సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ విపత్తుల సహాయనిధి నుంచి పరిహారం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ బుధవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపై మార్గదర్శకాలను రూపొందించాలని ఈ ఏడాది జూన్ 30న సుప్రీంకోర్టు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ)ని ఆదేశించినట్లు చెప్పారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. గడిచిన 16 నెలల్లో వంటగ్యాస్ ధరను 13 సార్లు సవరించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు. 2020 మార్చిలో సబ్సిడీపై సరఫరా చేసే గ్యాస్ సిలిండర్ ధర రూ.805 ఉండగా ప్రస్తుతం అది రూ.834 ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు బదులిచ్చారు. దేశవ్యాప్తంగా 9 విమానాశ్రయాలు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో నడుస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు.
ఉపాధి కల్పనలో తొలిస్థానంలో ఏపీ
ఉపాధిహామీ పథకంలో పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి లోక్‌సభలో తెలిపారు. ఏపీలో జూలై వరకు 71.90 లక్షల మందికి పని కల్పించారని బీజేపీ సభ్యుడు చున్నీలాల్ సాహూ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment