స్పెయిన్‌కు షాక్
► క్రొయేషియా సంచలన విజయం
► ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం యూరో ఫుట్‌బాల్ టోర్నీ.
పారిస్: వరుసగా మూడోసారి ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ జట్టుకు చివరి లీగ్ మ్యాచ్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో క్రొయేషియా జట్టు 2-1 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టును బోల్తా కొట్టించింది. ఈ విజయంతో క్రొయేషియా ఏడు పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలువడంతోపాటు ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది.
చివరి మ్యాచ్‌లో ఓడినప్పటికీ... తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో నెగ్గిన స్పెయిన్ ఆరు పాయింట్లతో నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. యూరో టోర్నీలలో వరుసగా 14 మ్యాచ్‌ల తర్వాత స్పెయిన్‌కు ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన స్పెయిన్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా పటిష్టమైన ఇటలీ ఎదురుకానుంది.
పెనాల్టీని వృథా చేసిన రామోస్
గ్రూప్ టాపర్‌గా నిలవాలంటే స్పెయిన్ కనీసం డ్రా చేసుకుంటే సరిపోయేది. కానీ ఆ జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. ఆట ఏడో నిమిషంలో అల్వారో మొరాటా చేసిన గోల్‌తో స్పెయిన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 45వ నిమిషంలో కాలినిచ్ గోల్‌తో క్రొయేషియా 1-1తో స్కోరును సమం చేసింది. 72వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కిక్ రూపంలో సువర్ణావకాశం దక్కింది. అయితే కెప్టెన్ సెర్గియో రామోస్ కొట్టిన షాట్‌ను క్రొయేషియా గోల్‌కీపర్ డానియెల్ సుబాసిచ్ నిలువరించాడు.
87వ నిమిషంలో పెరిసిచ్ చేసిన గోల్‌తో క్రొయేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్పెయిన్‌ను నిలువరించి ఆ జట్టుపై 22 ఏళ్ల తర్వాత మరో విజయాన్ని సొంతం చేసుకుంది.
టర్కీ ఆశలు సజీవం: గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో టర్కీ 2-0తో చెక్ రిపబ్లిక్‌పై గెలిచి తమ నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. టర్కీ తరఫున బురాక్ యిల్మాజ్ (10వ నిమిషంలో), ఒజాన్ తుఫాన్ (65వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ ఓటమితో చెక్ రిపబ్లిక్ యూరో టోర్నీ నుంచి నిష్ర్కమించింది.