ఐపీటీఎల్ సజావుగా...
మహేశ్ భూపతి స్పష్టీకరణ
న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారమే అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) జరుగుతుందని నిర్వాహకుడు మహేశ్ భూపతి స్పష్టం చేశాడు. ఈ లీగ్ నుంచి పీవీపీ వెంచర్స్ వైదొలిగిందనే కథనాల ఆధారంగా ఐపీటీఎల్ భవిష్యత్ ఎలా ఉండబోతుందనే మీడియా ప్రశ్నలకు భూపతి సమాధానమిచ్చాడు. ‘అంతా మేం అనుకున్నట్టుగానే సాగుతోంది. గతంలో ముంబై ఫ్రాంచైజీ కోసం సచిన్‌తో కూడిన పీవీపీ వెంచర్స్ ప్రయత్నించిన మాట నిజమే.
అయితే వారు ఆంధ్రలో ఎన్నికల హడావుడిలో పడి గడువులోగా నిర్ణీత సొమ్ము చెల్లించలేకపోయారు. అందుకే మేం మరో ఫ్రాంచైజీ కోసం చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టును మైక్రోమ్యాక్స్ కొనుగోలు చేసింది. పీవీపీ కూడా మరో జట్టును చూసుకోవచ్చని ఈమెయిల్‌లో పేర్కొంది’ అని భూపతి తెలిపాడు. వాస్తవానికి లండన్‌లో వింబుల్డన్ ప్రారంభానికి మూడు రోజుల ముందు ఆయా ఫ్రాంచైజీ యజమానులందరికీ వర్క్ షాప్ జరిగిందని, ఇక్కడ తమ ఆటగాళ్లైన నాదల్, జొకోవిచ్, ముర్రేలను వారు కలుసుకున్నారని చెప్పాడు.