్ మోయా 6-4తో థామస్ ఎన్క్విస్ట్పై గెలిచారు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో లోపెజ్ (ఏసెస్) 6-4తో బగ్దాటిస్పై నెగ్గి ఆధిక్యాన్ని సమం చేశాడు. పురుషుల డబుల్స్‌లో కిర్గియోస్-మెలో జోడీ (స్లామర్స్) 6-4తో డోడిగ్-లోపోజ్ జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న (ఏసెస్) ద్వయం 6-4తో మెలో-బెర్టెన్స జోడీపై గెలిచి మ్యాచ్‌లో ఆసక్తి రేపింది. చివర్లో కిర్‌స్టెన్ విశేషంగా రాణించి ఏసెస్‌కు వరుసగా రెండో విజయాన్ని అందించింది. మరో మ్యాచ్‌లో జపాన్ వారియర్స్ 23-20తో యూఏఈ రాయల్స్‌పై గెలిచింది. -
వరుసగా రెండోసారి..
► కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ ► సెమీస్‌లో కొలంబియాపై 2-0తో విజయం ► అర్జెంటీనాతో అమీతుమీ షికాగో: డిఫెండింగ్ చాంపియన్ చిలీ మరోసారి పంజా విసిరింది. క్వార్టర్స్‌లో మెక్సికోను 7-0తో చిత్తు చేసి జోరు మీదున్న ఈ చాంపియన్ జట్టు గురువారం జరిగిన సెమీఫైనల్లో కొలంబియాను 2-0తో ఓడించింది. దీంతో వరుసగా రెండోసారి కోపా అమెరికా ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది జరిగిన తుది పోరులోనూ ఈ రెండు జట్లే పోటీపడ్డాయి. మూడో స్థానం కోసం ఆదివారం జరిగే మ్యాచ్‌లో కొలంబియా, అమెరికాతో తలపడుతుంది. చిలీ తరఫున చార్లెస్ అరంగిజ్ (7వ నిమిషంలో), జోస్ పెడ్రో ఫ్యూంజలిడా (11) గోల్స్ సాధించారు. అయితే ప్రథమార్ధం ముగిసిన అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఆటకు రెండున్నర గంటలు అంతరాయం ఏర్పడింది. ఓ దశలో మిగతా మ్యాచ్‌ను వాయిదా వేయాలని భావించినా వర్షం ఆగడంతో కొనసాగించారు. ఆట మొదలైన 11 నిమిషాలకే రెండు గోల్స్ చేసిన చిలీ ప్రథమార్ధం మొత్తం ఆధిపత్యం కనబరచింది. ద్వితీయార్ధంలో కొలంబియా స్టార్ రోడ్రిగ్వెజ్ మెరుపు ఆటను చూపినా చిలీ డిఫెన్స్‌ను అధిగమించలేకపోయాడు. -
స్పెయిన్‌కు షాక్
► క్రొయేషియా సంచలన విజయం ► ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం యూరో ఫుట్‌బాల్ టోర్నీ. పారిస్: వరుసగా మూడోసారి ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ జట్టుకు చివరి లీగ్ మ్యాచ్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో క్రొయేషియా జట్టు 2-1 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టును బోల్తా కొట్టించింది. ఈ విజయంతో క్రొయేషియా ఏడు పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలువడంతోపాటు ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. చివరి మ్యాచ్‌లో ఓడినప్పటికీ... తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో నెగ్గిన స్పెయిన్ ఆరు పాయింట్లతో నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. యూరో టోర్నీలలో వరుసగా 14 మ్యాచ్‌ల తర్వాత స్పెయిన్‌కు ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన స్పెయిన్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా పటిష్టమైన ఇటలీ ఎదురుకానుంది. పెనాల్టీని వృథా చేసిన రామోస్ గ్రూప్ టాపర్‌గా నిలవాలంటే స్పెయిన్ కనీసం డ్రా చేసుకుంటే సరిపోయేది. కానీ ఆ జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. ఆట ఏడో నిమిషంలో అల్వారో మొరాటా చేసిన గోల్‌తో స్పెయిన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 45వ నిమిషంలో కాలినిచ్ గోల్‌తో క్రొయేషియా 1-1తో స్కోరును సమం చేసింది. 72వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కిక్ రూపంలో సువర్ణావకాశం దక్కింది. అయితే కెప్టెన్ సెర్గియో రామోస్ కొట్టిన షాట్‌ను క్రొయేషియా గోల్‌కీపర్ డానియెల్ సుబాసిచ్ నిలువరించాడు. 87వ నిమిషంలో పెరిసిచ్ చేసిన గోల్‌తో క్రొయేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్పెయిన్‌ను నిలువరించి ఆ జట్టుపై 22 ఏళ్ల తర్వాత మరో విజయాన్ని సొంతం చేసుకుంది. టర్కీ ఆశలు సజీవం: గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో టర్కీ 2-0తో చెక్ రిపబ్లిక్‌పై గెలిచి తమ నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. టర్కీ తరఫున బురాక్ యిల్మాజ్ (10వ నిమిషంలో), ఒజాన్ తుఫాన్ (65వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ ఓటమితో చెక్ రిపబ్లిక్ యూరో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. -
చాంపియన్‌లా చెలరేగి...
► రెండో విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి స్పెయిన్ ► టర్కీపై 3-0తో గెలుపు యూరో కప్ నైస్ (ఫ్రాన్స్): వరుసగా మూడో టైటిల్ వేటలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ యూరో కప్‌లో తొలిసారిగా తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. ప్రత్యర్థిపై అన్ని విభాగాల్లో రాణించడంతో పాటు ఫార్వర్డ్ ఆటగాడు అల్విరో మొరాటా తన విమర్శకులకు సమాధానం చెబుతూ ఏకంగా రెండు గోల్స్‌తో మెరిశాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి టర్కీతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0తో ఏకపక్ష విజయాన్ని అందుకుంది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయిన మొరాటా (34, 48వ నిమిషాల్లో) ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో దుమ్మురేపగా... నోలిటో (37) ఓ గోల్ చేశాడు. అయితే తమ జట్టు ఓటమి అనంతరం టర్కీ అభిమానులు అలజడిని సృష్టించారు. స్టేడియంలోనికి క్రాకర్స్ విసిరారు. గ్రూప్ ‘డి’ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధమంతా స్పెయిన్ ఎదురుదాడే సాగింది. 11వ నిమిషంలో పీకే హెడర్ లక్ష్యాన్ని తాకలేకపోయింది. 25వ నిమిషంలో హకన్ కల్హనోగ్లు ఫ్రీకిక్ స్పెయిన్ గోల్బార్ పైనుంచి వెళ్లింది. అయితే మూడు నిమిషాల వ్యవధిలో స్పెయిన్ రెండు గోల్స్ సాధించి టర్కీకి షాక్ ఇచ్చింది. ద్వితీయార్ధం ప్రారంభమైన మూడో నిమిషంలోనే మొరాటా మళ్లీ మెరిశాడు. గోల్ పోస్ట్‌కు ఆరు గజాల దూరం నుంచి బంతిని నెట్‌లోనికి పంపడంతో జట్టుకు తిరుగులేని ఆధిక్యం లభించింది. బెల్జియం బోణీ: యూరో కప్‌లో బెల్జియం బోణీ చేసింది. ఇటలీతో తమ తొలి మ్యాచ్‌ను ఓడిన ఈ జట్టు గ్రూప్ ‘ఇ’లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0తో నెగ్గింది. తమ నాకౌట్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. లూకాక్ (48, 70వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో రెచ్చిపోగా.. ఏక్సెల్ విట్సెల్ (61) మరో గోల్ చేశాడు. ఐస్లాండ్ చేజేతులా: గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా శనివారం హంగేరి జట్టుతో జరిగిన మ్యాచ్‌ను ఐస్లాండ్ 1-1తో ‘డ్రా’ చేసుకుంది. 40వ నిమిషంలో లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న గిల్ఫీ సిగుర్డ్సన్ తమ జట్టుకు గోల్ అందించాడు. అయితే 88వ నిమిషంలో ఐస్లాండ్ ప్లేయర్ సెవార్సన్ ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో మ్యాచ్ ‘డ్రా’ అయింది. ‘యూరో’లో నేడు గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు రొమేనియా x అల్బేనియా రాత్రి గం. 12.30 నుంచి సోనీ ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం ఫ్రాన్స్ x స్విట్జర్లాండ్ రాత్రి గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సెమీస్‌లో సెరెనా
► క్వార్టర్స్‌లో పుటినెత్సోవాపై గెలుపు ► ముర్రే, జొకోవిచ్, థీమ్ కూడా సెమీస్‌కు ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: తొలిసెట్ చేజారినా... కీలక సమయంలో పుంజుకున్న డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)... ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సెరెనా 5-7, 6-4, 6-1తో ప్రపంచ 60వ ర్యాంకర్ యూలియా పుటినెత్సోవా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. తొలి సెట్లో ఇరువురు సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మూడో గేమ్‌లో ఫోర్‌హ్యాండ్ షాట్లో చేసిన తప్పిదానికి సెరెనా మూల్యం చెల్లించుకోగా... ఆ వెంటనే పుటినెత్సోవా సర్వీస్‌ను నిలబెట్టుకుని 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో పుంజుకున్న అమెరికన్ ఐదో గేమ్‌లో సర్వీస్‌తో పాటు ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-3తో స్కోరును సమం చేసింది. తర్వాత ఇరువురు మరోసారి సర్వీస్ (4-4)ను నిలబెట్టుకున్నారు. తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కాపాడుకున్నా 11వ గేమ్‌లో సర్వీస్ చేజార్చుకుంది. 10, 12 గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకున్న పుటినెత్సోవా సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండు, మూడో సెట్లో తిరుగులేని ఆటతీరుతో చెలరేగిన సెరెనా... పుటినెత్సోవాకు మరో అవకాశం ఇవ్వలేదు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 8వ సీడ్ టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)కి చుక్కెదురైంది. అన్‌సీడెడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) 7-5, 6-2తో బాసిన్స్కీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ ముగురుజా (స్పెయిన్) 7-5, 6-3తో రోజెర్స్ (అమెరికా)పై; 21వ సీడ్ స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-4, 7-6 (8/6)తో పిరంకోవా (బల్గేరియా)పై నెగ్గారు. ముర్రే ముందుకు...: రోలండ్ గారోస్‌లో తొలి టైటిల్ కోసం బరిలోకి దిగిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. పురుషుల క్వార్టర్స్‌లో రెండోసీడ్ ముర్రే 5-7, 7-6 (7/3), 6-0, 6-2తో తొమ్మిదోసీడ్ రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 7-5, 6-3తో ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై; 13వ సీడ్ డోమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 4-6, 7-6 (9/7), 6-4, 6-1తో 12వ సీడ్ డేవిడ్ గోఫిన్ (బెల్జియం)పై నెగ్గారు. -
గట్టెక్కిన వావ్రింకా
ఐదు సెట్ల పోరులో నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: కాస్త అటు ఇటు అయి ఉంటే... మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే నిష్ర్కమించిన మొదటి డిఫెండింగ్ చాంపియన్ క్రీడాకారుడిగా అపప్రథను మూటగట్టుకునేవాడు. అయితే తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో వావ్రింకా 4-6, 6-1, 3-6, 6-3, 6-4తో లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్)పై కష్టపడి గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో 46 అనవసర తప్పిదాలు చేసిన వావ్రింకా తన సర్వీస్‌లో ఎనిమిదిసార్లు బ్రేక్ పాయింట్ల ను కాపాడుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) 6-1, 7-5, 6-3తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 6-3, 6-2, 7-6 (7/5)తో టిప్సరెవిచ్ (సెర్బియా)పై, 22వ సీడ్ విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) 2-6, 6-3, 5-7, 7-5, 6-3తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై విజయం సాధించారు. 23వ సీడ్ జాక్ సోక్ (అమెరికా), 27వ సీడ్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా), 30వ సీడ్ జెరెమి చార్డీ (ఫ్రాన్స్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఏడో సీడ్ విన్సీ ఓటమి మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) తొలి రౌండ్లోనే ఓడిపోయింది. కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్) 6-1, 6-3తో విన్సీపై సంచలన విజయం సాధించింది. మరోవైపు నాలుగో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) మూడు సెట్ల పోరులో గట్టెక్కగా... 16వ సీడ్ సారా ఎరాని (ఇటలీ), 17వ సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ముగురుజా 3-6, 6-3, 6-3తో షిమిడ్లోవా (స్లొవేకియా)పై గెలుపొందగా... సారా ఎరాని 3-6, 2-6తో పిరొన్కోవా (బల్గేరియా) చేతిలో, ప్లిస్కోవా 6-3, 4-6, 3-6తో షెల్బీ రోజర్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-0, 6-2తో జొవనోవ్స్కీ (సెర్బియా)పై విజయం సాధించింది. -
డచ్ ఓపెన్ ఫైనల్లో జయరామ్
అల్మెరి (నెదర్లాండ్స్): డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకోవడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ అజయ్ జయరామ్ మరో విజయం దూరంలో ఉన్నాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జయరామ్ 21-14, 21-15తో గో సూన్ హువాట్ (మలేసియా)పై విజయం సాధించాడు. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ జయరామ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. ఇటీవలే కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచిన జయరామ్ అదే జోరును ఈ టోర్నీలోనూ కొనసాగిస్తున్నాడు. తొలి గేమ్‌లో ఆరంభం నుంచి ఆధిక్యంలో నిలిచిన జయరామ్‌కు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. ఒకదశలో 2-6తో వెనుకబడిన జయరామ్ ఆ వెంటనే తేరుకున్నాడు. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే దూకుడును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో 12వ సీడ్ రౌల్ మస్త్ (ఎస్తోనియా)తో అజయ్ జయరామ్ తలపడతాడు. -
చెన్నై ఓపెన్‌కు వావ్రింకా
ఎనిమిదోసారి బరిలోకి... చెన్నై : డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా ఎనిమిదోసారి చెన్నై ఓపెన్‌లో బరిలో దిగనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 10 వరకు జరిగే ఈ టోర్నీలో అతను పాల్గొంటాడని నిర్వాహకులు తెలిపారు. ఈ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఈ స్విస్ ప్లేయర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ముచ్చటగా మూడోసారి చెన్నై టైటిల్‌పై కన్నేశాడు. చెన్నై ఓపెన్‌తో సీజన్‌ను ప్రారంభించడం అద్భుతంగా ఉటుందని వావ్రింకా అన్నాడు. ‘టోర్నీపై దృష్టిపెట్టా. చివరి రెండేళ్లు చాలా ప్రత్యేకం. ఎందుకంటే చెన్నై ట్రోఫీతో సీజన్ మొదలుపెట్టాక కచ్చితంగా ఓ గ్రాండ్‌స్లామ్ గెలుస్తున్నా. మూడోసారి కూడా టైటిల్ గెలిచి వచ్చే ఏడాది మరింత ప్రత్యేకంగా నిలుపుకుంటా’ అని వావ్రింకా వ్యాఖ్యానించాడు. -
వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అద్వానీ అర్హత
బ్యాంకాక్ : భారత బిలియర్డ్స్ మేటి ఆటగాడు పంకజ్ అద్వానీ.. సిక్స్-రెడ్ వరల్డ్ చాంపియన్‌షిప్ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ పోటీలో పంకజ్ 5-2తో డిఫెండింగ్ చాంపియన్ స్టీఫెన్ ముగురే (యూకే)పై నెగ్గాడు. అంతకుముందు జరిగిన రౌండ్లో ఈ బెంగళూరు కుర్రాడు 5-0 అలెన్ ట్రిగ్‌ను చిత్తు చేశాడు. దీంతో తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. గత నెలలో కరాచీలో జరిగిన ఐబీఎస్ఎఫ్-6 రెడ్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పంకజ్‌కు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. -
జొకోవిచ్ శుభారంభం
సెరెనా, షరపోవా కూడా వింబుల్డన్ టోర్నమెంట్ లండన్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 6-4, 6-4, 6-4తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 6-3, 6-7 (4/7), 6-2, 3-6, 6-3తో బొలెలీ (ఇటలీ)పై, ఏడో సీడ్ రావ్‌నిక్ (కెనడా) 6-2, 6-3, 3-6, 7-6 (7/4)తో ట్రెవర్ (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-2, 7-6 (7/4)తో మొరియా (జపాన్)పై, 26వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 6-0, 6-2, 7-6 (8/6)తో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై గెలుపొందారు.చివరిసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న మాజీ చాంపియన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) 6-3, 3-6, 6-4, 0-6, 9-11తో నిమినెన్ (ఫిన్లాండ్) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. మహిళల సింగిల్స్ విభాగంలోనూ సీడెడ్ క్రీడాకారిణులు అలవోక విజయాలతో రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-4, 6-1తో మార్గరీటా గ్యాస్పర్యాన్ (రష్యా)పై, నాలుగో సీడ్ షరపోవా (రష్యా) 6-2, 6-2తో జోనా కోంటా (బ్రిటన్)పై, ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) 6-1, 6-1తో యి ఫాన్ జు (చైనా)పై, 16వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-0, 6-0తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)పై విజయం సాధించారు. రెండో రౌండ్లో బోపన్న జంట: పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న-మెర్జియా 6-3, 6-7 (1/7), 6-1తో టిమ్ స్మిజెక్ (అమెరికా)-జిరీ వెస్లె (చెక్ రిపబ్లిక్)లపై గెలిచారు.