ఇండియన్ ఏసెస్ శుభారంభం
మనీలా: టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)కు శుక్రవారం తెర లేచింది. ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల కలయికతో జరుగుతున్న ఈ లీగ్ తొలి అంచె పోటీలు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రారంభమయ్యాయి. తొలి పోరులో భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టు దుమ్ము రేపింది. సానియా మీర్జా, రోహన్ బోపన్న, అనా ఇవనోవిచ్, సాంటోరో, మోన్‌ఫిల్స్‌లతో కూడిన ఈ జట్టు 26-16 స్కోరుతో సింగపూర్ స్లామర్స్‌ను మట్టికరిపించింది.
ఈ విజయంతో జట్టు నాలుగు పాయింట్లు సాధించింది. పురుషుల డబుల్స్ మినహా అన్ని మ్యాచ్‌లను నెగ్గిన ఏసెస్ లీగ్‌ను ఘనంగా ఆరంభించింది. ముందుగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, సానియా మీర్జా జంట 6-4తో బ్రూనో సోర్స్, డానియేలా హంటుచోవాను ఓడించింది. ఆ తర్వాత పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంటోరో 6-5తో పాట్రిక్ రాఫ్టర్‌ను ఓడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు. అయితే పురుషుల డబుల్స్‌లో మాత్రం ఏసెస్‌కు చుక్కెదురైంది.
బోపన్న, మోన్‌ఫిల్స్ జోడి 2-6తో నిక్ కిర్గియోస్, టామస్ బెర్డిచ్ చేతిలో ఓడిపోయింది. కానీ మహిళల సింగిల్స్‌లో మాత్రం అనా ఇవనోవిచ్ చెలరేగింది. 6-0తో హంతుచోవాను ఓడించింది. ఆ తర్వాత చివరిగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో మోన్‌ఫిల్స్ జట్టు విజయాన్ని పరిపూర్ణం చేశాడు. లీటన్ హెవిట్‌ను 6-1 తేడాతో ఓడించడంతో ఏసెస్ పాయింట్లు గణనీయంగా పెరిగాయి. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 29-24 తేడాతో మనీలా మావెరిక్స్‌ను ఓడించింది.