గతేడాది ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)పై విమర్శలు కురిపించిన భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ మనసు మార్చుకున్నాడు.
చెన్నై : గతేడాది ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)పై విమర్శలు కురిపించిన భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ మనసు మార్చుకున్నాడు. ఈ సీజన్‌కు తను అందుబాటులో ఉంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈనెల 12న లీగ్ కోసం ఆటగాళ్ల ఎంపిక జరగనున్న నేపథ్యంలో పేస్ అందుబాటులో ఉంటాననడం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే గత సీజన్‌లో సింగపూర్, మనీలా, న్యూఢిల్లీ, దుబాయ్ జట్లు మాత్రమే బరిలోకి దిగాయి. కానీ ఈసారి ఐదో జట్టుగా బ్యాంకాక్, మకావ్ సిటీ, కౌలాలంపూర్, జకార్తా, టోక్యోలలో ఒకదాన్ని ఎంపిక చేయనున్నారు.
గతేడాది ఏప్రిల్‌లో మహేశ్ భూపతి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఐపీటీఎల్‌పై పేస్ అనేక అనుమానాలు వ్యక్తం చేశాడు. లీగ్‌లో పారదర్శకత లేదని, ఎక్కువకాలం కొనసాగడం కష్టమేనని వ్యాఖ్యానించాడు. అయితే ఫెడరర్, జొకోవిచ్, సంప్రాస్, సెరెనా బరిలోకి దిగడంతో లీగ్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు లీగ్ విషయంలో కాస్త వెనక్కి తగ్గిన పేస్ ఇప్పుడు 2015 సీజన్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించడం విశేషం.