పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో హిస్టరీ రిపీటైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన జట్టు మరోసారి టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. కాదు,కాదు.. కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. అలాగే పొట్టి ప్రపంచకప్‌కు ఆతిధ్యమిచ్చిన ఏ జట్టూ టైటిల్ సాధించలేకపోయింది.
ఇవాళ (నవంబర్ 5) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించగా.. నెట్‌రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్.. అనూహ్య విజయాలు సాధించి తమ ఖాతాలో లేని ఏకైక ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆతిధ్య హోదాతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కావడంతో ఆస్ట్రేలియా జట్టు భారీ అంచనాలతో బరిలోకి దిగింది. అయితే, ఊహించని విధంగా తొలి మ్యాచ్‌లోనే కివీస్ చేతిలో పరాజయం, ఆతర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఆతిధ్య జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అంతిమంగా ఫించ్ సేన సెమీస్‌కు చేరకుండానే నిరాశగా టోర్నీ నుంచి వైదొలిగి, డిఫెండింగ్ ఛాంపియన్‌లకు టీ20 ప్రపంచకప్ అచ్చిరాదన్న సెంటిమెంట్‌ను కొనసాగించింది.
2007లో పొట్టి ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి ఏ జట్టూ వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది లేదు. 2007లో భారత్, 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లండ్, 2012లో వెస్టిండీస్, 2014లో శ్రీలంక, 2016లో వెస్టిండీస్, 2021లో ఆస్ట్రేలియా.. ఇలా ఏ డిఫెండింగ్ ఛాంపియన్ కూడా టీ20 వరల్డ్ హిస్టరీలో టైటిల్‌ను నిలబెట్టుకొనింది లేదు. అలాగే ఏ ఆతిధ్య జట్టూ టైటిల్ సాధించింది లేదు.
2010లో పాకిస్తాన్, 2014లో వెస్టిండీస్ జట్లు సెమీస్ వరకు చేరుకోగలిగినప్పటికీ.. ఈ ఆనవాయితీకి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఈసారైనా ఆసీస్ హిస్టరీ రిపీట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేయగా.. డిఫెండింగ్ ఛాంపియన్ మాత్రం ఉసూరుమనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment