‘ఆ విద్యార్ధులను తీసుకురండి’ | Vijaysai Reddy Request To Minister Jaishankar Bring students stuck in Manila | Sakshi
Sakshi News home page

‘మనీలాలో చిక్కుకుపోయిన విద్యార్ధులను తీసుకురండి’

Published Thu, Mar 19 2020 7:16 PM | Last Updated on Thu, Mar 19 2020 7:32 PM

Vijaysai Reddy Request To Minister Jaishankar Bring students stuck in Manila - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా విమానాశ్రయంలో మూడు రోజులుగా చిక్కుబడిపోయిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది మెడికల్‌ విద్యార్ధులను తక్షణమే స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. తిండి, నీరు లేకుండా కటిక నేలపై నిద్రిస్తూ మనీలా ఎయిర్‌పోర్ట్‌లో తెలుగు విద్యార్ధులు పడుతున్న కష్టాలను ఆయన మంత్రికి వివరించారు. ఈ విద్యార్ధులంతా మనీలాలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా మనీలాలో విద్యా సంస్థలు మూసివేయడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులంతా మూడు రోజుల క్రితమే మనీలా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే మనీలా ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాల రాకపోకలు కూడా స్తంభించిపోవడంతో విద్యార్దులు దిక్కుతోచని స్థితిలో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు.

ఎయిర్‌పోర్ట్‌ మూసివేయడంతో తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేని దుర్భరమైన పరిస్థితుల్లో సహాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు. రవాణా వ్యవస్థ యావత్తు నిలిచిపోవడంతో వారు ఎయిర్‌పోర్ట్‌ నుంచి తమ హాస్టళ్ళకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మనీలా ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుబడిపోయిన 70 మంది  విద్యార్ధులలో 36 మంది యువతులు ఉన్నారని, టాయిలెట్‌ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారని మంత్రికి తెలియచేశారు. విద్యార్ధులు మనీలాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని విద్యార్ధులు వాపోతున్నట్లు మంత్రి జైశంకర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మనీలాలో చిక్కుబడిపోయిన విద్యార్ధులను స్వదేశానికి రప్పించాలని విజయసాయి రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement