ఫెడరర్ షో
నేటి నుంచి ఢిల్లీలో ఐపీటీఎల్
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా టీవీల్లోనే చూసిన టెన్నిస్ స్టార్స్ రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్‌ల ఆటతీరును ఇక భారత అభిమానులు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కలగనుంది. ఫిలిప్పీన్స్, సింగపూర్‌లో విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) మూడో అంచె పోటీలు నేటి (శనివారం) నుంచి ఢిల్లీలో జరుగనున్నాయి.
ఇప్పటిదాకా పోటీలకు దూరంగా ఉన్న ఫెడరర్, జొకోవిచ్ తొలిసారిగా తమ జట్ల తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఇండియన్ ఏసెస్ తరఫున ఫెడరర్, యూఏఈ రాయల్స్ తరఫున నొవాక్ జొకోవిచ్ అభిమానులను అలరించనున్నారు. సోమవారం వరకు భారత్‌లో ఐపీటీఎల్ జరుగుతుంది.
ఇండియన్ ఏసెస్ ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ‘ఫెడరర్, జొకోవిచ్, సంప్రాస్‌ల కోసం భారత అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారు కూడా ఇక్కడికి రావడానికి ఉత్సుకతతో ఉన్నారు. ఫెడరర్ కేవలం భారత్‌లో జరిగే పోటీలకు మాత్రమే హాజరుకానున్నాడు. దుబాయ్‌లో జరిగే చివరి లెగ్‌కు అందుబాటులో ఉండడు’ అని టోర్నీ నిర్వాహకుడు మహేశ్ భూపతి తెలిపారు. ఫెడరర్ చివరిసారిగా 2006లో యూనిసెఫ్ తరఫున భారత్‌కు వచ్చాడు.
దిగ్గజం ఫెడరర్‌తో కలిసి ఆడాలన్న సానియా కల నిజం కాబోతుంది. ఆదివారం, సోమవారం జరిగే మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫెడరర్, సానియా జతగా బరిలోకి దిగనున్నారు. ఫెడరర్‌తో కలిసి ఆడే అవకాశం రావడంపట్ల సానియా అమితానందం వ్యక్తం చేసింది.