ఎదురులేని ఏసెస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ఎదురులేకుండా దూసుకుపోతోంది. భారత్ అంచె పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 26-21తో జపాన్ వారియర్స్‌పై నెగ్గింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న జంట 6-4తో హెర్బట్-బరోని జోడీపై గెలవగా, మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా 6-2తో కురుమి నారాను ఓడించింది.
అయితే పురుషుల డబుల్స్‌లో జపాన్ వారియర్స్ జోడి లియాండర్ పేస్-హెర్బట్ 6-5 (7/6)తో బోపన్న-డోడిగ్ (ఏసెస్)పై విజయం సాధించింది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-3తో థామస్ ఎన్‌క్విస్ట్ (జపాన్)ను చిత్తు చేయగా, పురుషుల సింగిల్స్‌లో హెర్బట్ (జపాన్) 6-3తో ఇవాన్ డోడిగ్ (ఏసెస్)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 30-22తో ఫిలిప్పీన్ మావెరిక్స్ గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూఈఏ రాయల్స్‌తో ఇండియన్ ఏసెస్ తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో నాదల్ (ఏసెస్)తో ఫెడరర్ (యూఏఈ రాయల్స్) ఆడే అవకాశముంది.