ఐపీటీఎల్ చాంప్ ఇండియన్ ఏసెస్
దుబాయ్: తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టు విజేతగా అవతరించింది. శనివారంతో ముగిసిన ఈ లీగ్‌లో ఏసెస్ జట్టు 39 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం నాలుగు నగరాల్లో నాలుగు అంచెలుగా జరిగిన ఈ లీగ్‌లో సానియా మీర్జా, రోహన్ బోపన్న, మోన్‌ఫిల్స్, అనా ఇవనోవిచ్, సెడ్రిక్ పియోలిన్, రోజర్ ఫెడరర్, పీట్ సంప్రాస్, ఫాబ్రిస్ సాంతోరోలతో కూడిన ఏసెస్ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిదింటిలో గెలిచింది.
మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. యూఈఏ రాయల్స్ 37 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... 35 పాయింట్లతో మనీలా మావెరిక్స్ మూడో స్థానంలో నిలిచింది. 24 పాయింట్లతో సింగపూర్ స్లామర్స్ చివరిదైన నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
యూఏఈ రాయల్స్‌తో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ జట్టు 15-29 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-5తో మ్లాడెనోవిచ్‌ను ఓడించి ఏసెస్‌కు శుభారంభం అందించింది.
అయితే తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఏసెస్ జట్టుకు ఓటమి ఎదురైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జంట 2-6తో జిమోనిచ్-మ్లాడెనోవిచ్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌లో పియోలిన్-మోన్‌ఫిల్స్ ద్వయం 2-6తో జిమోనిచ్-ఇవానిసెవిచ్ జంట చేతిలో ఓడింది. లెజెండ్ సింగిల్స్‌లో పియోలిన్ 5-6తో ఇవానిసెవిచ్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. చివరి మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ 6-0తో మోన్‌ఫిల్స్‌ను చిత్తు చేశాడు. విజేతగా నిలిచిన ఏసెస్ జట్టుకు 10 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.