రన్నరప్ ఇండియన్ ఏసెస్
టైటిల్ నిలబెట్టుకున్నసింగపూర్ స్లామర్స్
ఐపీటీఎల్-2016
సాక్షి, హైదరాబాద్: లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ‘తాన్లా’ ఇండియన్ ఏసెస్ జట్టు కీలక టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచింది. ఫలితంగా అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)-2016 సీజన్‌లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో సింగపూర్ స్లామర్స్ జట్టు 30-14తో ఇండియన్ ఏసెస్‌ను ఓడించి వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలిచింది. టైటిల్ పోరులో ఏసెస్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం గమనార్హం. ‘తాన్లా’ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరించిన ఇండియన్ ఏసెస్ జట్టు గత ఏడాది కూడా రన్నరప్‌గా నిలిచింది.
పురుషుల లెజెండ్‌స సింగిల్స్ మ్యాచ్‌లో కార్లోస్ మోయా 6-4తో ఫిలిప్పోసిస్‌ను ఓడించి స్లామర్స్‌కు శుభారంభం అందించాడు. మహిళల సింగిల్స్‌లో సానియా మీర్జా బరిలోకి దిగినా ఏసెస్‌కు ఫలితం లభించలేదు. కికి బెర్‌టెన్‌స 6-3తో సానియాను ఓడించి స్లామర్స్ ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-ఇవాన్ డోడిగ్ (ఏసెస్) ద్వయం 1-6తో బెర్‌టెన్‌స-మార్సెలో మెలో జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో కిరియోస్-మెలో (స్లామర్స్) జోడీ 6-2తో డోడిగ్-లోపెజ్ జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో బగ్ధాటిస్ (స్లామర్స్) 6-4తో ఫెలిసియానో లోపెజ్‌ను ఓడించడంతో ఏసెస్ పరాజయం పరిపూర్ణమైంది.