International Premier Tennis League
-
ఇండియన్ ఏసెస్‌ను గెలిపించిన లోపెజ్
సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు నాలుగో విజయం సాధించింది. సింగపూర్ స్లామర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 23-22తో గెలిచింది. ఏసెస్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్ డబుల్స్‌తోపాటు సింగిల్స్ మ్యాచ్‌లో నెగ్గి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. డబుల్స్‌లో లోపెజ్-డోడిగ్ ద్వయం 6-5 (7/6)తో బగ్ధాటిస్-మెలో జంటపై నెగ్గగా... సింగిల్స్‌లో లోపెజ్ 6-5 (7/4)తో కిరియోస్‌ను ఓడించాడు. అంతకుముందు మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జంట 6-0తో కిరియోస్-బెర్టెన్స జోడీని ఓడించింది. లెజెండ్స సింగిల్స్‌లో ఫిలిప్పోసిస్ (ఏసెస్), మహిళల సింగిల్స్‌లో బెర్టెన్స (ఏసెస్) తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఏసెస్ 14 పారుుంట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ అంచె పోటీలు జరుగుతాయి -
కనీస టికెట్ ధర రూ. 6 వేలు
నగరంలో ఐపీటీఎల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: నగరంలో తొలిసారి ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టికెట్ ధరలను నిర్వాహకులు ప్రకటించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 9,10 తేదీల్లో లీగ్ మ్యాచ్‌లు, 11న ఫైనల్ జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఒక రోజు మ్యాచ్ టికెట్ కనీస ధర రూ. 6 వేలుగా నిర్ణయించారు. మూడు రోజులకు కలిపి సీజన్ టికెట్ కనీసం రూ. 15 వేలుగా ఉంది. వేర్వేరు కేటగిరీల్లో రూ. 35 వేలు, రూ. 42 వేలు, రూ. 81 వేలు విలువ గల టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభిమానులు kyazoonga.com సైట్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో ప్రేక్షకుల కోసం టికెట్లు అమ్మకానికి ఉన్నాయి. బేగంపేటలోని క్యాజూంగా కార్యాలయం అవుట్ లెట్, 10 డౌనింగ్ స్ట్రీట్, ఎంజీ రోడ్ ఇండియానా స్పోర్ట్సలో ఇవి లభిస్తాయి. టోర్నీలో ఇండియన్ ఏసెస్, జపాన్ వారియర్స్, సింగపూర్ స్లామర్స్, యూఏఈ రాయల్స్ పాల్గొంటున్నాయి. -
ఇండియన్ ఏసెస్ శుభారంభం
ఐపీటీఎల్ -2016 సైటమ (జపాన్): ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) తాజా సీజన్‌ను ఇండియన్ ఏసెస్ విజయంతో ప్రారంభించింది. శుక్రవారం జపాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-17 తేడాతో సునాయాసంగా నెగ్గింది. ముందుగా జరిగిన మహిళల సింగిల్స్‌లో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌స 6-2 తేడాతో కురుమి నరాపై గెలిచింది. ఆ తర్వాత హోరాహోరీగా సాగిన మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-సానియా మీర్జా జోడి 6-5తో రోజర్-జంకోవిచ్ జంటపై నెగ్గింది. పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో ఫిలిప్పోసిస్ 6-3తో మరాత్ సఫిన్పై, పురుషుల డబుల్స్‌లో దోడిగ్-లోపెజ్ జోడీ 6-2తో రోజర్-వెర్డాస్కో జంటపై, పురుషుల సింగిల్స్‌లో ఫెలిసియానో లోపెజ్ 6-5తో వెర్డాస్కోపై గెలిచి జట్టుకు విజయాన్ని అందించారు. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 29-19తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది -
ఆసియా టెన్నిస్ టూర్ ఆవిష్కరణ
దోహా: ఆసియా ఖండంలోని వర్ధమాన టెన్నిస్ ఆట గాళ్ల అభివృద్ధి కోసం ఓ కొత్త వేదిక ఏర్పాటయ్యింది. కేవలం ఆసియాలోని దేశాలకు చెందిన యువ ఆటగాళ్లు మాత్రమే పోటీ పడేందుకు ఆసియన్ టెన్నిస్ టూర్ (ఏటీటీ)ను ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన ఆసియా టెన్నిస్ సమాఖ్య (ఏటీఎఫ్) బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో ఏటీటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 18 నుంచి ఏటీటీ తొలి పోటీలు ఢిల్లీలో జరుగుతాయి. ఈ టోర్నీలో ఆడి గెలిచినందుకు ఆటగాళ్లకు ఎలాంటి ర్యాంకింగ్స్ పాయింట్లు లభించకున్నా డబ్బులు మాత్రం అందుతాయి. ఏటీటీలో టాప్-5 ఆటగాళ్లుగా నిలిచినవారు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)తో పర్యటించే అవకాశం లభిస్తుంది. రెండు విభాగాలుగా ఈ ఈవెంట్ జరుగుతుంది. -
స్లామర్స్‌తో ఏసెస్ అమీతుమీ
నేడు ఐపీటీఎల్-2 టైటిల్ పోరు మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం సింగపూర్: వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఇండియన్ ఏసెస్... తొలిసారి విజేతగా అవతరించాలనే పట్టుదలతో సింగపూర్ స్లామర్స్... ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఆదివారం ఐపీటీఎల్-2 టైటిల్ పోరు జరగనుంది. శనివారంతో రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. లీగ్ మ్యాచ్‌ల తర్వాత ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ 21-27 గేమ్‌ల తేడాతో సింగపూర్ స్లామర్స్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఫిలిప్పీన్ మావెరిక్స్ 24-23 గేమ్‌ల తేడాతో యూఏఈ రాయల్స్ జట్టును ఓడించింది. -
రాయల్స్‌ను ఆదుకున్న ఫెడరర్
సింగపూర్: స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన అద్భుత ఆటతీరుతో యూఏఈ రాయల్స్‌ను ఆదుకున్నాడు. దీంతో అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్‌ను 27-23 తేడాతో యూఏఈ ఓడించింది. కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న తమ జట్టును... చివరి సింగిల్స్‌లో ఫెడరర్ 6-4 తేడాతో వావ్రింకాను ఓడించి గట్టెక్కించాడు. అంతకుముందు మ్యాచ్‌ల్లో ఇవాన్‌సెవిచ్ (రాయల్స్) 6-4తో కార్లోస్ మోయా (స్లామర్స్)ను, మహిళల సింగిల్స్‌లో మ్లదెనోవిక్ (రాయల్స్) నెగ్గగా.. మిక్స్డ్ డబుల్స్‌లో డస్టిన్ బ్రౌన్, ప్లిస్కోవా (స్లామర్స్) జోడి ఫెడరర్, మదెనోవిక్ను ఓడించడంతో స్కోరు 15-15తో సమమైంది. అయితే పురుషుల డబుల్స్‌లో ఫెడరర్, నెస్టర్ 6-4తో వావ్రింకా, మార్సెలో మెలోను ఓడించడంతో రెండు పాయింట్ల ఆధిక్యం పొందింది. ఇక చివరి మ్యాచ్‌లో ఫెడరర్ సత్తా చాటి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇతర మ్యాచ్‌లో జపాన్ వారియర్స్ 29-15తో ఫిలిప్పై న్స్ మావెరిక్స్‌ను ఓడించింది. పురుషుల సిం గిల్స్‌లో సఫిన్ (వారియర్స్) 6-3తో బ్లాక్‌ను ఓడించి వారియర్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కురుమి (వారియర్స్) 6-1తో గజ్దోసోవాపై.. మిక్స్డ్ డబుల్స్‌లో పేస్, బరోని జంట 6-2తో గజ్దోసోవా, రోజర్ వాసెలిన్పై గెలిచారు. పురుషుల డబుల్స్‌లో మావెరిక్ జోడి వాసెలిన్, ట్రీట్ హ్యూ 6-5తో పేస్, లూసిక్పై గెలిచినా.. చివరి పురుషుల సింగిల్స్ లో హెర్బట్ 6-3తో కార్లోవిచ్‌ను ఓడించి వారి యర్స్‌కు రెండో విజయాన్ని అందించాడు. -
ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’
మనీలా (ఫిలిప్పీన్స్): అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. యూఏఈ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ జట్టు 30-18 గేమ్‌ల తేడాతో నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఆడిన ఐదు సెట్లలోనూ ఏసెస్ జట్టుకు విజయం దక్కడం విశేషం. మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా మీర్జా (ఏసెస్) ద్వయం 6-4తో నెస్టర్-మ్లాడెనోవిచ్ (రాయల్స్) జోడీపై... మహిళల సింగిల్స్‌లో సమంత స్టోసుర్ (ఏసెస్) 6-3తో మ్లాడెనోవిచ్ (రాయల్స్)పై... పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో సాంతోరో 6-3తో ఇవానిసెవిచ్ (రాయల్స్)పై... పురుషుల డబుల్స్‌లో నాదల్-డోడిగ్ (ఏసెస్) జోడీ 6-3తో నెస్టర్-బెర్డిచ్ జంటపై... పురుషుల సింగిల్స్‌లో నాదల్ (ఏసెస్) 6-4తో బెర్డిచ్ (రాయల్స్)పై గెలిచారు. -
ఏసెస్‌కు వరుసగా రెండో విజయం
కోబ్ (జపాన్): ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియన్ ఏసెస్ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ 27-22తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది. లెజెండరీ సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కార్లోస్ మోయా (స్లామర్స్) 6-5తో ఫ్యాబ్రిస్ సంటారో (ఏసెస్)పై గెలుపొందగా... మహిళల సింగిల్స్‌లో కరోలినా ప్లిస్కోవా (స్లామర్స్) 6-4తో సమంతా స్టోసుర్ (ఏసెస్)ను ఓడించింది. అయితే పురుషుల డబుల్స్‌లో డుడిగ్-బోపన్న (ఏసెస్) జోడి 6-4తో మార్సెలో మెలో-బ్రౌన్ (స్లామర్స్)పై; మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-డుడిగ్ (ఏసెస్) ద్వయం 6-3తో కిర్గియోస్-బెనిచ్ (స్లామర్స్)పై గెలిచారు. ఇక నిర్ణయాత్మక పురుషుల సింగిల్స్‌లో డుడిగ్ (ఏసెస్) అద్భుతంగా ఆడి 6-2తో కిర్గియోస్ (స్లామర్స్)పై నెగ్గడంతో ఏసెస్ 27-22తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఫిలిప్పిన్ మావెరిక్ 28-24తో జపాన్ వారియర్స్‌ను ఓడించింది. -
ఇండియన్ ఏసెస్ శుభారంభం
ఐపీటీఎల్ సీజన్-2 కోబ్ (జపాన్): అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టు శుభారంభం చేసింది. జపాన్ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ 25-24 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) జంట 5-6తో షరపోవా-హెర్బర్ట్ (వారియర్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో షరపోవా 6-4తో సమంతా స్టోసుర్పై గెలిచింది. లెజెండ్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-2తో మరాత్ సఫిన్ (వారియర్స్)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-మోన్ఫిల్స్ (ఏసెస్) ద్వయం 6-4తో నిషికోరి-హెర్బర్ట్ జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో నిషికోరి 6-4తో మోన్ఫిల్స్పై గెలిచాడు. వారియర్స్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో నెగ్గినా... ఏసెస్ జట్టు ఎక్కువ గేమ్‌లు గెలిచినందుకు విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 26-20తో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది. సింగపూర్ స్లామర్స్ తరఫున ఆడాల్సిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఐపీటీఎల్ సీజన్-2 నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో ఆండీ ముర్రే, వావ్రింకా బరిలోకి దిగనున్నారు. -
ఐపీటీఎల్‌లో విరాట్ కోహ్లి
యూఏఈ రాయల్స్‌లో వాటా దుబాయ్ : భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చూపు ఇప్పుడు టెన్నిస్‌పై పడింది. ఇప్పటికే తను ఇండియన్ సూపర్ లీగ్‌లో ఎఫ్‌సీ గోవా జట్టుకు సహ యజయానిగా కొనసాగుతుండగా... తాజాగా అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లోనూ అడుగుపెట్టాడు. స్విస్ దిగ్గజం ఫెడరర్‌ను అమితంగా అభిమానించే కోహ్లి ఈ లీగ్‌లో అతడు ఆడే జట్టు యూఏఈ రాయల్స్‌లోనే వాటా తీసుకున్నాడు. ‘నేను టెన్నిస్‌ను చాలా ఆసక్తిగా గమనిస్తుంటాను. ఇప్పుడు ప్రొఫెషనల్ టెన్నిస్ లీగ్‌లో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. ఫెడరర్‌తో పాటు మా జట్టులో చాలా పెద్ద ఆటగాళ్లున్నారు. ఈ ఫార్మాట్ చాలా బాగుండడంతో ఎక్కువ మందిని ఆకర్షిస్తుందని భావిస్తున్నాను’ అని కోహ్లి తెలిపాడు. డిసెంబర్ 2న జపాన్‌లో ఈ లీగ్ ప్రారంభమవుతుంది. -
ఈసారి ఫెడరర్, నాదల్ పోరు
న్యూఢిల్లీ: ఈసారి జరిగే అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టాప్ ఆటగాళ్లతో భారీ స్థాయిలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 2 నుంచి 20 వరకు జరిగే ఈ లీగ్‌లో చిరకాల ప్రత్యర్థులు రోజర్ ఫెడరర్, రఫెల్ నాదల్ తమ ఆటతో అభిమానులను అలరించనున్నారు. డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ తరఫున నాదల్ బరిలోకి దిగబోతుండగా యూఏఈ రాయల్స్ నుంచి ఫెడరర్ ఆడుతున్నాడు. తొలి సీజన్లో ఫెడరర్ ఇండియన్ ఏసెస్ తరఫున ఆడగా ఈసారి జట్టు మారాడు. వీరిద్దరి మధ్య జరిగే సమరాన్ని భారత అభిమానులు వీక్షిం చే అవకాశం ఉంది. డిసెంబర్ 12న ఢిల్లీలో యూఏఈతో జరిగే మ్యాచ్‌లో ఈ ఇద్దరు టాప్ ఆటగాళ్లు ఆడతారు. ఇక భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కూడా రెండో సీజన్లో అరంగేట్రం చేయనున్నాడు. జపాన్ వారియర్స్ తరఫున తను సత్తా చూపనున్నాడు. ‘తొలి సీజన్లో అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్ల ఆటను ఆసియాలోని వివిధ నగరాల్లో అభిమానులు చూశారు. కొత్త ఫార్మాట్లో జరిగిన ఈ లీగ్‌ను అంతా ఎంతగానో ఆదరించారు. ఈసారి కూడా ఇంకా భారీ స్థాయిలో రాబోతుంది. పేస్ రాక లీగ్‌కు అదనపు బలాన్ని చేకూర్చుతుంది’ అని టోర్నీ ఎండీ మహేశ్ భూపతి తెలిపారు. -
ఐపీటీఎల్ చాంప్ ఇండియన్ ఏసెస్
దుబాయ్: తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టు విజేతగా అవతరించింది. శనివారంతో ముగిసిన ఈ లీగ్‌లో ఏసెస్ జట్టు 39 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం నాలుగు నగరాల్లో నాలుగు అంచెలుగా జరిగిన ఈ లీగ్‌లో సానియా మీర్జా, రోహన్ బోపన్న, మోన్ఫిల్స్, అనా ఇవనోవిచ్, సెడ్రిక్ పియోలిన్, రోజర్ ఫెడరర్, పీట్ సంప్రాస్, ఫాబ్రిస్ సాంతోరోలతో కూడిన ఏసెస్ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిదింటిలో గెలిచింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. యూఈఏ రాయల్స్ 37 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... 35 పాయింట్లతో మనీలా మావెరిక్స్ మూడో స్థానంలో నిలిచింది. 24 పాయింట్లతో సింగపూర్ స్లామర్స్ చివరిదైన నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. యూఏఈ రాయల్స్‌తో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ జట్టు 15-29 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-5తో మ్లాడెనోవిచ్‌ను ఓడించి ఏసెస్‌కు శుభారంభం అందించింది. అయితే తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఏసెస్ జట్టుకు ఓటమి ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జంట 2-6తో జిమోనిచ్-మ్లాడెనోవిచ్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌లో పియోలిన్-మోన్ఫిల్స్ ద్వయం 2-6తో జిమోనిచ్-ఇవానిసెవిచ్ జంట చేతిలో ఓడింది. లెజెండ్ సింగిల్స్‌లో పియోలిన్ 5-6తో ఇవానిసెవిచ్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. చివరి మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ 6-0తో మోన్ఫిల్స్ను చిత్తు చేశాడు. విజేతగా నిలిచిన ఏసెస్ జట్టుకు 10 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
మరోసారి వస్తా..: ఫెడరర్
`న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) సందర్భంగా భారత్‌కు వచ్చిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన రెండు రోజుల పర్యటన ముగించాడు. అయితే త్వరలోనే భారత్‌కు మరోసారి వచ్చి తగినంత సమయం గడుపుతానని అభిమానులకు హామీ ఇచ్చాడు. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, బిజీ షెడ్యూల్ కారణంగా ఈసారి ఎటూ వెళ్లలేకపోయానని చెప్పాడు. -
ఏసెస్ అదుర్స్
మనీలా మావెరిక్స్పై 26-25తో విజయం న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)ను ఇండియన్ ఏసెస్ విజయంతో ఆరంభించింది. శనివారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో మనీలా మావెరిక్స్‌తో హోరాహోరీగా సాగిన పోరులో ఏసెస్ 26-25 పాయింట్ల తేడాతో గట్టెక్కింది. ఆరంభంలో వెనుకబడినప్పటికీ చివర్లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో అభిమానులను అలరించింది. ఈ విజయంతో 24 పాయింట్లతో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-సానియా మీర్జా 5-6తో డానియల్ నెస్టర్, కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పురుషుల లెజెండ్ సింగిల్స్‌లోనూ సెడ్రిక్ పియొలైన్ 4-6తో మార్క్ ఫిలిప్పోసిస్ చేతిలో ఓటమి పాలవ్వడంతో ఏసెస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే కీలక పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న-గేల్ మోన్ఫిల్స్ 6-5తో జో విల్ఫ్రెడ్ సోంగా-ట్రీట్ హుయేపై నెగ్గి జోష్ నింపారు. కానీ పురుషుల సింగిల్స్‌లో మోన్ఫిల్స్ 4-6తో సోంగా చేతిలో ఓడిపోయాడు. అయితే మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ సూపర్ షోతో 6-2తో ఫ్లిప్కెన్స్పై నె గ్గడంతో ఇరు జట్లు చెరి 25 పాయింట్లతో సమాన ంగా నిలిచాయి. దీంతో ఏడు నిమిషాలపాటు జరిగిన సూపర్ షూటౌట్లో ఏసెస్ తరఫున మోన్ఫిల్స్ 1-0తో సోంగాపై నెగ్గి జట్టులో ఆనందం నింపాడు. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 29-16 తేడాతో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది. -
ఏసెస్‌కు మరో పరాజయం
సింగపూర్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో ఇండియన్ ఏసెస్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురయింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 20-25 స్వల్ప తేడాతో మనీలా మావెరిక్స్ చేతిలో ఓడింది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో పియోలిన్ (ఏసెస్) 4-6తో ఫిలిప్పోసిస్ చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో ఇవనోవిచ్ 6-2తో కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ను ఓడించినా... మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న, సానియా (ఏసెస్) ఓడారు. పురుషుల డబుల్స్‌లోనూ బోపన్న, మోన్ఫిల్స్ 2-6తో హుయే, సోంగా చేతిలో మట్టికరిచారు. పురుషుల సింగిల్స్‌లో మోన్ఫిల్స్ 6-5తో సోంగాను ఓడించాడు. మరో మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 27-25తో యూఏఈ రాయల్స్‌పై గెలిచింది. రేపటి (శనివారం) నుంచి ఐపీటీఎల్ ఢిల్లీలో జరుగుతుంది. -
ఏసెస్‌కు తొలి ఓటమి
ఐపీటీఎల్ సింగపూర్: వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో తొలి ఓటమి ఎదురైంది. హోరాహోరీగా సాగిన లీగ్ మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 24-23తో ఏసెస్ జట్టును ఓడించింది. నిర్ణీత ఐదు మ్యాచ్‌ల తర్వాత రెండు జట్ల స్కోరు 23-23 వద్ద సమం అయింది. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘సూపర్ షూటౌట్’ను నిర్వహించారు. గేల్ మోన్ఫిల్స్ (ఏసెస్), బెర్డిచ్ (సింగపూర్ స్లామర్స్) మధ్య జరిగిన ఈ షూటౌట్లో బెర్డిచ్ తొలుత ఆరు పాయింట్లు సాధించి విజేతగా నిలువడంతో సింగపూర్ విజయం ఖాయమైంది. అంతకుముందు మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ (సింగపూర్) 6-4తో అనా ఇవనోవిచ్ (ఏసెస్)ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) ద్వయం 6-3తో సెరెనా-బ్రూనో సోరెస్ జంటపై గెలిచింది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-2తో ఆండ్రీ అగస్సీ (సింగపూర్)పై నెగ్గాడు. పురుషుల సింగిల్స్‌లో బెర్డిచ్ (సింగపూర్) 6-2తో గేల్ మోన్ఫిల్స్ (ఏసెస్)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో లీటన్ హెవిట్-నిక్ కియోర్గిస్ (సింగపూర్) జోడీ 6-5తో రోహన్ బోపన్న-గేల్ మోన్ఫిల్స్ (ఏసెస్) జంటను ఓడించింది. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 26-21తో మనీలా మావెరిక్స్పై గెలిచింది. ప్రస్తుతం ఇండియన్ ఏసెస్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 15 పాయింట్లతో యూఏఈ రాయల్స్ రెండో స్థానంలో, 13 పాయింట్లతో మనీలా మావెరిక్స్ మూడో స్థానంలో, 10 పాయింట్లతో సింగపూర్ స్లామర్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. హెవిట్-కిర్గియోస్ జోడీ తమ విజయాన్ని ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిల్ హ్యూస్కు అంకితం ఇచ్చింది. -
ఎదురులేని ఇండియన్ ఏసెస్
యూఏఈ రాయల్స్‌పై 30-11తో గెలుపు ఐపీటీఎల్ సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ఎదురులేకుండా దూసుకెళుతోంది. మనీలా లెగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఏసెస్ తాజాగా సింగపూర్‌లోనూ తొలి మ్యాచ్‌లో నెగ్గింది. మంగళవారం యూఏఈ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-11 తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల విజయాలతో ఏసెస్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముందుగా మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-2తో క్రిస్టినా లడెనోవిక్‌పై గెలుపొందగా మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, సానియా మీర్జా జంట 6-5తో జిమోన్జిక్, లడెనోవిక్‌పై గెలుపొందింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో మోన్ఫిల్స్ 6-1తో మాలెక్ జాజిరిపై సునాయాసంగా నెగ్గాడు. లెజెండ్స్ సింగిల్స్‌లోనూ సాంటోరో 6-2తో జిమోన్జిక్ను మట్టికరిపించాడు. చివరగా పురుషుల డబుల్స్‌లో బోపన్న, మోన్ఫిల్స్ 6-1తో జిమోన్జిక్, మారిన్ సిలిచ్‌ను ఓడించారు. మరో మ్యాచ్‌లో మనీలా మావ్రిక్స్ 29-21తో సింగపూర్ స్లామర్స్‌పై గెలిచింది. ఢిల్లీలో డిమాండ్: సింగపూర్ లెగ్ తర్వాత ఈ నెల 6 నుంచి 8 వరకు ఢిల్లీలో ఐపీటీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లకు మొత్తం టిక్కెట్లు అమ్ముడయ్యాయని టోర్నీ సీఈఓ ఎరిక్ గాట్స్చాక్ చెప్పారు. మనీలా, సింగపూర్లలో తాము ఆశించిన స్థాయికి మించి ప్రేక్షకులు ప్రత్యక్షంగా టోర్నీని చూశారని చెప్పారు. -
ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’
మూడో మ్యాచ్‌లో 28-20తో యూఏఈ రాయల్స్‌పై గెలుపు ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ 28-20తో యూఏఈ రాయల్స్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 4-6తో క్రిస్టినా మల్డోనోవిచ్ చేతిలో ఓడింది. అయితే తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఏసెస్ ఆటగాళ్లు సత్తా చాటారు. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న ద్వయం 6-3తో జిమోన్జిక్-మల్డోనోవిచ్లపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో బోపన్న-మోన్ఫిల్స్ జోడి 6-4తో జిమోన్జిక్-సిలిచ్‌పై; సింగిల్స్‌లో మోన్ఫిల్స్ 6-3తో మాలెక్ జజీర్పై నెగ్గారు. పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో సంటారో 6-4తో ఇవానిసెవిచ్ను ఓడించి ఏసెస్‌కు స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో మనీలా మావెరిక్స్ 27-19తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది. ప్రస్తుతం ఏసెస్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో టాప్‌లో కొనసాగుతుండగా, రాయల్స్ 10, మనీలా 7, సింగపూర్ స్లామర్స్ 4 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఇండియన్ ‘ఏసెస్' హవా
ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు దూసుకెళ్తోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 24-15తో మనీలా మావెరిక్స్పై నెగ్గి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో ఫ్యాబ్రిక్ సంటారో 6-1తో డానియెల్ నెస్టర్పై నెగ్గాడు. అయితే పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో ఏసెస్‌కు చుక్కెదురైంది. సింగిల్స్‌లో మోన్ఫిల్స్ 1-6తో ఆండీ ముర్రే చేతిలో ఓడగా... డబుల్స్‌లో బోపన్న-మోన్ఫిల్స్ ద్వయం 0-6తో సోంగా-ట్రీట్ హుయే చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్‌లో హైదరాబాదీ సానియా మీర్జా-బోపన్న జోడీ 6-1తో ముర్రే-షరపోవా జంటపై నెగ్గడంతో పాయింట్ల పరంగా ఏసెస్‌కు కలిసొచ్చింది. చివర్లో జరిగిన మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-3తో షరపోవాపై నెగ్గి ఏసెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని అందించింది. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 28-22తో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది. -
