టెన్నిస్‌లోనూ మాస్టర్ ‘అడుగు’
ఐపీటీఎల్ జట్టును కొనుగోలు చేసిన సచిన్
పీవీపీ భాగస్వామ్యంతో లీగ్‌లో ప్రవేశం
ముంబై: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఇతర క్రీడల వైపు కూడా దృష్టి సారిస్తున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే కొచ్చి ఫుట్‌బాల్‌ను జట్టును ఆదివారం కొనుగోలు చేసిన సచిన్ ఇప్పుడు టెన్నిస్‌లోకి ప్రవేశిస్తున్నాడు. ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం...ఈ ఏడాది చివర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో పాల్గొనే ముంబై జట్టును సచిన్ సొంతం చేసుకున్నాడు.
ఫుట్‌బాల్‌లాగే ఈ లీగ్‌లోనూ పీవీపీ అధినేత ప్రసాద్ వి. పొట్లూరితో కలిసే టెండూల్కర్ జట్టు యజమానిగా మారడం విశేషం. ‘సచిన్‌లాంటి దిగ్గజంతో మరో సారి భాగస్వామి కావడం మా సంస్థ అదృష్టం. భవిష్యత్తులో దీర్ఘకాలం పాటు మా భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాం. గత రెండేళ్లుగా మేం క్రీడా సంబంధ వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నాం.
అందులో భాగంగానే బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టెన్నిస్ జట్లను సొంతం చేసుకున్నాం’ అని ఈ సందర్భంగా ప్రసాద్ వెల్లడించారు. ఐపీటీఎల్‌లో వరల్డ్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ముంబైతో పాటు దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ జట్లు బరిలో ఉన్నాయి.
నవంబర్ 28నుంచి డిసెంబర్ 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. వేలంలో మొత్తం 28 మంది ఆటగాళ్ల కోసం దాదాపు 24 మిలియన్ డాలర్లు (రూ. దాదాపు 149 కోట్లు) వెచ్చించారు. ఇందులో ఒక్క నాదల్‌కే 2 మిలియన్ డాలర్లు (రూ. దాదాపు 12 కోట్లు) దక్కనున్నట్లు సమాచారం.