ఏసెస్‌కు తొలి ఓటమి
ఐపీటీఎల్
సింగపూర్: వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో తొలి ఓటమి ఎదురైంది. హోరాహోరీగా సాగిన లీగ్ మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 24-23తో ఏసెస్ జట్టును ఓడించింది. నిర్ణీత ఐదు మ్యాచ్‌ల తర్వాత రెండు జట్ల స్కోరు 23-23 వద్ద సమం అయింది. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘సూపర్ షూటౌట్’ను నిర్వహించారు. గేల్ మోన్‌ఫిల్స్ (ఏసెస్), బెర్డిచ్ (సింగపూర్ స్లామర్స్) మధ్య జరిగిన ఈ షూటౌట్‌లో బెర్డిచ్ తొలుత ఆరు పాయింట్లు సాధించి విజేతగా నిలువడంతో సింగపూర్ విజయం ఖాయమైంది. అంతకుముందు మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ (సింగపూర్) 6-4తో అనా ఇవనోవిచ్ (ఏసెస్)ను ఓడించింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) ద్వయం 6-3తో సెరెనా-బ్రూనో సోరెస్ జంటపై గెలిచింది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-2తో ఆండ్రీ అగస్సీ (సింగపూర్)పై నెగ్గాడు. పురుషుల సింగిల్స్‌లో బెర్డిచ్ (సింగపూర్) 6-2తో గేల్ మోన్‌ఫిల్స్ (ఏసెస్)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో లీటన్ హెవిట్-నిక్ కియోర్గిస్ (సింగపూర్) జోడీ 6-5తో రోహన్ బోపన్న-గేల్ మోన్‌ఫిల్స్ (ఏసెస్) జంటను ఓడించింది. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 26-21తో మనీలా మావెరిక్స్‌పై గెలిచింది. ప్రస్తుతం ఇండియన్ ఏసెస్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 15 పాయింట్లతో యూఏఈ రాయల్స్ రెండో స్థానంలో, 13 పాయింట్లతో మనీలా మావెరిక్స్ మూడో స్థానంలో, 10 పాయింట్లతో సింగపూర్ స్లామర్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. హెవిట్-కిర్గియోస్ జోడీ తమ విజయాన్ని ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిల్ హ్యూస్‌కు అంకితం ఇచ్చింది.