ఇండియన్ ఏసెస్ శుభారంభం
మనీలా: టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)కు శుక్రవారం తెర లేచింది. ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల కలయికతో జరుగుతున్న ఈ లీగ్ తొలి అంచె పోటీలు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రారంభమయ్యాయి. తొలి పోరులో భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టు దుమ్ము రేపింది. సానియా మీర్జా, రోహన్ బోపన్న, అనా ఇవనోవిచ్, సాంటోరో, మోన్ఫిల్స్లతో కూడిన ఈ జట్టు 26-16 స్కోరుతో సింగపూర్ స్లామర్స్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో జట్టు నాలుగు పాయింట్లు సాధించింది. పురుషుల డబుల్స్ మినహా అన్ని మ్యాచ్‌లను నెగ్గిన ఏసెస్ లీగ్‌ను ఘనంగా ఆరంభించింది. ముందుగా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, సానియా మీర్జా జంట 6-4తో బ్రూనో సోర్స్, డానియేలా హంటుచోవాను ఓడించింది. ఆ తర్వాత పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంటోరో 6-5తో పాట్రిక్ రాఫ్టర్‌ను ఓడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు. అయితే పురుషుల డబుల్స్‌లో మాత్రం ఏసెస్‌కు చుక్కెదురైంది. బోపన్న, మోన్ఫిల్స్ జోడి 2-6తో నిక్ కిర్గియోస్, టామస్ బెర్డిచ్ చేతిలో ఓడిపోయింది. కానీ మహిళల సింగిల్స్‌లో మాత్రం అనా ఇవనోవిచ్ చెలరేగింది. 6-0తో హంతుచోవాను ఓడించింది. ఆ తర్వాత చివరిగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో మోన్ఫిల్స్ జట్టు విజయాన్ని పరిపూర్ణం చేశాడు. లీటన్ హెవిట్‌ను 6-1 తేడాతో ఓడించడంతో ఏసెస్ పాయింట్లు గణనీయంగా పెరిగాయి. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 29-24 తేడాతో మనీలా మావెరిక్స్‌ను ఓడించింది. -
యూఏఈ రాయల్స్ తరఫున సిలిచ్
దుబాయ్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో యూఏఈ రాయల్స్ జట్టు తరఫున యూఎస్ ఓపెన్ విజేత, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మారిన్ సిలిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ జట్టులో ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్‌తో పాటు బౌచర్డ్, వోజ్నియాకి, ఇవానిసెవిచ్, మాలెక్ జాజిరిలు ఉన్నారు. టెన్నిస్ క్రీడాకారులకు ఐపీటీఎల్ మంచి వేదికని, ఈ టోర్నీలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని సిలిచ్ అన్నాడు. భారత్, ఫిలిప్పీన్స్, సింగపూర్, దుబాయ్‌ల్లో జరిగే ఈ టోర్నీలో నాలుగు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనుంది. -
ఐపీటీఎల్‌లో ఫెడరర్
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) బరిలోకి దిగనున్నాడు. మైక్రోమ్యాక్స్ ‘ఇండియన్ ఏసెస్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మణికట్టు గాయంతో నాదల్ ఈ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో ఫెడరర్‌ను తీసుకున్నారు. ఇండియన్ ఏసెస్ జట్టు తరఫున సంప్రాస్, ఇవనోవిచ్, మోన్ఫిల్స్, సానియా, బోపన్నలు బరిలోకి దిగనున్నారు. సాంటారో రిజర్వ్ ప్లేయర్. ‘నమస్తే భారత్! తొలిసారి న్యూఢిల్లీకి రావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఫెడరర్ అన్నాడు. మనీలాలో నవంబర్ 28న ప్రారంభమయ్యే ఈ టోర్నీ డిసెంబర్ 13న దుబాయ్‌లో ముగుస్తుంది. ఢిల్లీలో డిసెంబర్ 6 నుంచి 8 వరకు పోటీలు జరుగుతాయి. -
ఐపీటీఎల్ సజావుగా...
మహేశ్ భూపతి స్పష్టీకరణ న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారమే అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) జరుగుతుందని నిర్వాహకుడు మహేశ్ భూపతి స్పష్టం చేశాడు. ఈ లీగ్ నుంచి పీవీపీ వెంచర్స్ వైదొలిగిందనే కథనాల ఆధారంగా ఐపీటీఎల్ భవిష్యత్ ఎలా ఉండబోతుందనే మీడియా ప్రశ్నలకు భూపతి సమాధానమిచ్చాడు. ‘అంతా మేం అనుకున్నట్టుగానే సాగుతోంది. గతంలో ముంబై ఫ్రాంచైజీ కోసం సచిన్‌తో కూడిన పీవీపీ వెంచర్స్ ప్రయత్నించిన మాట నిజమే. అయితే వారు ఆంధ్రలో ఎన్నికల హడావుడిలో పడి గడువులోగా నిర్ణీత సొమ్ము చెల్లించలేకపోయారు. అందుకే మేం మరో ఫ్రాంచైజీ కోసం చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టును మైక్రోమ్యాక్స్ కొనుగోలు చేసింది. పీవీపీ కూడా మరో జట్టును చూసుకోవచ్చని ఈమెయిల్లో పేర్కొంది’ అని భూపతి తెలిపాడు. వాస్తవానికి లండన్‌లో వింబుల్డన్ ప్రారంభానికి మూడు రోజుల ముందు ఆయా ఫ్రాంచైజీ యజమానులందరికీ వర్క్ షాప్ జరిగిందని, ఇక్కడ తమ ఆటగాళ్లైన నాదల్, జొకోవిచ్, ముర్రేలను వారు కలుసుకున్నారని చెప్పాడు. -
టెన్నిస్‌లోనూ మాస్టర్ ‘అడుగు’
ఐపీటీఎల్ జట్టును కొనుగోలు చేసిన సచిన్ పీవీపీ భాగస్వామ్యంతో లీగ్‌లో ప్రవేశం ముంబై: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఇతర క్రీడల వైపు కూడా దృష్టి సారిస్తున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే కొచ్చి ఫుట్‌బాల్‌ను జట్టును ఆదివారం కొనుగోలు చేసిన సచిన్ ఇప్పుడు టెన్నిస్‌లోకి ప్రవేశిస్తున్నాడు. ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం...ఈ ఏడాది చివర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో పాల్గొనే ముంబై జట్టును సచిన్ సొంతం చేసుకున్నాడు. ఫుట్‌బాల్‌లాగే ఈ లీగ్‌లోనూ పీవీపీ అధినేత ప్రసాద్ వి. పొట్లూరితో కలిసే టెండూల్కర్ జట్టు యజమానిగా మారడం విశేషం. ‘సచిన్‌లాంటి దిగ్గజంతో మరో సారి భాగస్వామి కావడం మా సంస్థ అదృష్టం. భవిష్యత్తులో దీర్ఘకాలం పాటు మా భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాం. గత రెండేళ్లుగా మేం క్రీడా సంబంధ వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టెన్నిస్ జట్లను సొంతం చేసుకున్నాం’ అని ఈ సందర్భంగా ప్రసాద్ వెల్లడించారు. ఐపీటీఎల్‌లో వరల్డ్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ముంబైతో పాటు దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ జట్లు బరిలో ఉన్నాయి. నవంబర్ 28నుంచి డిసెంబర్ 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. వేలంలో మొత్తం 28 మంది ఆటగాళ్ల కోసం దాదాపు 24 మిలియన్ డాలర్లు (రూ. దాదాపు 149 కోట్లు) వెచ్చించారు. ఇందులో ఒక్క నాదల్‌కే 2 మిలియన్ డాలర్లు (రూ. దాదాపు 12 కోట్లు) దక్కనున్నట్లు సమాచారం.