సచిన్, గంగూలీ కొత్త ఆట
ఫుట్‌బాల్ జట్లను కొనుగోలు చేసిన మాస్టర్, దాదా
సచిన్‌కు కొచ్చి... గంగూలీకి కోల్‌కతా
సల్మాన్, జాన్ అబ్రహమ్ రణ్‌బీర్ ఖాతాలోనూ జట్లు
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రూటు మార్చాడు. రెండు దశాబ్దాలపాటు క్రికెట్‌తో మమేకపోయిన అతను ఇప్పుడు ఫుట్‌బాల్ వైపు దృష్టి సారించాడు. ఐపీఎల్ తరహాలోనే ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో అతను ఓ జట్టుకు యజయానిగా మారాడు. ఆదివారం ఐఎస్‌ఎల్‌కు చెందిన ఎనిమిది జట్ల కొనుగోలు కోసం జరిగిన బిడ్డింగ్ ఫలితాలను వెల్లడించారు. దీంట్లో మాస్టర్, పీవీపీ వెంచర్స్‌తో కలిసి కొచ్చి టీమ్‌ను దక్కించుకున్నాడు.
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో కూడా పీవీపీకి భాగస్వామ్యముంది. అలాగే చిన్నప్పటి నుంచీ ఈ ఆటను అమితంగా ఆరాధించే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోల్‌కతా జట్టుకు యజమానిగా మారాడు. స్పానిష్ లీగ్‌లో పేరున్న అట్లెటికో మాడ్రిడ్ క్లబ్, వ్యాపారవేత్త హర్షవర్థన్ నియోటియా, సంజీవ్ గోయెంకా, ఉత్సవ్ పరేఖ్‌లతో కలిసి దాదా కన్సార్టియంగా మారాడు.
సెప్టెంబర్-నవంబర్ మధ్యకాలంలో ఈ లీగ్ ఆయా నగరాల్లో జరుగుతుంది. ఐఎంజీ-రిలయన్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ లీగ్‌పై బాలీవుడ్ నటులు కూడా ఓ కన్నేసారు. సల్మాన్ ఖాన్ పుణే.. రణ్‌బీర్ కపూర్ ముంబై, జాన్ అబ్రహమ్ గువాహటి జట్లను గెలుచుకున్నారు. వీరంతా ఫ్రాంచైజీ ఫీజు కింద పదేళ్ల పాటు ఏడాదికి రూ. 10 నుంచి 15 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఐకాన్స్‌గా దిగ్గజ ఆటగాళ్లు
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అండదండలు ఉన్న ఈ లీగ్‌లో ఐకాన్ ప్లేయర్లుగా దిగ్గజ ఆటగాళ్ల పేర్లు కనిపించనున్నాయి. ఫ్రాన్స్ అంతర్జాతీయ ఆటగాడు రాబర్ట్ పైర్స్, స్వీడన్, అర్సెనల్ మాజీ ఆటగాడు ఫ్రెడ్రిక్ జుంగ్‌బర్గ్‌లాంటి ఆటగాళ్లు అభిమానులను అలరించనున్నారు.
ఈ లీగ్‌లో బిడ్డింగ్ వేసేందుకు 30కి పైగా కంపెనీలు ఆసక్తి ప్రదర్శించాయని నిర్వాహకులు తెలిపారు. భారత్‌లో ఇక ఫుట్‌బాల్‌కు దశ తిరగనుందని వారు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సలహాదారు సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఆధ్వర్యంలో ఏడుగురితో కూడిన జ్యూరీ ప్యానెల్ బిడ్డింగ్ ఫలితాలను ప్రకటించింది.
దేశంలోని సెలబ్రిటీలు, ప్రముఖ కంపెనీలు ఐఎస్‌ఎల్‌పై పెట్టుబడులు పెట్టడంతో మున్ముందు సహజంగానే అందరి దృష్టీ ఈ లీగ్‌పై పడనుంది. మొదట తొమ్మిది ఫ్రాంచైజీలు అనుకున్నప్పటికీ చివర్లో చెన్నైని రద్దు చేశారు. గతే డాదే ఈ లీగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా వాయిదా పడింది.
మరోవైపు కేరళలో ఫుట్‌బాల్ ప్రస్తుతం క్షీణ దశకు చేరుకుందని, ఈ లీగ్ పుణ్యమా అని పునర్‌వైభవం దక్కడం ఖాయమని మాజీ కెప్టెన్ ఐఎం. విజయన్ అభిప్రాయపడ్డాడు.కొచ్చి క్లబ్‌ను అభివృద్ధి చేయడమే మా ప్రాధాన్యత. దక్షిణాదిలో ఫుట్‌బాల్ పట్ల ఉన్న ఆసక్తి మా లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ఆట పట్ల ఆసక్తిని మరింతగా పెంచుతాం అని పొట్లూరి వరప్రసాద్ చెప్పారు.