ఎదురులేని ఏసెస్ | Indian Aces eke out one-point win over defending champions Singapore Slammers | Sakshi
Sakshi News home page

ఎదురులేని ఏసెస్

Published Sun, Dec 4 2016 2:44 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

విజయానంతరం ఇండియన్ ఏసెస్ సభ్యుల సంబరం - Sakshi

విజయానంతరం ఇండియన్ ఏసెస్ సభ్యుల సంబరం

ఐపీటీఎల్-2016
టోక్యో: డిఫెండింగ్ చాంపియన్స్ సింగపూర్ స్లామర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇండియన్ ఏసెస్ విజయం సాధించింది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఏసెస్ 26-25 తేడాతో గట్టెక్కింది. ముందుగా నాలుగు విభాగాల్లో జరిగిన మ్యాచ్‌లు 2-2తో సమం కావడంతో చివరి మహిళల సింగిల్స్ కీలకంగా మారింది. దీంట్లో ఏసెస్ క్రీడాకారిణి కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌‌సకు గట్టి పోటీ ఎదురైనా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా షూట్‌అవుట్‌లో 6-5తో కికి బెర్టెన్స్‌పై గెలిచి జట్టుకు విజయాన్ని అందించింది. అంతకుముందు పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో స్లామర్స్ ఆటగాడు కార్లోస్ మోయా 6-4తో థామస్ ఎన్‌క్విస్ట్‌పై గెలిచారు.

ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో లోపెజ్ (ఏసెస్) 6-4తో బగ్దాటిస్‌పై నెగ్గి ఆధిక్యాన్ని సమం చేశాడు. పురుషుల డబుల్స్‌లో కిర్గియోస్-మెలో జోడీ (స్లామర్స్) 6-4తో డోడిగ్-లోపోజ్ జంటపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న (ఏసెస్) ద్వయం 6-4తో మెలో-బెర్టెన్‌‌స జోడీపై గెలిచి మ్యాచ్‌లో ఆసక్తి రేపింది. చివర్లో కిర్‌స్టెన్ విశేషంగా రాణించి ఏసెస్‌కు వరుసగా రెండో విజయాన్ని అందించింది. మరో మ్యాచ్‌లో జపాన్ వారియర్స్ 23-20తో యూఏఈ రాయల్స్‌పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement