IPTL
-
రన్నరప్ ఇండియన్ ఏసెస్
టైటిల్ నిలబెట్టుకున్నసింగపూర్ స్లామర్స్ ఐపీటీఎల్-2016 సాక్షి, హైదరాబాద్: లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ‘తాన్లా’ ఇండియన్ ఏసెస్ జట్టు కీలక టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచింది. ఫలితంగా అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)-2016 సీజన్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో సింగపూర్ స్లామర్స్ జట్టు 30-14తో ఇండియన్ ఏసెస్‌ను ఓడించి వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలిచింది. టైటిల్ పోరులో ఏసెస్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం గమనార్హం. ‘తాన్లా’ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరించిన ఇండియన్ ఏసెస్ జట్టు గత ఏడాది కూడా రన్నరప్‌గా నిలిచింది. పురుషుల లెజెండ్స సింగిల్స్ మ్యాచ్‌లో కార్లోస్ మోయా 6-4తో ఫిలిప్పోసిస్ను ఓడించి స్లామర్స్‌కు శుభారంభం అందించాడు. మహిళల సింగిల్స్‌లో సానియా మీర్జా బరిలోకి దిగినా ఏసెస్‌కు ఫలితం లభించలేదు. కికి బెర్టెన్స 6-3తో సానియాను ఓడించి స్లామర్స్ ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-ఇవాన్ డోడిగ్ (ఏసెస్) ద్వయం 1-6తో బెర్టెన్స-మార్సెలో మెలో జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో కిరియోస్-మెలో (స్లామర్స్) జోడీ 6-2తో డోడిగ్-లోపెజ్ జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో బగ్ధాటిస్ (స్లామర్స్) 6-4తో ఫెలిసియానో లోపెజ్‌ను ఓడించడంతో ఏసెస్ పరాజయం పరిపూర్ణమైంది. -
ఇండియన్ ఏసెస్ జోరు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ ఐదో విజయాన్ని సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ 24-19తో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) జంట 6-5 (7/2)తో బగ్ధాటిస్-బెర్టెన్స (స్లామర్స్) జోడీని ఓడించింది. అంతకుముందు పురుషుల డబుల్స్‌లో డోడిగ్-లోపెజ్ (ఏసెస్) జంట 6-2తో బగ్ధాటిస్-మెలో జోడీపై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో ఫెలిసియానో లోపెజ్ (ఏసెస్) 6-0తో కిరియోస్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో ఫ్లిప్‌కెన్‌స (ఏసెస్) 2-6తో బెర్టెన్స చేతిలో ఓడిపోరుుంది. పురుషుల లెజెండ్స సింగిల్స్‌లో ఎన్క్విస్ట్ 4-6తో కార్లోస్ మోయా చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ఏసెస్ 17 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో జపాన్ వారియర్స్ 25-20తో యూఏఈ రాయల్స్‌ను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో సింగపూర్ స్లామర్స్‌తో జపాన్ వారియర్స్; యూఏఈ రాయల్స్‌తో ఇండియన్ ఏసెస్ తలపడతాయి. -
సిటీలో టెన్నిస్ సందడి
నేటి నుంచి ఐపీటీఎల్ మ్యాచ్‌లు తొలి మ్యాచ్‌లో వారియర్స్‌తో రాయల్స్ ఢీ సాక్షి, హైదరాబాద్: చలితో వణికిపోతున్న నగర వాసుల్ని అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) మ్యాచ్‌లు వేడెక్కించనున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్ స్టార్స్‌తో సిటీలో సందడి మొదలైంది. ఇండియన్ ఏసెస్ తరఫున హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా తొలిసారిగా సొంతగడ్డపై అదరగొట్టేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ అంచె పోటీలు నేటి నుంచి మూడు రోజుల పాటు గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో జరుగనున్నాయి. శుక్రవారం రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. తొలిపోరులో జపాన్ వారియర్స్‌తో యూఏఈ రాయల్స్ ఢీకొంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే రెండో పోరులో ఇండియన్ ఏసెస్‌తో సింగపూర్ స్లామర్స్ తలపడనుంది. ‘సానియా’ ఆకర్షణ... అంతర్జాతీయ టెన్నిస్‌లో ప్రస్తుతం డబుల్స్‌లో దూసుకెళ్తున్న హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా ఇక్కడ ప్రత్యేకాకర్షణ కానుంది. ఐపీటీఎల్‌లో ఆమె మూడోసారి బరిలోకి దిగుతున్నప్పటికీ సిటీలో మాత్రం ఇదే తొలిసారి. సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆమె సింగపూర్ స్లామర్స్‌తో తలపడనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. స్పోర్ట్స కల్చర్‌కు సిటీ చిరునామాగా మారుతోంది. మరీ ముఖ్యంగా ఇక్కడివారు టెన్నిస్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవుతారు. దాంతో పాటు ఎందరో ప్రతిభావంతులు వివిధ క్రీడల్లో అంతర్జాతీయస్థారుులో సత్తాచాటుతున్నారు’ అని తెలిపింది. జట్ల వివరాలు జపాన్ వారియర్స్: ఫెర్నాండెజ్ గొంజాలెజ్, జులి యన్ రోజర్, కి నిషికొరి, మారత్ సఫిన్, ఫెర్నాం డో వెర్డాస్కో, జెలెనా జంకోవిచ్, కురిమి నరా. యూఏఈ రాయల్స్: అనా ఇవనోవిచ్, ఇవానిసెవిచ్, పాబ్లో క్యూవస్, బెర్డిచ్, డానియెల్ నెస్టర్, మార్టినా హింగిస్, థామస్ జాన్సన్. ఇండియన్ ఏసెస్: సానియా మీర్జా, రోహన్ బోపన్న, లోపెజ్, కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌స, థామస్ ఎన్క్విస్ట్, ఇవాన్ డోడిగ్, మార్క్ ఫిలిప్పోసిస్. సింగపూర్ స్లామర్స్: కార్లోస్ మోయా, మార్సెలో మెలో, నిక్ కిరియోస్, కికి బెర్టెన్స, మార్కస్ బగ్ధాటిస్, రెయినర్ షుట్లర్. -
ఇండియన్ ఏసెస్‌కు షాక్
ఐపీటీఎల్-2016 టోక్యో: వరుసగా రెండు విజ యాలు సాధించి జోరుమీదున్న ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో తొలి ఓటమి ఎదురైంది. యూఏఈ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ జట్టు 20-30 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. పురుషుల లెజెండ్స తొలి సింగిల్స్‌లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఏసెస్) 3-6తో థామస్ జొహాన్సన్ చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో మార్టినా హింగిస్ 6-4తో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌స (ఏసెస్)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) జంట 4-6తో పాబ్లో క్యువాస్-హింగిస్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెలిసియానో లోపెజ్ (ఏసెస్) 3-6తో థామస్ బెర్డిచ్ చేతిలో ఓటమి చవిచూశాడు. బోపన్న-లోపెజ్ (ఏసెస్); క్యువాస్-నెస్టర్ జోడీల మధ్య జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్ 6-6తో టైగా ముగిసింది. తొలి దశ పోటీలు ముగిశాక యూఏఈ రాయల్స్, ఇండియన్ ఏసెస్ జట్లు ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. రెండో దశ పోటీలు సింగపూర్‌లో ఈనెల 6 నుంచి 8 వరకు జరుగుతాయి. నాలుగు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్‌లో లీగ్ పోటీలు ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు టైటిల్ కోసం తలపడతాయి. -
హైదరాబాద్‌లో ఫెడరర్, సెరెనా
-
హైదరాబాద్‌లో ఫెడరర్, సెరెనా
డిసెంబర్ 9 నుంచి ఐపీటీఎల్ టికెట్ ధర రూ. 15 వేలు హైదరాబాద్: నగరంలో పెద్ద స్థారుులో టెన్నిస్ పండుగకు రంగం సిద్ధమైంది. రోజర్ ఫెడరర్, సెరెనా విలియమ్స్లాంటి దిగ్గజాల ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం నగర అభిమానులకు దక్కనుంది. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పోటీలను తొలిసారి హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 9, 10 తేదీల్లో లీగ్ మ్యాచ్‌లతో పాటు 11న ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుంది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు కె.తారకరామారావుతో కలిసి ఐపీటీఎల్ ప్రమోటర్ మహేశ్ భూపతి టోర్నీ వివరాలు వెల్లడించారు. ఇందులో నాలుగు జట్లు ఇండియన్ ఏసెస్, జపాన్ వారియర్స్, యూఏఈ రాయల్స్, సింగపూర్ స్లామర్స్ పాల్గొంటున్నారుు. ఈ టోర్నీ గత రెండు సీజన్లలో భారత్‌లో మ్యాచ్‌లకు న్యూఢిల్లీ వేదిక కాగా... ఈ సారి హైదరాబాద్‌కు మార్చారు. టోర్నీని విజయవంతగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ‘ఇటీవల మహేశ్‌ను కలిసిన సందర్భంలో ఐపీటీఎల్ గురించి చర్చ జరిగింది. మా దగ్గర నిర్వహించమని నేనే ఆహ్వానించాను. ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనే ఈ టోర్నీని నిర్వహించే అవకాశం రావడం గొప్ప విషయం. మన వద్ద అనేక మంది చిన్నారులు దీని ద్వారా స్ఫూర్తి పొందుతారు. ఈ ఏడాదితో సరిపెట్టకుండా మున్ముందు కూడా నగరంలో మ్యాచ్‌లు కొనసాగాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్ అన్నారు. టీమ్ యజమానులతో చర్చించిన తర్వాత ఐదు నగరాలను పరిశీలించి చివరకు హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు భూపతి చెప్పారు. ప్రపంచ ఐదో ర్యాంక్ నిషికొరితో పాటు వెర్డాస్కో, బెర్డిచ్, ఇవనోవిచ్, హీతర్ వాట్సన్, కిర్గియోస్, డోడిగ్, సానియా మీర్జా తదితర అగ్రశ్రేణి 30 మంది ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. ఐపీటీఎల్ మూడు రోజులు కలిపి టికెట్ ధరను రూ. 15 వేలుగా నిర్ణరుుంచారు. విడిగా ఒక రోజు కోసం టికెట్లను అమ్మడం లేదు. మొత్తం రూ. 15 వేల టికెట్ కొని ఆసక్తి ఉన్న వేర్వేరు వ్యక్తులు దానిని బదిలీ చేసుకొని మ్యాచ్‌లు చూడవచ్చు. -
ఏసెస్‌కు షాక్
దుబాయ్: వరుస విజయాలతో జోరు మీదు న్న డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో రెండో పరాజయం ఎదురైంది. సింగపూర్ స్లామర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ జట్టు 16-27 గేమ్‌ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే లీగ్‌లో 257 గేమ్‌లతో లీగ్ పట్టికలో టాప్ ర్యాంక్‌లో ఉన్న ఏసెస్ జట్టు ఫైనల్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో 0-6తో కార్లోస్ మోయా చేతిలో ఓడిపోగా... మహిళల సింగిల్స్‌లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (ఏసెస్) 6-3తో బెలిండా బెన్సిచ్పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) ద్వయం 5-6తో బ్రౌన్-ప్లిస్కోవా జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో డోడిగ్-టామిక్ (ఏసెస్) జోడీ 4-6తో ఆండీ ముర్రే-మార్సెలో మెలో ద్వయం చేతిలో ఓటమి చెందగా... పురుషుల సింగిల్స్‌లో నిక్ కిరియోస్ 6-1తో బెర్నాడ్ టామిక్ (ఏసెస్)ను ఓడించి సింగపూర్ స్లామర్స్‌కు ఈ లీగ్‌లో ఆరో విజయాన్ని అందించాడు. -
ఎదురులేని ఏసెస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ఎదురులేకుండా దూసుకుపోతోంది. భారత్ అంచె పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 26-21తో జపాన్ వారియర్స్‌పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న జంట 6-4తో హెర్బట్-బరోని జోడీపై గెలవగా, మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా 6-2తో కురుమి నారాను ఓడించింది. అయితే పురుషుల డబుల్స్‌లో జపాన్ వారియర్స్ జోడి లియాండర్ పేస్-హెర్బట్ 6-5 (7/6)తో బోపన్న-డోడిగ్ (ఏసెస్)పై విజయం సాధించింది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-3తో థామస్ ఎన్క్విస్ట్ (జపాన్)ను చిత్తు చేయగా, పురుషుల సింగిల్స్‌లో హెర్బట్ (జపాన్) 6-3తో ఇవాన్ డోడిగ్ (ఏసెస్)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 30-22తో ఫిలిప్పీన్ మావెరిక్స్ గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూఈఏ రాయల్స్‌తో ఇండియన్ ఏసెస్ తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో నాదల్ (ఏసెస్)తో ఫెడరర్ (యూఏఈ రాయల్స్) ఆడే అవకాశముంది. -
ఇండియన్ ఏసెస్ శుభారంభం
ఐపీటీఎల్ సీజన్-2 కోబ్ (జపాన్): అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టు శుభారంభం చేసింది. జపాన్ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ 25-24 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) జంట 5-6తో షరపోవా-హెర్బర్ట్ (వారియర్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో షరపోవా 6-4తో సమంతా స్టోసుర్పై గెలిచింది. లెజెండ్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-2తో మరాత్ సఫిన్ (వారియర్స్)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-మోన్ఫిల్స్ (ఏసెస్) ద్వయం 6-4తో నిషికోరి-హెర్బర్ట్ జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో నిషికోరి 6-4తో మోన్ఫిల్స్పై గెలిచాడు. వారియర్స్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో నెగ్గినా... ఏసెస్ జట్టు ఎక్కువ గేమ్‌లు గెలిచినందుకు విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 26-20తో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది. సింగపూర్ స్లామర్స్ తరఫున ఆడాల్సిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఐపీటీఎల్ సీజన్-2 నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో ఆండీ ముర్రే, వావ్రింకా బరిలోకి దిగనున్నారు. -
ఐపీటీఎల్ నుంచి తప్పుకున్న మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ ఫ్రాంచైజీ నుంచి మైక్రోమ్యాక్స్ తప్పుకుంది. ఈ జట్టులో 60 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ ప్రస్తుత సీజన్ నుంచే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. తొలి సీజన్లో రూ.24 కోట్ల భారీ నష్టం రావడంతో మైక్రోమ్యాక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ‘ప్రస్తుతానికి ఐపీటీఎల్‌లో మాకు ఫ్రాంచైజీ హక్కులు లేవు. అయితే స్పాన్సర్‌గా కొనసాగుతాం’ అని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి శుభజిత్ సేన్ తెలిపారు. అయితే ఏ లీగ్‌లో అయినా ప్రారంభ సీజన్లో నష్టాలు రావడం సహజమేనని నిర్వాహకుడు మహేశ్ భూపతి తెలిపారు. తమకు రావాల్సిన రూ.18.5 కోట్ల బకాయిలను చెల్లించాల్సిందిగా మైక్రోమ్యాక్స్‌కు భూపతి లాయర్లు సెప్టెంబర్‌లో లీగల్ నోటీసులు పంపడంతో వ్యవహారం ముదిరింది. టిక్కెట్ల రేటు రూ.4 వేల నుంచి ప్రారంభం వచ్చే నెల 10 నుంచి 12 వరకు జరిగే భారత్ అంచె పోటీలు ఢిల్లీలో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల టిక్కెట్ల రేట్లు రూ.4 వేల నుంచి 48 వేల మధ్య ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆన్లైన్లో ఐపీటీఎల్‌వరల్డ్.కామ్, బుక్‌మైషో వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. -
కొహ్లీ టీమ్ లో ఫెదరర్
యూఏఈ రాయల్ ఫ్రాంఛైజీలో ప్రపంచ నంబర్ టూ టెన్సిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ చేరాడు. డిసెంబర్ 2 నుంచి ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్సిస్ లీగ్(ఐపీటీఎల్) రెండో సీజన్ లో ఫ్రాంఛైజీ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు దుబాయ్ లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఐపీటీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ భూపతి తెలిపాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ యూఏఈ రాయల్స్ కో ఓనర్ గావ్యవహరించనున్నాడు. నీలేష్ భట్నాకర్, సచిన్ గడోయా, ప్రవీణ్ భట్నాకర్ కొహ్లీ ప్రాంచైసీ భాగస్వాములు. టెన్సిస్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. రోజర్ ఫెదరర్ కి పెద్ద అభిమానినని..విరాట్ కొహ్లీ తెలిపాడు. ప్రొఫెషనల్ టెన్సిస్ లీట్ టీమ్ లో భాగస్వామి కావడం సంతోషంగా ఉంది విరాట్ కొహ్లీ అన్నాడు. ఐపీటీఎల్2015 కోసం రాయల్స్ టీమ్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించాడు. కాగా డిసెంబర్ రెండు నుంచి 20 దాకా ఐపీటీఎల్ సీజన్ 2 టోర్నీ సాగనుంది. -
ఈసారి ఫెడరర్, నాదల్ పోరు
న్యూఢిల్లీ: ఈసారి జరిగే అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టాప్ ఆటగాళ్లతో భారీ స్థాయిలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 2 నుంచి 20 వరకు జరిగే ఈ లీగ్‌లో చిరకాల ప్రత్యర్థులు రోజర్ ఫెడరర్, రఫెల్ నాదల్ తమ ఆటతో అభిమానులను అలరించనున్నారు. డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ తరఫున నాదల్ బరిలోకి దిగబోతుండగా యూఏఈ రాయల్స్ నుంచి ఫెడరర్ ఆడుతున్నాడు. తొలి సీజన్లో ఫెడరర్ ఇండియన్ ఏసెస్ తరఫున ఆడగా ఈసారి జట్టు మారాడు. వీరిద్దరి మధ్య జరిగే సమరాన్ని భారత అభిమానులు వీక్షిం చే అవకాశం ఉంది. డిసెంబర్ 12న ఢిల్లీలో యూఏఈతో జరిగే మ్యాచ్‌లో ఈ ఇద్దరు టాప్ ఆటగాళ్లు ఆడతారు. ఇక భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కూడా రెండో సీజన్లో అరంగేట్రం చేయనున్నాడు. జపాన్ వారియర్స్ తరఫున తను సత్తా చూపనున్నాడు. ‘తొలి సీజన్లో అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్ల ఆటను ఆసియాలోని వివిధ నగరాల్లో అభిమానులు చూశారు. కొత్త ఫార్మాట్లో జరిగిన ఈ లీగ్‌ను అంతా ఎంతగానో ఆదరించారు. ఈసారి కూడా ఇంకా భారీ స్థాయిలో రాబోతుంది. పేస్ రాక లీగ్‌కు అదనపు బలాన్ని చేకూర్చుతుంది’ అని టోర్నీ ఎండీ మహేశ్ భూపతి తెలిపారు. -
ఐపీటీఎల్‌లో పేస్!
చెన్నై : గతేడాది ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)పై విమర్శలు కురిపించిన భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ మనసు మార్చుకున్నాడు. ఈ సీజన్‌కు తను అందుబాటులో ఉంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈనెల 12న లీగ్ కోసం ఆటగాళ్ల ఎంపిక జరగనున్న నేపథ్యంలో పేస్ అందుబాటులో ఉంటాననడం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే గత సీజన్లో సింగపూర్, మనీలా, న్యూఢిల్లీ, దుబాయ్ జట్లు మాత్రమే బరిలోకి దిగాయి. కానీ ఈసారి ఐదో జట్టుగా బ్యాంకాక్, మకావ్ సిటీ, కౌలాలంపూర్, జకార్తా, టోక్యోలలో ఒకదాన్ని ఎంపిక చేయనున్నారు. గతేడాది ఏప్రిల్‌లో మహేశ్ భూపతి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఐపీటీఎల్‌పై పేస్ అనేక అనుమానాలు వ్యక్తం చేశాడు. లీగ్‌లో పారదర్శకత లేదని, ఎక్కువకాలం కొనసాగడం కష్టమేనని వ్యాఖ్యానించాడు. అయితే ఫెడరర్, జొకోవిచ్, సంప్రాస్, సెరెనా బరిలోకి దిగడంతో లీగ్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు లీగ్ విషయంలో కాస్త వెనక్కి తగ్గిన పేస్ ఇప్పుడు 2015 సీజన్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించడం విశేషం. -
ఐపీటీఎల్ చాంప్ ఇండియన్ ఏసెస్
దుబాయ్: తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టు విజేతగా అవతరించింది. శనివారంతో ముగిసిన ఈ లీగ్‌లో ఏసెస్ జట్టు 39 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం నాలుగు నగరాల్లో నాలుగు అంచెలుగా జరిగిన ఈ లీగ్‌లో సానియా మీర్జా, రోహన్ బోపన్న, మోన్ఫిల్స్, అనా ఇవనోవిచ్, సెడ్రిక్ పియోలిన్, రోజర్ ఫెడరర్, పీట్ సంప్రాస్, ఫాబ్రిస్ సాంతోరోలతో కూడిన ఏసెస్ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిదింటిలో గెలిచింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. యూఈఏ రాయల్స్ 37 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... 35 పాయింట్లతో మనీలా మావెరిక్స్ మూడో స్థానంలో నిలిచింది. 24 పాయింట్లతో సింగపూర్ స్లామర్స్ చివరిదైన నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. యూఏఈ రాయల్స్‌తో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ జట్టు 15-29 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-5తో మ్లాడెనోవిచ్‌ను ఓడించి ఏసెస్‌కు శుభారంభం అందించింది. అయితే తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఏసెస్ జట్టుకు ఓటమి ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జంట 2-6తో జిమోనిచ్-మ్లాడెనోవిచ్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌లో పియోలిన్-మోన్ఫిల్స్ ద్వయం 2-6తో జిమోనిచ్-ఇవానిసెవిచ్ జంట చేతిలో ఓడింది. లెజెండ్ సింగిల్స్‌లో పియోలిన్ 5-6తో ఇవానిసెవిచ్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. చివరి మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ 6-0తో మోన్ఫిల్స్ను చిత్తు చేశాడు. విజేతగా నిలిచిన ఏసెస్ జట్టుకు 10 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
దుబాయ్‌లోనూ అదే ఊపు
సింగపూర్ స్లామర్స్‌పై ఇండియన్ ఏసెస్ గెలుపు ఐపీటీఎల్ దుబాయ్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళుతోంది. గురువారం ప్రారంభమైన దుబాయ్ అంచె తొలి పోటీలో ఏసెస్ 28-24తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది. దీంతో 34 పాయింట్లతో ఏసెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ మినహా అన్ని మ్యాచ్‌లను ఏసెస్ గెల్చుకోవడం విశేషం. ముందుగా మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-5తో హంటుచోవాపై నెగ్గింది. ఆ తర్వాత పురుషుల లెజెండ్స్‌లో సాంటోరో 6-3తో ప్యాట్రిక్ రాఫ్టర్పై గెలువగా... మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా జంట 6-5తో సోర్స్-హంటుచోవాపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో మోన్ఫిల్స్-బోపన్న 6-3తో హెవిట్-సోర్స్‌పై నెగ్గి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించారు. అయితే చివరి మ్యాచ్ అయిన పురుషుల సింగిల్స్‌లో మోన్ఫిల్స్ 4-8తో బెర్డిచ్ చేతిలో ఓడాడు. -
భారత గడ్డపై తొలి మ్యాచ్ కు ఫెదరర్ సిద్ధం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపీటీఎల్)లో భాగంగా టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్(33) భారత్ కు చేరుకున్నాడు. పదిహేడు గ్రాండ్ స్లామ్ లు గెలిచిన ఫెదరర్ భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే డిసెంబర్ 6 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకూ భారత్ లో ఐపీటీఎల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత గడ్డపై తొలి మ్యాచ్ ను ఆడుతుండట పట్ల ఫెదరర్ సంతోషంగా వ్యక్తం చేశాడు. తాను భారత్ కు చేరుకున్నట్లు ఫెదరర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ సందర్భంగా 14 గ్రాండ్ స్లామ్ లు గెలిచిన పీట్ సంప్రాస్ తో కలసి ఉన్న ఒక స్మైలింగ్ ఫోటోను పోస్ట్ చేశాడు. భారత టీం నుంచి ఫెదరర్ తో పాటు, పీట్ సాంప్రస్, గ్యాల్ మోన్ ఫిల్స్, అనా ఇవానిక్, సానియా మీర్జా, రోహన్ బోపన్నా తదితరులు పాల్గొంటున్నారు. నవంబరు 28 వ తేదీన ఆరంభమైన ఈ టోర్నీ.. మనాలీయా, సింగపూర్, దుబాయ్ దేశాలతో పాటు భారత్ లో జరుగుతోంది. -
ఫెడరర్ షో
నేటి నుంచి ఢిల్లీలో ఐపీటీఎల్ న్యూఢిల్లీ: ఇప్పటిదాకా టీవీల్లోనే చూసిన టెన్నిస్ స్టార్స్ రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్‌ల ఆటతీరును ఇక భారత అభిమానులు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కలగనుంది. ఫిలిప్పీన్స్, సింగపూర్‌లో విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) మూడో అంచె పోటీలు నేటి (శనివారం) నుంచి ఢిల్లీలో జరుగనున్నాయి. ఇప్పటిదాకా పోటీలకు దూరంగా ఉన్న ఫెడరర్, జొకోవిచ్ తొలిసారిగా తమ జట్ల తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఇండియన్ ఏసెస్ తరఫున ఫెడరర్, యూఏఈ రాయల్స్ తరఫున నొవాక్ జొకోవిచ్ అభిమానులను అలరించనున్నారు. సోమవారం వరకు భారత్‌లో ఐపీటీఎల్ జరుగుతుంది. ఇండియన్ ఏసెస్ ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ‘ఫెడరర్, జొకోవిచ్, సంప్రాస్ల కోసం భారత అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారు కూడా ఇక్కడికి రావడానికి ఉత్సుకతతో ఉన్నారు. ఫెడరర్ కేవలం భారత్‌లో జరిగే పోటీలకు మాత్రమే హాజరుకానున్నాడు. దుబాయ్‌లో జరిగే చివరి లెగ్‌కు అందుబాటులో ఉండడు’ అని టోర్నీ నిర్వాహకుడు మహేశ్ భూపతి తెలిపారు. ఫెడరర్ చివరిసారిగా 2006లో యూనిసెఫ్ తరఫున భారత్‌కు వచ్చాడు. దిగ్గజం ఫెడరర్‌తో కలిసి ఆడాలన్న సానియా కల నిజం కాబోతుంది. ఆదివారం, సోమవారం జరిగే మిక్స్డ్ డబుల్స్‌లో ఫెడరర్, సానియా జతగా బరిలోకి దిగనున్నారు. ఫెడరర్‌తో కలిసి ఆడే అవకాశం రావడంపట్ల సానియా అమితానందం వ్యక్తం చేసింది. -
ఏసెస్‌కు తొలి ఓటమి
ఐపీటీఎల్ సింగపూర్: వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో తొలి ఓటమి ఎదురైంది. హోరాహోరీగా సాగిన లీగ్ మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 24-23తో ఏసెస్ జట్టును ఓడించింది. నిర్ణీత ఐదు మ్యాచ్‌ల తర్వాత రెండు జట్ల స్కోరు 23-23 వద్ద సమం అయింది. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘సూపర్ షూటౌట్’ను నిర్వహించారు. గేల్ మోన్ఫిల్స్ (ఏసెస్), బెర్డిచ్ (సింగపూర్ స్లామర్స్) మధ్య జరిగిన ఈ షూటౌట్లో బెర్డిచ్ తొలుత ఆరు పాయింట్లు సాధించి విజేతగా నిలువడంతో సింగపూర్ విజయం ఖాయమైంది. అంతకుముందు మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ (సింగపూర్) 6-4తో అనా ఇవనోవిచ్ (ఏసెస్)ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) ద్వయం 6-3తో సెరెనా-బ్రూనో సోరెస్ జంటపై గెలిచింది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-2తో ఆండ్రీ అగస్సీ (సింగపూర్)పై నెగ్గాడు. పురుషుల సింగిల్స్‌లో బెర్డిచ్ (సింగపూర్) 6-2తో గేల్ మోన్ఫిల్స్ (ఏసెస్)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో లీటన్ హెవిట్-నిక్ కియోర్గిస్ (సింగపూర్) జోడీ 6-5తో రోహన్ బోపన్న-గేల్ మోన్ఫిల్స్ (ఏసెస్) జంటను ఓడించింది. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 26-21తో మనీలా మావెరిక్స్పై గెలిచింది. ప్రస్తుతం ఇండియన్ ఏసెస్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 15 పాయింట్లతో యూఏఈ రాయల్స్ రెండో స్థానంలో, 13 పాయింట్లతో మనీలా మావెరిక్స్ మూడో స్థానంలో, 10 పాయింట్లతో సింగపూర్ స్లామర్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. హెవిట్-కిర్గియోస్ జోడీ తమ విజయాన్ని ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిల్ హ్యూస్కు అంకితం ఇచ్చింది. -
నేటి నుంచి ఐపీటీఎల్
మనీలా (ఫిలిప్పిన్స్): అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (ఐపీటీఎల్)కు రంగం సిద్ధమైంది. మనీలాలో ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ల మధ్య నేడు జరిగే మ్యాచ్‌తో లీగ్‌కు తెర లేవనుంది. భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టులో ఫెడరర్‌తో పాటు సానియా మీర్జా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అయితే తొలి అంచె పోటీల్లో ఫెడరర్ పాల్గొనడం లేదు. -
ఫెడరర్ ఆడతాడు: భూపతి
సింగపూర్: వెన్నునొప్పితో బాధపడుతున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్... అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఆడతాడని లీగ్ మేనేజింగ్ డెరైక్టర్ మహేశ్ భూపతి తెలిపాడు. లీగ్ సమయానికి అతను పూర్తిస్థాయిలో కోలుకుంటాడన్నాడు. ‘ఫెడరర్‌కు సంబంధించిన వారితో మాట్లాడా. అతను బాగానే ఉన్నాడు. ఈ వారాంతంలో డేవిస్ కప్‌లో ఆడనున్నాడు’ అని భూపతి వెల్లడించాడు. మూడు వారాల పాటు నాలుగు దేశాల్లో జరిగే ఈ టోర్నీ వచ్చే వారం మనీలాలో ప్రారంభంకానుంది. అభిమానులను అలరించే విధంగా ఈ లీగ్ ఫార్మాట్‌ను రూపొందిస్తున్నామని భూపతి పేర్కొన్నాడు. కచ్చితమైన మ్యాచ్ సమయాలు, చీర్‌లీడర్స్, డీజేలతో ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నాడు. 2020 నాటికి ఆసియా ప్రాంతంలో ఈ టోర్నీని 8 జట్లు ఉండేలా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు చెప్పాడు. చైనా, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్‌లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించాడు. అంతకంటే ముందు ఆరంభ లీగ్ విజయవంతమయ్యేలా చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు. -
సచిన్‌ను మళ్లీ కలుస్తా!
న్యూఢిల్లీ: టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ మరోసారి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలవాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌కు రానున్న ఫెడరర్, తనకున్న కొద్దిపాటి సమయంలో సచిన్‌తో భేటీ కావాలనుకుంటున్నట్లు రోజర్ ఏజెంట్ టోనీ గాడ్సిక్ వెల్లడించారు. ‘గతంలో వింబుల్డన్ సందర్భంగా వీరిద్దరు రెండు సార్లు కలిశారు. ఇప్పుడు కూడా అతను సచిన్‌తో ముచ్చటించాలని అనుకుంటున్నాడు. ఫెడరర్‌కు కూడా క్రికెట్‌పై కూడా ఆసక్తి ఉంది. అతని తల్లి దక్షిణాఫ్రికా జాతీయురాలు కావడంతో పాటు, తొలి కోచ్ ఆస్ట్రేలియా వ్యక్తి కావడం రోజర్‌కు క్రికెట్ గురించి తెలుసుకునేలా చేసింది’ అని టోనీ తెలిపాడు త్వరలో ఆరంభం కానున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపీటీఎల్)కు భారత్ ఏస్ కు ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ విజేత రోజర్ ఫెదరర్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. రఫెల్ నాదల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ అవకాశం ఫెదరర్ ను వరించింది.నవంబరు 28 వ తేదీన ఆరంభం కానున్న ఈ టోర్నీ.. మనాలీయా, సింగపూర్, దుబాయ్ దేశాల్లో జరుగునుంది. భారత్ లో డిసెంబర్ 6-8 తేదీల మధ్య జరుగుతుంది. -
ఐపీటీఎల్ లో భారత్ కు ఫెదరర్ ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ:త్వరలో ఆరంభం కానున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపీటీఎల్)కు భారత్ తరుపున ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ విజేత రోజర్ ఫెదరర్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటి వరకూ ఇండియన్ ఫ్రాంచైజీ తరుపున రఫెల్ నాదల్ బరిలోకి దిగుతాడని భావించినా.. అతను మోకాలి గాయం కారణంగా ఈ లీగ్ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఆ అవకాశం రోజర్ ఫెదరర్ ను వరించింది. భారత్ తరుపున ఫెదరర్ బరిలో దిగుతున్నట్లు ఫ్రాంచైజీ మైక్రోమ్యాక్స్ సోమవారం స్పష్టం చేసింది. భారత టీం నుంచి ఫెదరర్ తో పాటు, పీట్ సాంప్రస్, గ్యాల్ మోన్ ఫిల్స్, అనా ఇవానిక్, సానియా మీర్జా, రోహన్ బోపన్నా తదితరులు రంగంలో దిగనున్నారు. నవంబరు 28 వ తేదీన ఆరంభం కానున్న ఈ టోర్నీ.. మనాలీయా, సింగపూర్, దుబాయ్ దేశాల్లో జరుగునుంది. భారత్ లో డిసెంబర్ 6-8 తేదీల మధ్య జరుగుతుంది.