ఈసారి ఫెడరర్, నాదల్ పోరు
న్యూఢిల్లీ: ఈసారి జరిగే అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టాప్ ఆటగాళ్లతో భారీ స్థాయిలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 2 నుంచి 20 వరకు జరిగే ఈ లీగ్‌లో చిరకాల ప్రత్యర్థులు రోజర్ ఫెడరర్, రఫెల్ నాదల్ తమ ఆటతో అభిమానులను అలరించనున్నారు. డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ తరఫున నాదల్ బరిలోకి దిగబోతుండగా యూఏఈ రాయల్స్ నుంచి ఫెడరర్ ఆడుతున్నాడు. తొలి సీజన్‌లో ఫెడరర్ ఇండియన్ ఏసెస్ తరఫున ఆడగా ఈసారి జట్టు మారాడు.
వీరిద్దరి మధ్య జరిగే సమరాన్ని భారత అభిమానులు వీక్షిం చే అవకాశం ఉంది. డిసెంబర్ 12న ఢిల్లీలో యూఏఈతో జరిగే మ్యాచ్‌లో ఈ ఇద్దరు టాప్ ఆటగాళ్లు ఆడతారు. ఇక భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కూడా రెండో సీజన్‌లో అరంగేట్రం చేయనున్నాడు. జపాన్ వారియర్స్ తరఫున తను సత్తా చూపనున్నాడు. ‘తొలి సీజన్‌లో అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్ల ఆటను ఆసియాలోని వివిధ నగరాల్లో అభిమానులు చూశారు. కొత్త ఫార్మాట్‌లో జరిగిన ఈ లీగ్‌ను అంతా ఎంతగానో ఆదరించారు. ఈసారి కూడా ఇంకా భారీ స్థాయిలో రాబోతుంది. పేస్ రాక లీగ్‌కు అదనపు బలాన్ని చేకూర్చుతుంది’ అని టోర్నీ ఎండీ మహేశ్ భూపతి తెలిపారు.