రన్నరప్ ఇండియన్ ఏసెస్
విజేత సింగపూర్ స్లామర్స్
* ఫైనల్లో ఏసెస్‌పై గెలుపు
* ఐపీటీఎల్-2 సీజన్
సింగపూర్: లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ఇండియన్ ఏసెస్ జట్టు అంతిమ సమరంలో మాత్రం నిరాశపరిచింది. వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టైటిల్‌ను సాధించాలని ఆశించిన డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది.
ఆదివారం జరిగిన ఐపీటీఎల్-2 సీజన్ ఫైనల్లో ఇండియన్ ఏసెస్ 21-26 గేమ్‌ల తేడాతో సింగపూర్ స్లామర్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు భారత డబుల్స్ ప్లేయర్ పురవ్ రాజా కోచ్‌గా ఉన్న సింగపూర్ స్లామర్స్ జట్టు విజేతగా నిలిచి 10 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 63 లక్షలు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన ఇండియన్ ఏసెస్ జట్టుకు 5 లక్షల డాలర్ల (రూ. 3 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. పురుషుల విభాగంలో డోడిగ్ (ఏసెస్)... మహిళల విభాగంలో బెన్సిచ్ (స్లామర్స్) ‘అత్యంత విలువైన క్రీడాకారుల’ పురస్కారాన్ని అందుకున్నారు.
వీరిద్దరికీ 50 వేల డాలర్ల చొప్పున (రూ. 33 లక్షలు) అందజేశారు. లీగ్ దశలో అత్యధిక గేమ్‌లు గెలిచి టాపర్‌గా నిలిచిన ఇండియన్ ఏసెస్‌కు ఫైనల్లో నాదల్ (స్పెయిన్), రద్వాన్‌స్కా (పోలండ్)లాంటి స్టార్ క్రీడాకారులు అందుబాటులో లేకపోవడం విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో కార్లోస్ మోయా (స్లామర్స్) 6-4తో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్)ను ఓడించాడు.
మహిళల సింగిల్స్‌లో బెలిండా బెన్సిచ్ (స్లామర్స్) 6-5తో స్వెత్లానా కుజ్‌నెత్సోవా (ఏసెస్)పై గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-సానియా మీర్జా (ఏసెస్) ద్వయం 6-2తో బ్రౌన్-ప్లిస్కోవా (స్లామర్స్) జంటను ఓడించింది. దాంతో ఏసెస్ జట్టు ఓవరాల్‌గా 15-14తో ఒక్క గేమ్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకా (స్లామర్స్) 6-3తో టామిక్ (ఏసెస్)ను ఓడించాడు.
దాంతో సింగపూర్ జట్టు 20-18తో రెండు గేమ్‌ల ఆధిక్యాన్ని సంపాదించింది. నిర్ణాయక పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో వావ్రింకా-మెలో (స్లామర్స్) జంట 6-3తో బోపన్న-డోడిగ్ (ఏసెస్) జోడీని ఓడించడంతో సింగపూర్ ఓవరాల్‌గా 26-21తో విజయం సాధించింది.