న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ విభజన అన్యాయంగా జరిగిందన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని.. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ కూడా మర్చిపోయిందని విమర్శించారు.
పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారని, అందుకు కాంగ్రెస్ కూడా అంగీకరించిందని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ ప్రభుత్వం అనేది కొనసాగింపు అని, ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ వైఫల్యం వల్లే ఏపీకే అన్యాయం..
హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యం వల్లే ఏపీకే అన్యాయం జరిగిందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. అందుకే ఆ రెండు పార్టీలకు ఏపీ ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, బీజేపీకి అరశాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇది ముగిసిన అధ్యయమని బీజేపీ చెప్తోందని.. కానీ ప్రత్యేక హోదా వచ్చేవరకు మా పోరాటం కొనసాగి తీరుతుందని స్పష్టం చేశారు.
రాజధాని అధికారం రాష్ట్రాలదే!
వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు తీసుకొచ్చామని.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది తమ ధ్యేయమని మరోసారి స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్ణయించే అధికారం లేదని చెప్పిన హైకోర్టు.. ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించిందని అన్నారు. రాజధాని నిర్ణయించే అధికారం ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని పార్లమెంట్‌లో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయ స్థానాలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని హరించే అధికారం లేదని అన్నారు. రాజధాని అనేది రాష్ట్రాలు సంబంధించిన అంశమని.. రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలనేది రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయని తెలిపారు.
ఏపీ విషయంలో ఎందుకు వివక్ష?
తమ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించుకుందని.. రాష్ట్ర పరిధిలో రాజధాని ఎక్కడ ఉండాలో తాము నిర్ణయించుకుంటామని తెలిపారు. యూపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఉదాహరణంగా ప్రస్తావించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలో సెక్రటేరియట్ ఉంటే అలహాబాద్‌లో హైకోర్టు ఉందని తెలిపారు. దీని ప్రకారం అక్కడి ఇప్పటికే రెండు రాజధానులు ఇప్పటికే అమల్లో ఉన్నాయని.. మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు.
ఏపీపై కేంద్రం సవితి తల్లి ప్రేమ
అదే విధంగా మెట్రో విషయంలో ఏపీ పట్ల కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వైజాగ్ మెట్రోకు కేంద్రం నిధులివ్వడం లేదని.. ముమ్మాటికీ ఏపీపై కేంద్ర సవితితల్లి ప్రేమ చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: జగన్ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ భేటీ.. పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment