వరుసగా రెండోసారి..
► కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ
► సెమీస్‌లో కొలంబియాపై 2-0తో విజయం
► అర్జెంటీనాతో అమీతుమీ
షికాగో: డిఫెండింగ్ చాంపియన్ చిలీ మరోసారి పంజా విసిరింది. క్వార్టర్స్‌లో మెక్సికోను 7-0తో చిత్తు చేసి జోరు మీదున్న ఈ చాంపియన్ జట్టు గురువారం జరిగిన సెమీఫైనల్లో కొలంబియాను 2-0తో ఓడించింది. దీంతో వరుసగా రెండోసారి కోపా అమెరికా ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది జరిగిన తుది పోరులోనూ ఈ రెండు జట్లే పోటీపడ్డాయి. మూడో స్థానం కోసం ఆదివారం జరిగే మ్యాచ్‌లో కొలంబియా, అమెరికాతో తలపడుతుంది. చిలీ తరఫున చార్లెస్ అరంగిజ్ (7వ నిమిషంలో), జోస్ పెడ్రో ఫ్యూంజలిడా (11) గోల్స్ సాధించారు.
అయితే ప్రథమార్ధం ముగిసిన అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఆటకు రెండున్నర గంటలు అంతరాయం ఏర్పడింది. ఓ దశలో మిగతా మ్యాచ్‌ను వాయిదా వేయాలని భావించినా వర్షం ఆగడంతో కొనసాగించారు. ఆట మొదలైన 11 నిమిషాలకే రెండు గోల్స్ చేసిన చిలీ ప్రథమార్ధం మొత్తం ఆధిపత్యం కనబరచింది. ద్వితీయార్ధంలో కొలంబియా స్టార్ రోడ్రిగ్వెజ్ మెరుపు ఆటను చూపినా చిలీ డిఫెన్స్‌ను అధిగమించలేకపోయాడు.