ఎదురులేని ఇండియన్ ఏసెస్
యూఏఈ రాయల్స్‌పై 30-11తో గెలుపు
ఐపీటీఎల్
సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ఎదురులేకుండా దూసుకెళుతోంది. మనీలా లెగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఏసెస్ తాజాగా సింగపూర్‌లోనూ తొలి మ్యాచ్‌లో నెగ్గింది. మంగళవారం యూఏఈ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-11 తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల విజయాలతో ఏసెస్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముందుగా మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-2తో క్రిస్టినా లడెనోవిక్‌పై గెలుపొందగా మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, సానియా మీర్జా జంట 6-5తో జిమోన్జిక్, లడెనోవిక్‌పై గెలుపొందింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో మోన్‌ఫిల్స్ 6-1తో మాలెక్ జాజిరిపై సునాయాసంగా నెగ్గాడు. లెజెండ్స్ సింగిల్స్‌లోనూ సాంటోరో 6-2తో జిమోన్జిక్‌ను మట్టికరిపించాడు. చివరగా పురుషుల డబుల్స్‌లో బోపన్న, మోన్‌ఫిల్స్ 6-1తో జిమోన్జిక్, మారిన్ సిలిచ్‌ను ఓడించారు. మరో మ్యాచ్‌లో మనీలా మావ్రిక్స్ 29-21తో సింగపూర్ స్లామర్స్‌పై గెలిచింది.
ఢిల్లీలో డిమాండ్: సింగపూర్ లెగ్ తర్వాత ఈ నెల 6 నుంచి 8 వరకు ఢిల్లీలో ఐపీటీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లకు మొత్తం టిక్కెట్లు అమ్ముడయ్యాయని టోర్నీ సీఈఓ ఎరిక్ గాట్స్‌చాక్ చెప్పారు. మనీలా, సింగపూర్‌లలో తాము ఆశించిన స్థాయికి మించి ప్రేక్షకులు ప్రత్యక్షంగా టోర్నీని చూశారని చెప్పారు.